
రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల: రాష్ట్రంలోని రైతన్నలను అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం పులివెందులలోని తన స్వగృహంలో ఆయన మాట్లాడుతూ వరి ఎక్కువగా పండించవద్దని సీఎం చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటన్నారు. రైతులకు అవసరమైన యూరియాను అందించకుండా వరి పంట పండించవద్దని, యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్‌కు దారి తీస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పక్కదారి పడుతున్న యూరియాను అరికట్టాల్సిన ప్రభుత్వం కళ్లు మూసుకుందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆర్‌బీకేల ద్వారా 12లక్షల టన్నుల ఎరువులను రైతులకు అందజేశామని వివరించారు. ఉల్లి ధరలు కూడా పతమైనప్పుడు తమ ప్రభుత్వ హయాంలో గిట్టుబాటు ధర కల్పించి రైతుల వద్ద దాదాపు 9వేల టన్నులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
ప్రభుత్వాసుపత్రిని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
గురువారం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పులివెందుల లోని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు పద్మనాభరెడ్డి సోదరుడు నాగేశ్వరరెడ్డిని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వైద్యురాలితో నాగేశ్వరరెడ్డి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్యురాలితో సిటి స్కాన్ పరికరాలు, ఇతర సదుపాయాలపై ప్రశ్నించగా సిటి స్కాన్ ఉన్నప్పటికి సిబ్బందిలేరని బదులి చ్చారు. దీనికి స్పందించిన ఎంపీ ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై కూడా కక్ష సాధిస్తోందని, పులివెందుల మెడికల్ కళాశాలకు మంజూరైన 50 మెడికల్ సీట్లను తిరస్కరించడం అందుకు నిదర్శనమన్నారు.