
కలెక్టర్ సమక్షంలో దొంగ ఓట్లు వేస్తున్న జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి, సందీప్
కంటి తుడుపుగా రెండు బూత్‌లలో నిర్వహణ
ఆయా గ్రామాల్లో పచ్చముఠాల బెదిరింపులతో బయటకు రాని ఓటర్లు..
ఈ.కొత్తపల్లెలో కమలాపురం టీడీపీ ముఠా.. అచ్చివెళ్లిలో ‘బీటెక్’ బ్యాచ్ తిష్ట
ఇతర ప్రాంతాల నుంచి వచ్చి యథేచ్ఛగా దొంగ ఓట్లు..
రీపోలింగ్‌ను బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు
15 బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్
వెబ్ కాస్టింగ్ ఇస్తే అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తామన్న వైఎస్సార్‌సీపీ
సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను కప్పిపుచ్చుతూ కంటి తుడుపుగా రెండు చోట్ల నిర్వహించిన రీ పోలింగ్‌లోనూ దొంగ ఓట్ల దందా కొనసాగింది! రీ పోలింగ్ జరిగిన అచ్చివెళ్లి, ఇ.కొత్తపల్లె గ్రామాల్లో పోలింగ్ ప్రారంభానికి ముందే కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు తిష్ట వేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ రీ పోలింగ్‌ను బహిష్కరించడంతో సామాన్య ఓటర్లు ఇంటి నుంచి బయటికి రాలేదు. దీంతో పచ్చ ముఠాలు బుధవారం కూడా యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశాయి.
పోలింగ్ సందర్భంగా టీడీపీ గూండాల అరాచకాలను వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు మంగళవారం సాయంత్రం లేఖ రాశారు. అధికార పార్టీ అరాచకాలతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని, 14వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని కోరారు. ఈ నేపథ్యంలో టీడీపీ గూండాల అరాచకాలను కప్పిపుచ్చుతూ ఎన్నికల కమిషన్ కంటి తుడుపు చర్య తీసుకుంది. కేవలం రెండు పోలింగ్ కేంద్రాల్లో రీ–పోలింగ్‌కు ఆదేశించింది.
అది కూడా బుధవారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. మొత్తం బూత్‌లలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలన్న వైఎస్సార్‌సీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థుల విన్నపాలను ఈసీ పెడచెవిన పెట్టింది. 15 పోలింగ్ బూత్‌లలో 10,601 ఓట్లు ఉండగా కేవలం 1,765 ఓట్లకు మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించింది. తక్కువ ఓట్లు ఉన్న రెండు పోలింగ్ కేంద్రాలను ఎంచుకుని రీ పోలింగ్‌కు ఆదేశాలు ఇచ్చింది. ఒంటిమిట్టలో పలు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని కోరినా ఈసీ పట్టించుకోలేదు.
రెండు చోట్లా అదే తంతు..
రీ పోలింగ్ జరిగిన ఇ.కొత్తపల్లె (14వ బూత్), అచ్చివెళ్లి (3వ బూత్)లో టీడీపీ గూండాలు యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారు. ఇ.కొత్తపల్లెలో కమలాపురం టీడీపీ నేతలు, అచ్చివెళ్లిలో బీటెక్ రవి అనుచరులు క్యూలైన్లలో నిలుచుని దొంగ ఓట్లు వేసుకున్నారు. కమలాపురం మండలం నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గుజ్జల నారాయణయాదవ్ రీ పోలింగ్ క్యూలైన్‌లో కనిపించాడు. టీడీపీ గూండాల బెదిరింపులతో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రాకపోవడంతో 10 గంటలకు అచ్చివెళ్లిలో కేవలం 6.71 శాతం, ఇ.కొత్తపల్లెలో 11.47 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.
ఇక గ్రామస్తులు ఓటింగ్‌కు రారని గ్రహించిన టీడీపీ మూకలు దొంగ ఓట్లు వేసేందుకు క్యూలైన్లలో చొరబడ్డాయి. మధ్యాహ్నం 12 గంటలకు అచ్చివెళ్లిలో 33.74 శాతం, ఇ.కొత్తపల్లెలో 26.71 శాతం పోలింగ్ జరిగింది. 3 గంటలకు అచ్చివెళ్లిలో 59.35 శాతం, ఇ.కొత్తపల్లెలో 42.5 శాతం పోలింగ్ నమోదు కాగా సాయంత్రం 5 గంటలకు అచ్చివెళ్లిలో 68.5 శాతం, ఇ.కొత్తపల్లెలో 54.28 శాతం నమోదైంది.
‘మమ’ అనిపించేందుకే..!
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ అభ్యర్థులకు వెబ్ కాస్టింగ్ ఇస్తే దొంగ ఓట్లు నిరూపిస్తామని, ఆ తర్వాత రీ పోలింగ్ ఆదేశాలు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. క్యూలైన్లలో ఉన్న టీడీపీ నేతల పేర్లు, జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల్లో వారి ఓటు వివరాలు, పులివెందులలో ఓటు వేస్తున్న దృశ్యాలతో కూడిన ఆధారాలతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించకుంటే న్యాయస్థానాలు తప్పుబట్టే అవకాశం ఉన్నందున ఎన్నికల కమిషన్ కంటితుడుపు చర్యగా కేవలం రెండు బూత్‌లలో మాత్రమే రీ పోలింగ్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రీ పోలింగ్ నిర్వహించామని చెప్పుకునేందుకు మాత్రమే ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఎన్నికల కమిషన్ తీరుకు నిరసనగా రీ పోలింగ్‌ను వైఎస్సార్‌సీపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం బహిష్కరించారు.
కలెక్టరు కార్యాలయం తొలగించిన ఆ ట్వీట్ కథేంటో?
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార టీడీపీ భారీగా దొంగ ఓట్లు వేసిందనేందుకు సాక్ష్యంగా నిలిచిన ఓ ఫొటో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ సమక్షంలోనే ఈ దొంగ ఓట్ల తతంగం జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసినట్లు పేర్కొంటున్న ఓ ట్వీట్‌ను అకస్మాత్తుగా తొలగించారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.
‘‘జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా మంగళవారం పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, ఎర్రబెల్లి గ్రామాల్లో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ పరిశీలించారు’’ అంటూ కలెక్టర్ కార్యాలయ అధికారి ట్వీట్ చేశారు. ఉన్నతాధికారులు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తున్న 4 ఫొటోలను జత చేశారు.

అయితే, కొంతసేపటికే దానిని తొలగించారంటూ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనికి కారణం... ఈ ట్వీట్‌లోని ఓ ఫొటోలో కలెక్టర్ ఎదుట ఓటు వేస్తున్నవారు పులివెందుల మండలానికి సంబంధం లేని జమ్మలమడుగు నియోజకవర్గ ఓటర్లు అని ఆధారాలతో సహా ప్రచారం జరగడమే అంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వివరణ ఇవ్వాలంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.

పులివెందుల, ఒంటిమిట్టలో రీ పోలింగ్‌కు ఆదేశాలివ్వండి
» అధికార పార్టీ నేతలు అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు
» రీ పోలింగ్ కోరినా ఎన్నికల సంఘం స్పందించడం లేదు
» హైకోర్టులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పిటిషన్.. నేడు విచారణ
సాక్షి, అమరావతి: ‘‘పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ నాయకులు బెదిరింపులు, దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రాలను ఆక్రమించారు. ఈ నేపథ్యంలో రీ పోలింగ్‌కు చర్యలు చేపట్టేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి’’ అని కోరుతూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తుమ్మల హేమంత్‌రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం లంచ్ మోషన్ రూపంలో అత్యవసర పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాలపై వెంటనే విచారణ జరపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది వీఆర్‌రెడ్డి కొవ్వూరి కోర్టును కోరారు. లేదంటే నిరర్ధకం అవుతాయన్నారు. సకాలంలో వ్యాజ్యాలు తమ ముందుకురాలేదని, అత్యవసర విచారణ సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. గురువారం విచారణ జరిపేందుకు అంగీకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్‌ఈసీ ఆదేశాలు కంటితుడుపే..
జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ భారీ అక్రమాలకు పాల్పడిందని పిటిషనర్లు పేర్కొన్నారు. అన్ని పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకుందని తెలిపారు. కేవలం రెండు కేంద్రాల్లో మాత్రమే రీ పోలింగ్ నిర్వహిస్తున్నారని, మొత్తం 15 కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. అవకతవకలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇచ్చామని.. కానీ, రెండుచోట్ల మాత్రమే రీ పోలింగ్‌కు ఆదేశాలు జారీ చేసిందని, ఇది కంటితుడుపు చర్య అని వైఎస్సార్‌సీపీ నేతలు అభివర్ణించారు. అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడిన పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ ఫుటేజీ, వెబ్ కాస్టింగ్‌ను భద్రపరిచేలా ఆదేశాలివ్వాలని కోరారు.
మారణాయుధాలతో భయపెట్టి ఓట్లేసుకున్నారు..
‘‘టీడీపీ వారు మారణాయుధాలు ధరించి ఓటర్లను బెదిరించి, భయపెట్టారు. సాధారణ ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం లేకుండా చేశారు. మా పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్లపై బహిరంగంగానే దాడులకు పాల్పడ్డారు. అసలు ఓట్లు లేనివారు, స్థానికేతరులు కూడా ఓటు వేశారు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. అధికార పార్టీ నేతల అండతో మా నాయకులను అక్రమంగా నిర్బంధించారు. ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను పలుసార్లు కోరినా ప్రయోజనం లేకపోయింది. అందుకే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది’’ అని వైఎస్సార్‌సీపీ నాయకులు వివరించారు.