
చంద్రబాబు సర్కారుపై వైఎస్ జగన్ ధ్వజం
ఏపీఎండీసీ ద్వారా మరోసారి ఎన్‌సీడీ బాండ్ల జారీకి టీడీపీ కూటమి సర్కారు సిద్ధం
రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్‌పై ప్రైవేట్ వ్యక్తులకు అజమాయిషీ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం
రూ.1.91 లక్షల కోట్ల ప్రభుత్వ ఖనిజ సంపద ఎన్‌సీడీ బాండ్లు కొనుగోలు చేసిన వారికి తనఖా
ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే
ఈ అంశం హైకోర్టులో విచారణలో ఉన్నప్పుడు బాండ్ల జారీకి అనుమతించడం సరికాదు
సాక్షి, అమరావతి: అప్పుల కోసం టీడీపీ కూటమి సర్కారు మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘించేందుకు బరి తెగించిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) జారీ చేసే ఎన్‌సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్) బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ (సంచిత నిధి)పై అజమాయిషీ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉన్నప్పటికీ.. ఏపీఎండీసీకి ఎన్‌సీడీ బాండ్ల జారీకి అనుమతి ఇవ్వడం సరికాదన్నారు.
ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని స్పష్టం చేస్తూ ఆదివారం ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. అందులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మరోసారి ఉల్లంఘించింది. అప్పుల కోసం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి జూన్ 24న ఎన్‌సీడీ బాండ్ల జారీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. శాసనసభ ఆమోదం తీసుకున్న అంశాలకు మాత్రమే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రభుత్వం నిధులు తీసుకోవచ్చు. కానీ.. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులు తీసుకునేలా ప్రైవేట్ పార్టీలను అనుమతించడం రాజ్యాంగంలోని 203, 204 అధికరణ (ఆరి్టకల్)లను ఉల్లంఘించడమే. రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్‌ను తాకట్టు పెట్టి రుణం తీసుకోవడానికి ఏపీఎండీసీకి అనుమతి ఇవ్వడం రాజ్యాంగంలోని అధికరణ 293(1)ని ఉల్లంఘించడమే.
ఎన్‌సీడీ బాండ్ హోల్డర్లకు ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలపై ప్రత్యేక హక్కు కల్పించిన తర్వాత అంతకంటే ఎక్కువ వడ్డీ ఇవ్వడమంటే దారుణం. దీనికి అదనంగా రూ.1,91,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఖనిజ సంపదను ఎన్‌సీడీ బాండ్ హోల్డర్లకు తనఖా పెట్టారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు విచారణలో ఉంది. ప్రతివాదులకు కౌంటర్లు దాఖలు చేయమని హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లు కూడా తెలిసింది. హైకోర్టు విచారణలో ఉన్నప్పుడు బాండ్ల జారీని కొనసాగించడానికి ఏపీఎండీసీని ప్రభుత్వం అనుమతించడం సరి కాదు. ఇది రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టడమే. భారత రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించడమే’’.