
కొండను తవ్వేశారు..!
● రోడ్డు నిర్మాణం కోసం గ్రావెల్ తరలింపు
● అనుమతులు లేకుండానే తవ్వకాలు
● చర్యలు చేపడుతామంటున్న మైనింగ్ అధికారులు
జమ్మలమడుగు : జాతీయ రహదారి నిర్మాణం కోసం ఎస్‌ఆర్‌సీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఏకంగా కొండను తవ్వేసింది. పైసా ఖర్చు లేకుండా.. రెవెన్యూ, మైనింగ్ అధికారుల అనుమతులు లేకుండా.. ఏకంగా 22 కిలోమీటర్ల దూరం రోడ్డ నిర్మాణం కోసం గ్రావెల్ వాడుకుంది. మండల పరిధి అంబవరం పంచాయతీలోని కొత్త గుంటపల్లె సమీపంలో ఎస్‌ఆర్‌సీ కంపెనీ ప్రకృతి వనరులైన కొండలను నాశనం చేసింది. దాదాపు 30 నుంచి 40 ఎకరాల్లో ఉన్న కొండ ప్రాంతాన్ని 30 అడుగుల మేర ఇటాచీలతో తవ్వి కొల్లగొట్టారు. ఈ విషయంపై సాక్షి దినపత్రికలో శ్రీకొండను కొల్లగొట్టి.. రహదారి పనులు చేపట్టిశ్రీ అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీంతో మైనింగ్ అధికారులు స్పందించారు. ఈ ప్రాంతాన్ని మైనింగ్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పరిశీలించబోతున్నారు.
చర్యలు ఉంటాయా.. లేదా?
జాతీయ రహదారి నిర్మాణం కోసం వాడే గ్రావెల్‌కు క్యూబిక్ మీటర్‌కు 700 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తారు. ఎస్‌ఆర్‌సీ కంపెనీ ప్రతినిధులు తమకు పది వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అవసరం ఉందంటూ, దానికి అనుమతులు ఇవ్వాలంటూ తహసీల్దార్‌కు లెటర్ ఇచ్చారు. అయితే అనుమతులు లేకండానే ఏకంగా పది వేల క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువగా గ్రావెల్‌ను రోడ్డు నిర్మాణం కోసం ఉపయోగించినట్లు రెవెన్యూ అధికారులు చర్చించుకుంటున్నారు. పైగా వార్త రావడంతో ఏమి చేయాలో పాలుపోక మల్లగుల్లాలు పడుతున్నారు. జాతీయ రహదారి అధికారుల లెక్కల ప్రకారం రెండు కోట్ల కంటె ఎక్కువగా గ్రావెల్‌కు ఖర్చు అవుతుందని తెలుపుతున్నారు. ఈ డబ్బు అంతా కాంట్రాక్టర్ మిగిలించుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం అక్రమ మైనింగ్‌పై తమకు ఫిర్యాదు అందిందని జిల్లా మైనింగ్ అధికారి రాధా తెలిపారు. దీనిపై విచారణ కోసం మైనింగ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులకు లేఖ పంపించామని పేర్కొన్నారు. మరి మైనింగ్ అధికారులు అక్రమ మైనింగ్ పైన చర్యలు తీసుకుని, దానికి సంబంధించిన పరిహారం వసూలు చేస్తారో.. మరి కాంట్రాక్టర్, కంపెనీ, అధికార పార్టీకి దాసోహం అని తూతూ మంత్రంగా చర్యలు చేపడుతారో వేచి చూడాల్సిందే.