
చైనా టియాంజిన్ వేదికగా జరిగిన షాంగై సదస్సు తర్వాత.. భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు ద్వైపాక్షికంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే హోటల్‌లో భేటీ జరిగింది కేవలం 15 నిమిషాలుకాగా, మరో 45 నిమిషాల ఇద్దరూ కారులోనే ప్రయాణించారు. ఈ ప్రయాణంలో వాళ్లేం మాట్లాడుకున్నారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమైంది.
షాంగై సదస్సు కోసం మోదీ రెండ్రోజులపాటు చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. సదస్సు వేదికగా.. పహల్గాం ఉగ్రదాడిపై సభ్యదేశాల మద్దతును తీర్మానం రూపంలో కూడగట్టారాయన. అయితే సోమవారం సదస్సు తర్వాత.. మోదీ కోసం పుతిన్ 10 నిమిషాలు ఎదురు చూశారు. ఆపై మోదీతో కలిసి తన ప్రత్యేకమైన ఆరుస్ లిమోసిన్Aurus limousine కారులో మాట్లాడుకుంటూ ప్రయాణించారు.
అమెరికాతో భారత్‌కు టారిఫ్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఈ ఇద్దరూ భేటీ కావడం, పైగా ఆ కారు చాలా ప్రత్యేకమైన భద్రతా వ్యవస్థతో కూడుకున్నది కావడంతో ఆటోమేటిక్‌గా ఏం మాట్లాడుకున్నారనే ప్రశ్న ఎదురైంది. అయితే అందులో పెద్ద రహస్యం ఏం లేదని చైనా పర్యటనలోనే ఉన్న పుతిన్ చెప్పుకొచ్చారు.
‘‘అందులో సీక్రెట్ ఏం లేదు. ఆలస్కా సదస్సులో జరిగిన పరిణామాలను ఆయనకు వివరించా’’ అని ప్రెస్‌మీట్‌లో పుతిన్ చెప్పారు. అంతేకాదు.. అలస్కా భేటీ సమయంలోనూ ఆయన ట్రంప్‌తో కారులో ప్రయాణించిన విషయంపైనా క్లారిటీ ఇచ్చారు.
అలస్కా యాంకరేజ్ ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత పుతిన్, ట్రంప్‌కు చెందిన లిమోసిన్ ‘ది బీస్ట్’లో భేటీ జరగాల్సిన ప్రాంతం వద్దకు ప్రయాణించారు. అయితే.. ఎయిర్‌పోర్ట్ నుంచి వేదిక చాలా దగ్గర. అందుకే తమ మధ్య కేవలం 30 సెకన్లపాటే మాటలు జరిగాయని.. అదీ కూడా బ్రోకెన్ ఇంగ్లీష్‌లోనే సాగిందని అన్నారు. ఆ సమయంలో.. ట్రంప్ పూర్తి ఆరోగ్యవంతంగా కనిపించడంతో తాను సంతోషం వ్యక్తం చేశానని పుతిన్ అన్నారు.
మరోవైపు.. రష్యా నేషనల్ రేడియో స్టేషన్ ‘వెస్టిఎఫ్‌ఎమ్’ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. మోదీ-పుతిన్‌లు తమ బృందాలతో చైనాలోని ఓ హోటల్‌లో భేటీ అయ్యారు. అంతకంటే ముందు.. ఆ వేదికకు చేరే క్రమంలో కారులో సుదీర్ఘంగా సంభాషించుకున్నారు అని తెలిపింది. మరోవైపు.. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ.. పుతిన్-మోదీ ముఖాముఖి మాట్లాడుకున్నారు. ఆయన(పుతిన్) తమ సంభాషణ మధ్యలో ఎలాంటి అంతరాయం కలగకూడదని భావించే కారులో ప్రయాణించారు’’ అని తెలిపారు.
ఇదిలా ఉంటే.. రష్యాతో చమురు, ఆయుధాల కొనుగోళ్లు నేపథ్యంతో ట్రంప్ భారత్‌పై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. భారత్ తమ దేశంపై అధిక సుంకాలు విధిస్తోందంటూ సంచలన ఆరోపణలకు దిగారాయన. ఈ పరిణామంపై పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఇండియా, చైనాలాంటి దేశాలతో ఆ తీరున వ్యవహారించడం సరికాదని, భాగస్వామ్య దేశాలతో మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వ్యవహరించాలి అని ట్రంప్ వైఖరిని తప్పుబట్టారు. మరోవైపు పుతిన్ డిసెంబర్‌లో భారత్ పర్యటనకు రానున్నారు,
ఉక్రెయిన్ శాంతి చర్చలు.. కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఆగస్టు 15న తటస్థ వేదికగా అలస్కాలో ట్రంప్-పుతిన్‌ల భేటీ జరిగింది. అయితే ఈ భేటీ ఫలవంతంగా జరగలేదని తెలుస్తోంది. మరోవైపు జెలెన్‌స్కీ-యూరప్ దేశాధినేతలతో వైట్‌హౌజ్‌లో జరిగిన చర్చలు మాత్రం సవ్యంగా సాగినట్లు సంకేతాలు అందాయి. దీంతో.. తదుపరి దశలో జరగబోయే అమెరికా-ఉక్రెయిన్-రష్యా త్రైపాక్షిక చర్చలపై ఉత్కంఠ నెలకొంది.