
పోలీసుల వేధింపులకు గురైన వ్యక్తి మృతి
కర్నూలు(హాస్పిటల్)/కొండాపురం: స్థల వివాదంలో పోలీసుల వేధింపులతో వైఎస్సార్ కడప జిల్లా కోర్టు ఆవరణలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి మంగళవారం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందాడు. వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామానికి చెందిన ఆర్.చిన్నబాలయ్య(45)కు చెందిన స్థలం విషయంలో హోంగార్డులు తిరుపతయ్య, నాగార్జున రెడ్డి, కానిస్టేబుల్ నరసింహులుతో పాటు గ్రామస్తులు దత్తాపురం మాధవ రెడ్డి, గంగిరెడ్డి, తుంగ జగదీశ్వర్ రెడ్డి, బెస్త వేణు, బెస్త ప్రసాద్, మేకల బాల నారాయణరెడ్డి వేధిస్తున్నారని.. తన భార్య, పిల్లలను తనకు చూపించకుండా ఎక్కడో దాచారని అప్పట్లో ఆరోపించాడు. తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లు పోలీసులకు తెలిపి గత నెల 29న కోర్టు ఆవరణలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అతడికి కడప రిమ్స్‌లో ప్రాథమిక వైద్యం చేయించి అదే రోజు రాత్రి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్ చేశారు. ఆసుపత్రిలోని కాలిన రోగుల వార్డులో 60 శాతానికి పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం కోలుకోలేక మృతిచెందాడు. దాదాపు రెండు వారాల పాటు ఎలాగైనా తనను బతికించాలని.. తన భార్య, బిడ్డలను చూపించాలని వైద్యులను వేడుకోవడం అందరినీ కలచివేసింది.