
ఒంటిమిట్టలో రాయచోటి రౌడీల వీరంగం
సాక్షి రాయచోటి/రాజంపేట: ఒంటిమిట్టలో జెడ్పీ టీసీ ఉప ఎన్నికల పోలింగ్‌లో రిగ్గింగ్ యథేచ్ఛగా సాగింది. మండలంలో 30 పోలింగ్ బూత్‌లు ఉంటే ప్రతి చోట పోలీసులు, ఎన్నికల సిబ్బంది సహకారం ఎల్లో గ్యాంగ్‌కు లభించింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు నేరుగా పోలింగ్ బూత్‌ల్లోకి చొరబడి, ఓటర్ల నుంచి ఓటరు స్లిప్‌లు లాక్కుని వారే ఓటు వేసుకున్నారు. అడ్డుకోవాల్సిన పోలీసులు, అధికారులు మిన్నకుండిపోయారు.
మంత్రి నేతృత్వంలోఏజెంట్లపై దాడులు
మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో టీడీపీ శ్రేణులు.. పోలింగ్ బూత్‌లలో వున్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడులు చేశారు. ప్రధానంగా మంటంపంపల్లె, చిన్నకొత్తపల్లె, గంగపేరూరు, నడింపల్లె తదితర పోలింగ్ బూత్‌లలో ఉదయం నుంచి ఏజెంట్లను బయటికి లాగి పడిసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ సంఘటనలతో బూత్‌ల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
అడ్డుకోవడానికి వైఎస్సార్‌సీపీ నేతల యత్నం
సమాచారం తెలుసుకున్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎమ్మెల్సీ రామచంద్రరెడ్డి, ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీ గోవింద్‌రెడ్డిలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇరగరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా పోలింగ్ బూత్ వద్దకి చేరుకున్నారు. ఆ సమయంలో టీడీపీ నేతల దౌర్జన్యానికి అడ్డుతగులుతున్నారని భావించి.. వైఎస్‌ఆర్‌సీపీ నేతలను అరెస్ట్ చేయాలని పోలీసులకు అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ నేతలను అరెస్ట్ చేసి ఒంటిమిట్ట, కడప రిమ్స్, చింతకొమ్మదిన్నె పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు.