
గతేడాది తొలి త్రైమాసికంతో పోల్చితే మరింత దిగజారుడు
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన
ఈ ఏడాది పన్ను, పన్నేతర ఆదాయం మందగమనం
రాష్ట్ర సొంత ఆదాయం పెరిగింది కేవలం 3.47 శాతమే
కేంద్రం నుంచి వచ్చే ఆదాయాలతో కలిపితే పెరిగింది 6.14 శాతమే
అదే సమయంలో అప్పులు మాత్రం 15.61 శాతం పెరుగుదల
అవినీతి విశృంఖలత్వం వల్లే రాష్ట్ర ఖజానాకు గండి
ఖర్చుల కోసం పూర్తిగా అప్పులపైనే ఆధారపడిన రాష్ట్ర ప్రభుత్వం
బాబు సర్కారు ఆర్థిక నిర్వహణపై కాగ్ గణాంకాలతో దెప్పిపొడుపు
సాక్షి, అమరావతి : టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిందంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి త్రైమాసికంతో పోల్చితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను, పన్నేతర ఆదాయాలు భారీగా తగ్గాయని ఎత్తిచూపారు. రాష్ట్రంలో అవినీతి విశృంఖలత్వం వల్ల ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందని మండిపడ్డారు.
ప్రతి మంగళవారాన్ని అప్పులవారంగా మార్చుకున్న చంద్రబాబు.. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 15.61 శాతం అధికంగా అప్పులు చేశారంటూ దెప్పి పొడిచారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన కీలకమైన ఆర్థిక సూచీ (ఇండికేటర్)లను ఉటంకిస్తూ చంద్రబాబు సర్కారు ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..

తగ్గిపోయిన ప్రజల కొనుగోలు శక్తి
⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి త్రైమాసికంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన నెలవారీ కీలక ఆర్థిక సూచీల ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. విభజన అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారి, ఒక సవాలుగా నిల్చింది. సంక్షేమం, అభివృద్ధి.. రెండింటికి ఎప్పుడైతే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి.. ఆ దిశగా వ్యయం చేస్తుందో, అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, పెట్టుబడులు కూడా పెరుగుతాయి. ఇది అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది.
⇒ కానీ.. కూటమి పాలనలో అంతులేని అవినీతి వల్ల రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోతోంది. మరో వైపు అన్ని రంగాల్లో వృద్ధి పూర్తిగా తిరోగమనం కావడం కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో తొలి మూడు నెలలకు సంబంధించి చూస్తే పన్ను, పన్నేతర ఆదాయాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.
⇒ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు కొన్ని విభాగాల్లో అతి తక్కువ వృద్ధి ఉంటే.. మరికొన్ని విభాగాల్లో వృద్ధి తగ్గింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం
కోల్పోతోందనడానికి నిదర్శనం.
⇒ గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అమ్మకం పన్నుల ఆదాయం ఏ స్థాయిలో తగ్గిందనేది ఇప్పుడు కాగ్ విడుదల చేసిన నివేదిక చూపుతోంది.
⇒ గత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం రాష్ట్ర సొంత ఆదాయంలో కేవలం 3.47 శాతం, ఇతర ఆదాయాలు,
కేంద్రం నుంచి వచ్చిన నిధులు అన్నీ కలిపి చూస్తే ప్రభుత్వ ఆదాయంలో మొత్తం 6.14 శాతం వృద్ధి మాత్రమే ఉంది. కానీ, ఇదే సమయంలో రాష్ట్ర అప్పులు ఏకంగా 15.61 శాతం పెరగడం దారుణం. అంటే.. రాష్ట్ర ప్రభుత్వం తన ఖర్చుల కోసం ఆదాయం పెంచుకునే మార్గాలపై కాకుండా, పూర్తిగా అప్పులపైనే ఆధార పడుతోందన్న విషయం స్పష్టమవుతోంది. ఇది ఆందోళనకరంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది.