
కంటెంట్ బాగుంటే చాలు సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. మరికొన్ని చిత్రాలేమో థియేటర్లలో అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. ఇక థియేటర్ల సంగతి పక్కనపెడితే.. ఓటీటీలో ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ఆ జోనర్‌లో వచ్చిన చిత్రాలు డిజిటల్‌గా దూసుకెళ్తున్నాయి. ఇటీవల ఆర్‌కే సాగర్, మిషా నారంగ్ జోడీగా నటించిన టాలీవుడ్ థ్రిల్లర్ మూవీ ది 100. ఈ మూవీలో ధన్యా బాలకృష్ణ కీలకపాత్రలో నటించింది. జూలై 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పోలీస్ థ్రిల్లర్ మూవీకి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రమేశ్ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మించారు.
ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఆగస్టు 29 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మెప్పించిన ఈ సినిమా ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. ఇండియా వ్యాప్తంగా టాప్-3లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. కాగా.. ఈ చిత్రంలో ఆర్కే సాగర్ ఐపీఎల్ అధికారి విక్రాంత్ పాత్రలో మెప్పించారు.
ఈ విషయాన్ని దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. మా సినిమా ది 100 అమెజాన్ ప్రైమ్‌లో భారతదేశంలో టాప్ -3లో ట్రెండింగ్ అవుతోంది. మా సినిమాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీ ప్రేమ, ప్రోత్సాహమే ఈ ఘనతకు కారణమని సంతోషం వ్యక్తం చేశారు.