
టీడీపీ రౌడీలు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌ల్లోకి పంపడం లేదని, ఓటర్లను అడ్డుకుంటున్నారని ఆందోళన చేస్తున్న మహిళలు
ప్రజాస్వామ్యం.. పరిహాసం
వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై టీడీపీ మూకల దాష్టీకం..
పులివెందుల పరిధిలోని అన్ని బూత్‌లలో అరాచకం
ఇళ్లల్లోకి చొరబడి ఏజెంట్ ఫారాలు చించివేత
కేంద్రాల వద్దకు రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డగింత
బూత్‌ల్లో ఉన్న ఏజెంట్లు బయటకు గెంటివేత
పోలీసుల సమక్షంలోనే విచక్షణారహితంగా దాడులు
ఏజెంట్లు లేని ఎన్నికలు దేశ చరిత్రలో ఇప్పుడే చూశామంటున్న రాజకీయ విశ్లేషకులు
ఈ అరాచక పర్వానికి స్వయంగా మంత్రి, ఎమ్మెల్యే సారథ్యం
సాక్షి, అమరావతి: అధికార పార్టీ ఆగడాలు.. స్వయంగా మంత్రి, ఎమ్మెల్యే అరాచకాలు.. అధికార దుర్వినియోగం.. పోలీస్ యంత్రాంగం స్వామి భక్తి సాక్షిగా ప్రజాస్వామ్యం నడివీధుల్లో అపహాస్యం పాలైంది! రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ.. ప్రజాస్వామ్య విలువలు, మౌలిక సూత్రాలను కాలరాస్తూ టీడీపీ కూటమి సర్కారు అక్రమాలకు పాల్పడింది. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లే లేకుండా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించుకోవాలన్న తలంపుతో బరి తెగించింది. ఎక్కడికక్కడ ఏజెంట్లను అడ్డుకుని పోలింగ్ బూత్‌ల దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా కట్టడి చేసి పోలీసుల సహకారంతో దాడులకు తెగబడింది. చివరకు నిస్సిగ్గుగా మహిళా ఏజెంట్లపై కూడా దౌర్జన్యాలకు ఒడిగట్టింది.
ఏజెంట్ల ఇళ్ల వద్ద మోహరించి..
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో మునుపెన్నడూ చూడని విష సంస్కృతికి అధికార టీడీపీ తెర తీసింది. దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో అసలు ఏజెంట్లే లేని ఎన్నికలు నిర్వహించి టీడీపీ పెద్దలు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. ఎన్నికల సంఘంతో పాటు పోలీసులు కూడా కళ్లుమూసుకోవడంతో ఎన్నికల నిర్వహణ పూర్తిగా తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం బరిలో నిలిచిన అభ్యర్థులు తమ తరపున పర్యవేక్షించేందుకు జనరల్ ఏజెంట్లతో పాటు బూత్‌కొకరు చొప్పున పోలింగ్ ఏజెంట్లను నియమించుకుంటారు.
వీరు తమకు కేటాయించిన పోలింగ్ బూత్‌లలో ఎన్నికల నిర్వహణను పర్యవేక్షిస్తుంటారు. రిగ్గింగ్ జరగకుండా అడ్డుకోవడం, బోగస్ ఓట్లు పడకుండా నివారించడం వీరి ప్రధాన విధి. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి భయంతో వణికిపోయిన టీడీపీ పెద్దలు ఓ పథకం ప్రకారం వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. అడుగడుగునా పోలీస్ యంత్రాంగాన్ని మోహరించి తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఏజెంట్ల ఇళ్లకు వెళ్లి వారి వద్ద ఉన్న ఫారాలను చించివేసి గృహ నిర్భందాలకు పాల్పడ్డారు.
కొన్ని చోట్ల సోమవారం రాత్రి నుంచే ఏజెంట్ల ఇళ్ల వద్ద కర్రలతో పహారా కాస్తూ బయటకు రాకుండా తిష్ట వేశారు. ఎలాగోలా బూత్‌లకు చేరుకున్న ఏజెంట్లపై దాడులకు తెగబడ్డారు. బూత్‌లలో ఉన్న ఏజెంట్లను బయటకు ఈడ్చుకొచ్చి దౌర్జన్యాలకు పాల్పడ్డారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో 15 పోలింగ్ బూత్‌లుండగా ఏ ఒక్క చోట కూడా ఏజెంట్‌ను లోపలకు వెళ్లనివ్వలేదు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ ముష్కరులు దాడులకు తెగబడుతున్నా అడ్డుకునే యత్నం చేయలేదు. కొన్ని చోట్ల అయితే పోలీసులే దగ్గరుండి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపించేశారు.
ఏకంగా అభ్యర్థినే ఇంట్లో బంధించి..
పులివెందుల వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి స్వగ్రామమైన తుమ్మలపల్లెలో ఆయన ఇంటి చుట్టూ 150 మందికిపైగా టీడీపీ మూకలు పోగై కర్రలతో బెదిరిస్తూ బయటకు రాకుండా అడ్డగించారు. పోలీసులు వారికి కొమ్ము కాస్తూ.. హేమంత్‌రెడ్డి బయటకు రావొద్దని, వస్తే గొడవలు అవుతాయంటూ హెచ్చరించడం విస్మయం కలిగిస్తోంది.
పోలింగ్ బూత్ వద్దకు వెళ్లేందుకు సైతం అనుమతించలేదు. పోలింగ్ జనరల్ ఏజెంట్ బలరామిరెడ్డిది కూడా అదే పరిస్థితి. ఆయన్ను కూడా బయటకు రానివ్వలేదు. పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోవాలంటే దాదాపు 300 మందిని దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. పోలీసులు పూర్తిగా టీడీపీ నేతలకు సరెండర్ అయ్యారు.
బూత్‌ను ఆక్రమించి ‘ఆది’ అరాచకం..
» నల్లపురెడ్డిపల్లెలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు బూత్‌లను ఆక్రమించారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఏజెంట్లను కూర్చోనివ్వకుండా పోలీసులు బలవంతంగా బయటకు పంపేశారు. ఏజెంట్ల ఫారాలను లాక్కుని చించేశారు.
» కనంపల్లెలో బూత్‌లలోకి ఏజెంట్లు వెళ్లకుండా వారి ఇళ్ల వద్ద టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో మోహరించారు. ఇ.కొత్తపల్లిలో రెండు బూత్‌లను ఆక్రమించి ఏజెంట్లను అడ్డుకున్నారు.
» మోట్నూతలపల్లిలో టీడీపీ మూకలు పోలింగ్ బూత్‌కి 2 కి.మీ ముందే వాహనాలను వెనక్కి పంపేశాయి. పోలింగ్ బూత్‌లను ఆక్రమించి గ్రామంలోకి ఎవరినీ రానివ్వలేదు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బూత్ లోపలికి వెళ్లనివ్వలేదు. ఈ అక్రమాలను అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సమక్షంలో ఏజెంట్‌పై దాడి
» ఒంటిమిట్ట మండలం చినకొత్తపల్లిలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా బూత్‌లోకి చొరబడ్డారు. మంత్రి హోదాలో ఉంటూ ఓ గూండా మాదిరిగా పార్టీ కార్యకర్తలతో కలిసి వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ను బయటకు లాక్కొచ్చి బట్టలూడదీసి చావబాదారు. పక్కనే ఉన్న పోలీసులు అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారు. ఇదే మండలం గాండ్లపల్లి బూత్‌లో పోలింగ్ మొదలు కాకముందే వైఎస్సార్ సీపీ ఏజెంట్లను పోలీసుల సమక్షంలోనే బయటకు గెంటేశారు.
» పులివెందుల మండలం చింతరాజుపల్లెలో ఎన్నికల బూత్‌లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌పై దాడి చేసిన టీడీపీ నాయకులు చితకబాది బయటకు గెంటేశారు.
» నల్లగొండువారిపల్లెలోని బూత్‌లోకి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు వెళ్లకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ బూత్ బయట కర్రలతో స్వైర విహారం చేశారు.
» బీటెక్ రవి తమ్ముడు భరత్ ఎర్రిపల్లె పోలింగ్ బూత్‌లోకి ఏజెంట్లను రానివ్వకుండా అడ్డుకుంటున్నా పోలీసులు చోద్యం చూశారని మహిళా ఏజెంట్ వాపోయారు.
» అచ్చివెళ్లిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకున్న టీడీపీ నాయకులు బూత్‌ల నుంచి బలవంతంగా పంపేశారు. కొత్తపల్లె పోలింగ్ బూత్‌లలోకి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అనుమతించలేదు. తుమ్మలపల్లెలో పోలింగ్ బూత్‌లను టీడీపీ నాయకులు ఆక్రమించుకొని ఏజెంట్లను బయటకు పంపేశారు.