
సాక్షి, వైఎస్సార్‌జిల్లా: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి(Adinarayana Reddy) దౌర్జన్యం మరోసారి బయటపడింది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్(CM Ramesh)కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్ ఆఫీసుపై ఆదినారాయణరెడ్డి వర్గీయులు దాడి చేశారు. కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. ఎంపీ సీఎం రమేష్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇద్దరి మధ్య వివాదం కారణంగా గండికోట(Gandikota) అభివృద్ధి ఆగిపోతుంది.
గండికోటలో ఎంపీ సీఎం రమేష్‌కు వచ్చిన రూ.77 కోట్ల పనులను గతంలో ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. గతంలో అదానీ హైడ్రో పవర్ ప్లాంట్‌లో సీఎం రమేష్ చేస్తున్న పనులనూ ఆదినారాయణరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. అప్పట్లో అదానీ కార్యాలయంపై కూడా దాడి చేశారు.
గత ఏప్రిల్ నెలలో చిలంకూరులోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో కార్యకలాపాలను ఆదినారాయణరెడ్డి వర్గం నాలుగైదు రోజులు అడ్డుకోవడంతో ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఆదినారాయణరెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ల మధ్య పొసగడం లేదన్న సంగతి పలుసార్లు బహిర్గతమైంది. ఆదినారాయణరెడ్డి బంధువు పేకాట శిబిరాలు నడుపుతున్నాడంటూ సీఎం రమేష్.. గతంలో కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు.
ఇదీ చదవండి: అప్పులపై బాబు, పవన్ డ్రామా బట్టబయలు