సర్కారు.. కంగారు! | TDP Leaders Conspiracy on YS Jagan Chittoor district Tour | Sakshi
Sakshi News home page

సర్కారు.. కంగారు!

Jul 7 2025 5:05 AM | Updated on Jul 7 2025 5:05 AM

TDP Leaders Conspiracy on YS Jagan Chittoor district Tour

వైఎస్‌ జగన్‌ పర్యటన నేపథ్యంలో రైతుల వద్దకే వెళ్లి టోకెన్లు పంపిణీ చేస్తున్న అధికారులు

జగన్‌ పర్యటన ఖరారుతో చిత్తూరు నేతలు, అధికారులతో సీఎం చర్చలు

కిలో రూ.8తో మామిడి కొనుగోలు చేయాలని ఆదేశాలు

ఫ్యాక్టరీల యాజమాన్యాల వద్దకు వెళ్లి బతిమలాడిన నేతలు, అధికారులు

కిలో రూ.6 చొప్పున కొనడానికి సంసిద్ధత

ఆ మేరకు విక్రయించటానికి ఒప్పుకున్నట్లు రైతుల నుంచి సంతకాలు

టోకెన్ల పంపిణీ రోజుకు 60 నుంచి 300కు పెంపు  

టోకెన్లు ఉన్న వాహనాలకు నేరుగా ఫ్యాక్టరీ లోపలికి అనుమతి

బయట వాహనాలు బారులు తీరకుండా పాట్లు.. అయినా క్యూకట్టిన వాహనాలు..

సమస్య సమసిపోయిందంటూ జగన్‌ పర్యటనకు రావొద్దని రైతులపై ఒత్తిడి 

ఇంకో వైపు ధర లేక మామిడి చెట్లను కొట్టేసిన రైతులపై కేసులు

సాక్షి ప్రతినిధి, తిరుపతి: మామిడికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోగా, ఆ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండటంతో వారికి అండగా నిలవడం కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా రంగంలోకి దిగటంతో కూటమి ప్రభుత్వానికి కునుకు కరువైంది. దీంతో వైఎస్‌ జగన్‌ బంగారుపాళెం పర్యటనను ఎలాగైనా అడ్డుకునేందుకు కూటమి నేతలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి, మామిడి దిగుబడులను వెంటనే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతూ.. వైఎస్‌ జగన్‌ పర్యటనలో రైతులెవ్వరూ పాల్గొనకుండా చూడటానికి నానా తంటాలు పడుతున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొద్ది రోజులుగా ఓ వైపు మామిడి దిగుబడులకు గిట్టుబాటు ధరలు లేక, మరో వైపు ఫ్యాక్టరీ యాజమాన్యాలు సమయానికి కొనుగోలు చేయక పోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల కష్టాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ట్రాక్టర్లు, లారీల్లోనే మామిడి కుళ్లిపోతుండటంతో రైతులు వాటిని రోడ్లపై పారబోసి వెళ్లిపోతున్నారు. మరికొందరు రైతులు ఏకంగా మామిడి చెట్లను కొట్టేసి, వేరే పంటలు సాగు చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఇది కూడా తప్పే అన్నట్లు ఆ రైతులపై కూటమి ప్రభుత్వం కళ్లెర్ర చేస్తోంది. వారిపై కేసులు పెట్టి, అపరాధ రుసుం అంటూ వసూళ్లకు బరితెగించింది. ఈ నేపథ్యంలో రైతుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ నెల 9వ తేదీన వైఎస్‌ జగన్‌ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. 

రైతుల వద్దకు అధికారులు పరుగులు
కొద్ది రోజులుగా రైతులు గంగాధర నెల్లూరు, గుడిపాల, బంగారుపాళెం, తవణంపల్లి వద్ద ఉన్న ఫ్యాక్టరీల వద్ద మామిడి దిగుబడులతో రోజుల తరబడి క్యూలో వేచి ఉన్నారు. మొన్నటి వరకు ఫ్యాక్టరీలో మామిడి అన్‌లోడింగ్‌ కోసం రోజుకు కేవలం 60 నుంచి 70 ట్రాక్టర్లకు మాత్రమే టోకెన్లు ఇచ్చేవారు. అది కూడా రైతులు వెళ్లి ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని బతిమలాడాలి. ఈ పరిస్థితిలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వస్తున్నారని తెలియడంతో అధికారుల జోక్యంతో రోజుకు ఒక్కో ఫ్యాక్టరీ వారు 300 టోకెన్లు ఇవ్వటం ప్రారంభించారు. టోకెన్లు పొందిన వారి ట్రాక్టర్లను నేరుగా ఫ్యాక్టరీలోనికి పంపిస్తున్నారు. రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాల్లో వేచి ఉండటం కంటే.. ఫ్యాక్టరీ లోపల ఉంటే పరిస్థితి తీవ్రత తెలియదనే ఉద్దేశంతో అధికారులు ఇలా చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అయినా కి.మీ దూరం మామిడి దిగుబడులతో ట్రాక్టర్లు, లారీలు వేచి 
ఉండటం గమనార్హం.

పర్యటన ఖరారవ్వగానే అంతా హడావుడి
మామిడి రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్‌ జగన్‌ చిత్తూరు జిల్లా పర్యటనకు వస్తున్నట్లు ఈనెల 2న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ప్రకటించారు. అదే రోజు సాయంత్రం కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు ఈ విషయం తెలుసుకుని మరుసటి రోజే టీడీపీకి చెందిన కొందరు మామిడి రైతులను పిలిపించుకుని మాట్లాడారు. రైతులను ఆదుకుంటున్నది తమ ప్రభుత్వమే అని ప్రకటించారు. ఆపై కిలో మామిడిని ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.8 చొప్పున కొనుగోలు చేయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ మరుసటి రోజు అధికారులు సమావేశమై కిలో మామిడి రూ.8తో కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీ యాజమాన్యానికి సూచించారు.

అయితే వారు దాన్ని పట్టించుకోలేదు. ధర ఎంత అనేది చెప్పకుండానే రైతుల వద్ద అంగీకార పత్రంలో సంతకం తీసుకుని మామిడిని కొనుగోలు చేయటం చేపట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు మరోసారి ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో కిలో రూ.8 చొప్పున కాకుండా రూ.6తో కొనుగోలు చేస్తున్నట్లు అంగీకార పత్రంపై రైతుల నుంచి సంతకాలు తీసుకోవటం ప్రారంభించారు. వైఎస్‌ జగన్‌ పర్యటన ఖరారు కానంత వరకు కూటమి నేతలకు మామిడి రైతుల ఘోషే వినిపించలేదు.

వైఎస్‌ జగన్‌ బంగారుపాళెం వస్తున్నారని తెలియటంతో సీఎం సూచన మేరకు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌ వెంటనే ప్రెస్‌మీట్‌ పెట్టి విమర్శలు చేయటం, ఫ్యాక్టరీల వద్దకు వెళ్లటం, రైతులతో మాట్లాడటం వంటి కార్యక్రమాలతో హడావుడి చేస్తున్నారు. మరో వైపు చెట్లను కొట్టేసుకున్న రైతులు వైఎస్సార్‌సీపీ శ్రేణులంటూ వారిపై కేసులు పెట్టించటం ప్రారంభించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement