
మలయాళంలో బడ్జెట్ తక్కువ కంటెంట్ ఎక్కువ ఉండేలా సినిమాలను నిర్మిస్తుంటారు. ఈ మధ్య మలయాళం నుంచి వచ్చిన చిత్రాలు తెలుగులో కూడా బాగానే అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి మూవీస్ ఓటీటీలో మంచి ఆదరణతో దూసుకెల్తున్నాయి. దీంతో తెలుగు వర్షన్‌లో కూడా స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. తాజాగా హార్ట్ టచ్చింగ్ మూవీ "సూత్రవాక్యం" (Soothravakyam) మలయాళంలో మంచి విజయం అందుకుంది. కొద్దిరోజుల క్రితమే అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video)లో కూడా విడుదలైంది. ఇందులో దసరా విలన్ షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) హీరోగా అద్భుతంగా నటించాడు. విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోర్, మీనాక్షి మాధవి, దివ్య ఎం. నాయర్ కీలక పాత్రలు పోషించారు. యూజియాన్ జాస్ చిరమ్మల్ దర్శకుడిగా ఈ మూవీతో పరిచయం అయ్యాడు. నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించడం విశేషం.

కథేంటి..?
పోలీస్ స్టేషన్‌కు నేరాలు చేసినవాళ్లతో పాటు ఆ నేరాలకు బలైన బాధితులు మాత్రమే ఎందుకు వెళ్లాలి..? ఖాళీ సమయాల్లో పోలీసు సిబ్బంది... పిల్లలకు పాఠాలు ఎందుకు చెప్పకూడదు..? పోలీసుల్ని చూసి భయపడే సంస్కృతి ఇంకా ఎందుకు కొనసాగాలనే ఒక గొప్ప విప్లవాత్మకమైన ఆలోచనతో "సూత్రవాక్యం" తెరకెక్కించారు. క్రిస్టో జేవియర్ (షైన్ టామ్ చాకో) పోలీస్ ఆఫీసర్. నిమిషా (విన్సీ లోషియస్) మ్యాథ్స్ టీచర్, వివేక్ పాత్రలో దీపక్ పరంబోల్, ఆర్య పాత్రలో అనఘా నటించారు. ఈ సినిమా కథ అంతా వీరి చుట్టే ఎక్కువగా ఉంటుంది. క్రిస్టో జేవియర్ తన విధులతో పాటు పిల్లలకు పాఠాలు కూడా చెబుతాడు. అయితే, అక్కడి పిల్లలు స్కూల్‌కు వెళ్లకుండా క్రిస్టో చెబుతున్న పాఠాలు వినేందుకు మాత్రమే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఈ విషయం నిమిషా టీచర్‌కు నచ్చదు. దీంతో తన ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేస్తుంది.
అతని దగ్గరికి 11వ తరగతి చదివే ఆర్య (అనఘా) కూడా ట్యూషన్‌కు వస్తుంది. ఆమె అన్నయ్య అయిన వివేక్ (దీపక్ పరంబోర్) ఎప్పుడూ ఆమెను వేధిస్తూ ఉంటాడు. ఇదే విషయం గురించి ఒకసారి వివేక్‌కు క్రిస్టో జేవియర్ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. అయినా అతనిలో మార్పు రాదు. ఇంతకు తన చెల్లి మీద వివేక్‌కు ఎందుకు కోపం..? ఆమెపై దాడి చేసి ఎక్కడికి వెళ్లిపోయాడు..? ఈ క్రమంలో ఊహించని పరిస్థితుల్లో వివేక్ ఎలా చనిపోతాడు..? అతడి ఆచూకీ తెలుసుకోవాలని క్రిస్టో జేవియర్ చేసిన ఇన్వెస్టిగేషన్‌లో మరో యువతి మర్డర్ కేసు ఎలా బయట పడింది..? రెండు హత్యల వెనుక ఉన్నదెవరు..? ఎంతో ఉత్కంఠతో సాగిన విచారణలో క్రిస్టో జేవియర్ ఫైనల్‌గా హంతకులను ఎలా పట్టుకున్నాడు అనేది సినిమాలో చూడాల్సిందే.

ఎలా ఉందంటే..?
మలయాళం సినిమా కథలు మొదట చాలా నెమ్మదిగా మొదలవుతాయి. సూత్రవాక్యం మూవీ కూడా అంతే.., అయితే, కాస్త ఒపికతో ఫస్ట్ 20 నిమిషాలు చూస్తే ఆ తర్వాత చాలా ఉత్కంఠతో ఈ చిత్రాన్ని చూస్తారు. సినిమా ప్రారంభంలోనే పోలీస్ స్టేషన్‌లోనే ట్యూషన్లు చెప్పే పోలీసు కాన్సెప్ట్ మొదలౌతుంది. దానికి ఒక టీజర్ బాధ పడటం వంటి సీన్లు ఎంగేజ్ చేస్తాయి. స్టోరీ మధ్యలో ఆ గ్రామం పొలిమేరలో ఉన్న ఒక బావి స్టోరీ ఆసక్తిగా చెప్పడం వంటి సంఘటనలు పర్వాలేదనిపిస్తాయి. కథలో వివేక్ మరణంతో సినిమా పరుగులు పెడుతుంది.
ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్‌ను పంచుతుంది. పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్ ఎక్కడా కూడా బోర్ కొట్టదు. వివేక్ హత్య కేసు విచారణలో ఉండగానే మరో యువతి మర్డర్ కేసు బయటకు వస్తుంది. ఇలాంటి ట్విస్ట్‌లు సినిమాకు మరింత బలాన్ని ఇస్తాయి. అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న సూత్రవ్యాక్యం కేవలం 1 గంటా 52 నిమిషాలు మాత్రమే రన్ టైమ్ ఉంది. కుటుంబంతో పాటుగా చూడొచ్చు.