
సాక్షి, గుంటూరు: ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వంతో.. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం ప్రాణభయంతో విలవిల్లాడుతోంది. దాదాపు మూడు వేల జనాభా ఉన్న ఆ గ్రామంలో.. 45 మరణాలు సంభవించాయి. అధికారుల లెక్కలు ఎలా ఉన్నా.. ఏడాది కాలంలో 100 మంది చనిపోయారని గ్రామస్తులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం నేతలు గురువారం గ్రామంలో పర్యటించారు.
‘‘ఇవి సహజ మరణాలు కాదు అసహజ మరణాలు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇంత వ్యవహారం జరుగుతున్న ఎందుకు కళ్ళు తెరవలేదు?. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారు?. జిల్లా మంత్రి లోకేష్ ఇప్పటిదాకా ఎందుకు పర్యటించలేదు?. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడున్నారు?.
ప్రభుత్వం ముందుగానే స్పందించి ఉంటే మరణాలు ఆగిపోయేవని.. ఇంతవరకు మరణాలకు సంబంధించి కారణాలు కనుక్కోలేకపోయారని మండిపడ్డారు. ఈ మరణాలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. చనిపోయిన కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలి. ప్రభుత్వం ఇకనైనా ప్రజల ప్రాణాలను ప్రాధాన్యతగా తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారాయన. ఈ క్రమంలో సీపీఎం నేతలు ఇంటింటికి వెళ్లి వరుస మరణాలపై వివరాలు తెలుసుకున్నారు.
వరుస మరణాలతో గ్రామంలో పరిస్థితి అదుపు తప్పింది. తమ ఊరికి బయటి నుంచి జనాలు కూడా రాలేకపోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోంది. వైద్యారోగ్య శాఖ సర్వేల పేరుతో కాలయాపన చేస్తోంది. విషయం తెలిసిన తర్వాత కూడా వేగంగా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. విమర్శల నేపథ్యంలో.. మరణాలకు కారణాలేమిటో తెలుసుకునేందుకు గుంటూరు వైద్యకళాశాలలోని ఆరు విభాగాల నుంచి నిపుణులైన వైద్యులు, సాంకేతిక బృందం, వైద్యారోగ్య శాఖ అధికారులు వచ్చి వైద్యశిబిరం నిర్వహించారు. మరణాలకు ఇన్‌ఫెక్షన్ మెలియాయిడోసిస్ ఈ పరిస్థితికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.