
కలిసిరాని కాలం
తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సాగుపై అటు వ్యవసాయ అధికారులు ఇటు రైతులు కేసీ కెనాల్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. కేసీ కెనాల్ ఆయకట్టు జిల్లాలో 92 వేల ఎకరాలకుపైగానే ఉంది. కేసీ కాలువకు నీరు వస్తుండటంతో చాలామంది రైతులు వరి పంటను అధిక విస్తీర్ణంలో సాగుచేయనున్నారు. దీంతోపాటు కేసీ కాలువకు నీరు వస్తున్న నేపథ్యంలో కేసీ పరిధిలో భూగర్భజలాలు కొంత మేర అభివృద్ధి చెంది బోర్ల కింద కూడా సాగు విస్తీర్ణం పెరగనుంది.
కడప అగ్రికల్చర్: ఈ సారి ఖరీఫ్ కూడా రైతులకు కలిసిరాలేదు. సీజన్ ప్రారంభానికి ముందు వర్షాలు పలకరించినా.. ఆపై వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో చాలా మంది రైతులు పంటలసాగు చేయలేకపోయా రు. మరో 25 రోజుల్లో సీజన్ కూడా ముగియనుంది. ఇప్పటికే ఖరీఫ్ లక్ష్యానికి ఆమడదూరంగా సాగు నిలిచిపోయింది. జిల్లావ్యాప్తంగా 77,551 హెక్టార్ల సాధారణసాగు కాగా ఇప్పటివరకు కేవలం 21,179.8 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగయ్యాయి. అంటే సాగు కేవలం 27.31 శాతానికే పరిమితమైంది. మిగతా 70 శాతంపైగా బీడు భూములే దర్శనమిస్తున్నాయి. ఇక అక్కడక్కడ అరకొరగా సాగు చేసినా పంటలకు అవసరమైన యూరియా దొరక్క రైతులు అల్లాడిపోతున్నారు. రైతు భరోసా కేంద్రాల వద్ద యూరి యా కోసం క్యూలో వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో రైతుల తమ పనులను సైతం వదులుకుని బస్తా యూరియా కోసం గంటలు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించడంపై అన్నదాతలు అందోళన చెందుతున్నారు.
మరో 25 రోజుల్లో ముగియనున్న ఖరీఫ్
ఇప్పటికే లక్ష్యానికి దూరంగా సాగు
అరకొర సాగుకే యూరియా దొరక్క రైతుల అవస్థలు
జిల్లావ్యాప్తంగా 27.31 శాతానికేసాగు పరిమితం

కలిసిరాని కాలం