
వైఎస్సార్ జిల్లా: కడప నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.కుటుంబ కలహాలతో భార్యాభర్తలు బిడ్డతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. అదే సమయంలో.. వాళ్లను మందలించిన ఇంటి పెద్ద గుండెపోటుతో కన్నుమూసింది.
ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 11గం. సమయంలో రైల్వే స్టేషన్ సమీపంలోని మూడో నంబర్ ట్రాక్‌పై ఓ కుటుంబం వేగంగా వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురుగా నిల్చుని ఆత్మహత్యకు పాల్పడింది. రైలు ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుల్లో భర్త(35), భార్య(30)తో పాటు ఏడాదిన్నర చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు.
అయితే మృతుల్ని శంకరాపురానికి చెందిన శ్రీరాములు, శిరీష, వాళ్ల కొడుకు రిత్విక్‌గా నిర్ధారించారు. శ్రీరాములు, శిరీష ఏదో విషయంలో గొడవ పడ్డారు. దీంతో శ్రీరాములు నాన్నమ్మ సుబ్బమ్మ వాళ్లను మందలించింది. దీంతో మనస్థాపం చెందిన భార్యాపిల్లలతో బయటకు వెళ్లిపోయారు. అది తట్టుకోలేక ఆమె గుండెపోటుతో కన్నుమూసింది.అయితే.. కాసేపటికే గూడ్స్ రైలు కింద పడి ఆ భార్యాభర్తలు బిడ్డతో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు.
భార్యాభర్తలు ఎందుకు గొడవపడ్డారు, సుబ్బమ్మ ఏమని మందలించింది.. తదితర వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. బంధువుల ఫిర్యాదుతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.
ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com