
సాక్షి, పులివెందుల: పులివెందుల ఎన్నికల విషయమై ఎల్లో మీడియా రాతలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిగ్గింగ్ జరిగితే ఎన్నికలపై ఉత్కంఠకు తెర ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. తప్పుడు రాతలతో.. ఎవరిని నమ్మించడానికి ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇలాంటి రాతలు అనైతికం కాదా? అని ప్రశ్నలు సంధించారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ తాజాగా మాట్లాడుతూ.. ‘ఈరోజు ఈనాడు పత్రిక చూస్తే ఆ రాతలు ప్రజలను ఏదో నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉత్కంఠకు తెర అని ఈనాడు రాస్తే.. లోకేశ్ అయితే ప్రజాస్వామ్యం నిలబడింది అంటున్నాడు. పులివెందులలో దొంగ ఓటింగ్ జరిగిందని ప్రజలందరికీ తెలుసు. దొంగ ఓటింగ్ జరిగితే ఉత్కంఠ ఎలా అవుతుంది?. ఉత్కంఠకు తెర అని రాతలు రాసి నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు. రిగ్గింగ్ జరిగితే ఉత్కంఠకు తెర ఎలా అవుతుంది?. తప్పుడు రాతలతో మరోసారి ఎల్లో మీడియా ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తోంది. ఎవరిని నమ్మించడానికి ఇలాంటి రాతలు, స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. అసలు పులివెందులలో ఓటింగ్ జరిగితే కదా.. ఇలాంటి రాతలు అనైతికం కాదా?. మీ పత్రిక అనైతిక రాతలు చూసి ఆత్మవిమర్శ చేసుకోండి.
ఎవరి కోసం స్టేట్‌మెంట్స్..
అసలు పులివెందుల జడ్పీటీసీ స్థానంలో ఓటింగ్ జరిగి ఉంటే కదా మీరు ఇలాంటి రాతలు రాయాల్సింది?. వేసుకుందే దొంగ ఓట్లు.. దానికి మళ్లీ ప్రజాస్వామ్యం నిలబడింది అంటూ స్టేట్‌మెంట్ ఇవ్వడం ఎందుకు?. ఇక్కడ జరిగింది పులివెందుల, కడప జిల్లా వాళ్లకు మాత్రమే తెలుసు. రాష్ట్రమంతా తెలియదు కాబట్టి ఎల్లో మీడియాలో ఇక్కడ అంతా సవ్యంగా జరిగినట్లు వార్తలు రాయించేసుకుంటున్నారు. మీ పత్రిక, చానల్ ఎంత అనైతికంగా ఇలాంటి వార్తలు రాస్తుందో మీరే ఒక సారి ఆత్మవిమర్శ చేసుకోండి. నిజమైన పోటీ జరిగి ఐదు ఓట్లతోనైనా టీడీపీ గెలిస్తే వారికి ఎనలేని తృప్తి ఉండేది.. మాకు బాధ ఉండేది. కానీ, ఈ విధంగా పోలీసుల సంపూర్ణ సహకారంతో వేలాది మంది టీడీపీ కార్యకర్తలను బూత్‌ల ఎదురుగా పెట్టి నిజమైన ఓటరు స్లిప్పులు లాక్కున్నారు.
నిజమైన ఓటర్లు ఉన్నారా?
నిజమైన ఓటరును అసలు పోలింగ్ బూత్‌లోకే పోనివ్వలేదు. దీన్ని ఎలక్షన్ అంటారా?.. ఇంకేమైనా అంటారా?. మీరు గెలిచామని మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే అవకాశమే లేదు. ప్రజలు ఓట్లు వేస్తే కదా.. మీరు గెలిచాం అని చెప్పుకోడానికి?. మీ దొంగ ఓటర్లు కూడా మీరు గెలిచారు అని అనుకోరు.. ఎందుకంటే జరిగిందతా వారికి తెలుసు కాబట్టి. వారితో ఓట్లు వేయించలేదు కాబట్టి పులివెందుల మండల ఓటర్లు మీరు గెలిచారని అసలే అనుకోరు. ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను, ఓటర్లను బూత్‌లోకి రానివ్వకుండా చేసుకున్న పోలింగ్‌ను ఎలక్షన్ అంటారా?. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వీరికి గుణపాఠం చెప్పే రోజు వస్తుంది.. అప్పుడు ఇలా దొంగ ఓట్లతో కాదు.. మనం ఎప్పుడు చేసే విధంగా నిజమైన ఓటింగ్‌తోనే వీళ్లకు గుణపాఠం చెబుదాం’ అని వ్యాఖ్యలు చేశారు.
