
సాక్షి, వైఎస్సార్: పులివెందులలో ఈరోజు జరుగుతున్న రీపోలింగ్‌ను వైఎస్సార్‌సీపీ బహిష్కరిస్తున్నట్టు ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆపరేషన్ రిగ్గింగ్‌ను చాలా గొప్పగా చేశారని మండిపడ్డారు. పులివెందులలో ఒక కొత్త సంస్కృతికి చంద్రబాబు తెరలేపారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో చాలా చోట్ల చేయవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నిక కమిషన్‌పై ఉంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నిన్న జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఎలా జరిగాయో రాష్ట్రం మొత్తం చూశారు. ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది టీడీపీ వారు ఎలా బూత్‌లు ఆక్రమించారో అందరికీ తెలుసు. ఈరోజు తెల్లవారు జామున 2 గంటలకు కేవలం 2 బూత్‌లలో మాత్రమే రీపోలింగ్ ప్రకటించారు. మేము స్పష్టంగా 15 బూత్‌లలో రీపోలింగ్ జరగాలని, కేంద్ర బలగాలతో ఎన్నిక జరపాలని మేము కోరాం. కేవలం తప్పించుకునేందుకు రాత్రికి రాత్రి కేవలం రెండు బూత్‌లలో రీపోలింగ్ అంటున్నారు. అసలు ఏజెంట్లను కూడా బూత్‌లోకి రానివ్వలేదు. అన్ని ఆధారాలు బయటకు వచ్చాయి.
మహిళల ఓట్లను కూడా మగవాళ్లు వేసేశారు. కోర్టుకు ఆశ్రయిస్తామని ఈ రీపోలింగ్ డ్రామాను తెర మీదకు తెచ్చారా?. మా స్టాండ్ 15 బూత్‌లలో రీపోలింగ్ జరపాలి. ఈ రెండు బూత్‌లలో నేడు జరుగుతున్న రీపోలింగ్ మేము బహిష్కరిస్తున్నాం. మొత్తం 15 బూత్‌లలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. నిన్న మీడియాను కూడా అడ్డుకుని కెమెరాలు లాక్కున్నారు. గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల్ని అడిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. పులివెందులలో ఒక కొత్త సంస్కృతికి చంద్రబాబు తెరలేపారు.
ఒక గ్రామంలో ఉన్న వైఎస్సార్‌సీపీని ఎదుర్కోడానికి జిల్లాలో ఉన్న టీడీపీ కేడర్ మొత్తాన్ని గ్రామంలో దించారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో చాలా చోట్ల చేయవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నిక కమిషన్‌పై ఉంది. నిన్న జరిగిన అరాచకాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు రీపోలింగ్ పెడుతున్నారు. అన్ని సెంటర్లలో పోలీసుల సంపూర్ణ సహకారంతో మా ఏజెంట్స్‌ను బయటకు నెట్టేశారు. 15 ఊరులో ప్రజలను అడిగితే నిజానిజాలు తెలుస్తాయి. మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను.. నిజమైన ఓటర్లను, ప్రజలను ప్రశ్నించి చూడండి. నిజాలు బయటకు వస్తాయి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
