
జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తమను ఓటు వేయనీయలేదని వైఎస్ జగన్‌కు చెబుతున్న నల్లపురెడ్డిపల్లె గ్రామస్తులు
ఈ ప్రభుత్వం ఇక బంగాళాఖాతంలోకే మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం
రాష్ట్రంలో అన్ని వర్గాలనూ చంద్రబాబు మోసగించారు.. టీడీపీకి ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యమే లేదు
అందుకే ప్రజలను స్వేచ్ఛగా ఓటేయనివ్వట్లేదు
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అది మరోసారి స్పష్టం
ఎన్నికల రోజు టీడీపీ గూండాల అరాచకాలను జగన్‌కు మొర పెట్టుకున్న నల్లపురెడ్డిపల్లె గ్రామస్తులు
‘ఈ రోజు రాష్ట్రంలో రైతుల సమస్యలను పట్టించుకునే దిక్కు లేదు. సూపర్ సిక్స్ హామీలంటూ అక్కచెల్లెమ్మలను మోసం చేస్తున్నారు. ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్థితి త్వరలోనే రాబోతోంది..’ – పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్
‘2019 ఎన్నికలకు ముందు నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారు. ఆ తర్వాత మీ బిడ్డ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ 27వేల మెజార్టీతో గెలిస్తే ఆ తర్వాత కొట్టుకుపోయింది. అదే నంద్యాలలో వైఎస్సార్‌సీపీ 35వేల మెజార్టీతో గెలిచింది’ – వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేకనే ఓటు వేసుకునే స్వేచ్ఛను ప్రజలకు టీడీపీ కల్పించడం లేదని, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అది మరోసారి స్పష్టమైందని చెప్పారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల సహకారంతో అధికార పార్టీ నేతల అరాచకాలు.. ఓటర్లను అడ్డుకుని టీడీపీ గూండాలు బెదిరింపులకు పాల్పడటాన్ని ఆయా గ్రామాల్లో ప్రతి ఒక్కరూ చెబుతున్నారన్నారు.
మూడు రోజుల పర్యటన నిమిత్తం వైఎస్సార్ కడప జిల్లాకు వచ్చిన ఆయన మంగళవారం పులివెందుల నుంచి అంబకపల్లె వెళ్తూ నల్లపురెడ్డిపల్లె వద్ద తన కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తులను కలిశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార టీడీపీ గూండాల దౌర్జన్యంతో ఓటు వేయలేకపోయిన నల్లపురెడ్డిపల్లె గ్రామస్తులు పోలింగ్ రోజు అక్కడ నెలకొన్న దారుణమైన పరిస్థితిని వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. అధికార పక్ష నేతల అరాచకాలను కళ్లకు కడుతూ గ్రామస్తులు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే..
నంద్యాల ఉప ఎన్నికల్లోనూ ఇలాగే చేశారు.. ఆ తర్వాత టీడీపీ కొట్టుకుపోయింది..
‘ఆ రోజు.. నల్లపురెడ్డిపల్లెలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక, ప్రజలకు ఓట్లు వేసుకునే స్వేచ్ఛ లేకుండా చేసి పోలీసులను వాడుకుని టీడీపీ గూండాలు ఎలా జులుం చేశారో, ఏ రకంగా అన్యాయం చేశారో గ్రామంలో ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న పరిస్థితుల్లో... నా కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ మీ జగన్ రుణపడి ఉంటాడు. మీ ఆప్యాయత, ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు.
గతంలో 2019 ఎన్నికలకు ముందు నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారు. ఆ తర్వాత మీ బిడ్డ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ 27వేల మెజార్టీతో గెలిస్తే ఆ తర్వాత కొట్టుకుపోయింది. అదే నంద్యాలలో వైఎస్సార్‌సీపీ 35 వేల మెజార్టీతో గెలిచింది. అన్యాయం చేసినా, దౌర్జన్యం చేసినా దేవుడు అన్నీ చూస్తాడు. టీడీపీకి గట్టిగా బుద్ధి చెబుతాడు. ఈ రోజు రాష్ట్రంలో రైతుల సమస్యలను పట్టించుకునే దిక్కు లేదు. సూపర్ సిక్స్ హామీలంటూ అక్కచెల్లెమ్మలను మోసం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్థితి త్వరలోనే రాబోతోంది’
అంబకపల్లె చెరువు వద్ద జలహారతి..
వైఎస్సార్‌సీపీ కృషితో అంబకపల్లెకు కృష్ణా జలాలు చేరుకున్న నేపథ్యంలో అక్కడి చెరువు వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్ జలహారతి ఇచ్చారు. ‘పాడా’ నిధుల ద్వారా అంబకపల్లె గంగమ్మ కుంటకు రూ.1.4 కోట్లతో 14 ఎకరాల భూసేకరణ చేపట్టి కొత్త చెరువును నిర్మించారు. పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ఎంపీ నిధులతో రూ.2.50 కోట్లు వెచ్చించి హిరోజ్‌పురం వద్ద భారీ సంపు ఏర్పాటు చేసి 4.5 కి.మీ. మేర అంబకపల్లె చెరువుకు పైపులైన్ ఏర్పాటు చేయించారు. ఫలితంగా అంబకపల్లె చెరువుకు కృష్ణా నీరు వచ్చి చేరడంతో ఆ ప్రాంత వాసులంతా సంతోషం వ్యక్తంచేశారు.
అక్కడకు వచ్చిన వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో రహదారిపై పూలు చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. క్రేన్ సహాయంతో వైఎస్ జగన్‌కు భారీ గజమాల వేశారు. బాణాసంచా కాలుస్తూ డప్పుల దరువుతో గ్రామస్తులంతా రోడ్డుపైకి చేరి అభిమాన నేతకు స్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా పండితుల మంత్రోచ్ఛారణ నడుమ కృష్ణా జలాలకు హారతి ఇచ్చారు. కృష్ణా జలాల మ్యాప్‌ను వైఎస్ జగన్ పరిశీలించి చెరువు శిలాఫలకాన్ని ప్రారంభించారు.
తరలివచ్చిన పులివెందుల పల్లెలు.. 47 కి.మీ. ప్రయాణానికి 6 గంటలు
ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ నుంచి అంబకపల్లెకు వైఎస్ జగన్ వస్తున్నట్లు తెలియడంతో ఆ మార్గంలోని పులివెందుల పల్లెలన్నీ రోడ్డుపైకి వచ్చి ఆయన కోసం వేచి చూశాయి. వీరన్నగట్టుపల్లెతో మొదలు పెడితే కుమ్మరాంపల్లె, చింతరాంపల్లె, వేంపల్లె, నందిపల్లె, తాళ్లపల్లె, దుగ్గన్నగారిపల్లె, అయ్యవారిపల్లె, గొందిపల్లె, వి.కొత్తపల్లె, వేముల, భూమయ్యగారిపల్లె, వేల్పుల, బెస్తవారిపల్లె, కె.వెలమవారిపల్లె, నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె తదితర గ్రామాల ప్రజలంతా సమీపంలోని రోడ్డుపైకి వచ్చి నిరీక్షించారు.
దారి పొడవునా గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ అందరినీ ఉత్సాహపరుస్తూ జగన్ ముందుకు కదిలారు. 47 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి 6గంటలు పట్టడం గమనార్హం. ఇడుపులపాయ నుంచి ఉ.9గంటలకు బయలుదేరిన వైఎస్ జగన్ అంబకపల్లెకు చేరుకునేందుకు సా.3 గంటలైంది.