తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి
నా మీద గౌరవంతో చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేశారు
ఆయనతో ఏకాంతంగా సమావేశమై ఆ పనులు నిలిపి వేయించా
కావాలంటే నిజ నిర్ధారణ కమిటీని పంపి చెక్ చేసుకోవచ్చు
తద్వారా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు అనుమతులు తెస్తున్నామని స్పషీ్టకరణ
చంద్రబాబు వైఖరితో ‘సీమ’ ఎత్తిపోతలకు మరణ శాసనం
ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కోట్ల మంది ప్రయోజనాలు తాకట్టు
బాబు తీరుపై విస్తుపోతున్న సాగు నీటి రంగ నిపుణులు, రైతులు
రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి దాకా నేను సాధించిన విజయాలను చెప్పుకోలేదు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో నేను ఏకాంతంగా (క్లోజ్డ్ రూమ్) సమావేశమైనప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపేయాలని విజ్ఞప్తి చేశాను. నా మీద గౌరవంతో చంద్రబాబు ఆ పనులు ఆపేశారు. అధ్యక్షా.. రాయలసీమ ఎత్తిపోతలు పనులు ఆగినాయా? లేదా? తెలుసుకోవడానికి కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేయండి. సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్, బీజేపీ నేత మహేశ్వరరెడ్డి, కావాలంటే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కూడా కమిటీలో నియమించి అక్కడికి పంపండి. ఒకవేళ శ్రీశైలంలో మేం కట్టే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కొత్తదని మీరు అభ్యంతరం పెడితే.. మేం తక్షణమే పాత ప్రతిపాదన అయిన జూరాల నుంచి రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల చేపడతామని చంద్రబాబుకు చెప్పాను. ఆ చర్చల ద్వారా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను సాకారం చేస్తున్నాం.
– తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతలకు, ఆ దుర్భిక్ష ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబునాయుడు మరణ శాసనం రాశారన్న కఠోర వాస్తవం శనివారం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బహిర్గతమైంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో తాను ఏకాంతంగా సమావేశమైనప్పుడు రాయలసీమ ఎత్తిపోతలను ఆపేయాలని విజ్ఞప్తి చేశానని, తన మీద గౌరవంతో చంద్రబాబు ఆ ఎత్తిపోతల పనులు ఆపేశారని తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కావాలంటే ఆ ఎత్తిపోతల పనులు ఆగాయో లేదో తెలుసుకోవడానికి నిజ నిర్ధారణ కమిటీని అక్కడికి పంపుదామన్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక రాయలసీమ ఎత్తిపోతల పనులు పూర్తిగా ఆగిపోవడాన్ని బట్టి చూస్తే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పింది అక్షర సత్యమన్నది స్పష్టమవుతోంది.
గత ఏడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్‌పర్ట్ అప్రయిజల్ కమిటీ) సమావేశంలో చంద్రబాబు సర్కారు సమర్థవంతమైన వాదనలు వినిపించక పోవడం ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పనులకు సమాధి కట్టడాన్ని బట్టిచూస్తే ఇది వాస్తవమేనని తేటతెల్లమవుతోంది. ఓటుకు కోట్లు కేసులో 2015లో తెలంగాణ సర్కార్‌కు అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు.. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టారని.. ఇప్పుడు తన శిష్యుడు రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం అదే కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను వదిలేసుకుని రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఆ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు మరణ శాసనం రాశారని సాగు నీటి రంగ నిపుణులు, రైతులు మండిపడుతున్నారు.
హక్కులను కాపాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల
⇒ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. సీమ ప్రాజెక్టులకు సాగునీరివ్వడం కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగు గంగకు 29, గాలేరు–నగరికి 38.. మొత్తంగా 101 టీఎంసీలు సరఫరా చేయాలి.
⇒ రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకు శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం తమ భూ భాగంలో ఉందని తెలంగాణ సర్కార్ దాన్ని తన అధీనంలోకి తీసుకున్నా.. ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం నాటి చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఫలితంగా కృష్ణా బోర్డు కేటాయింపులు చేయకున్నా, దిగువన నీటి అవసరాలు లేకున్నా.. తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా శ్రీశైలం జలాశయంలో 798 అడుగుల నుంచే ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తూ వస్తోంది. 800 అడుగుల నుంచే నీటిని తరలించేలా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది.
⇒ తెలంగాణ సర్కార్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా 2015లో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టినా నాటి చంద్రబాబు సర్కార్ అడ్డుకోలేదు. ఇలా తెలంగాణ సర్కార్ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తుండటం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాడుకోలేని దుస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగు నీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగు నీటికి సైతం తల్లడిల్లాల్సిన దయనీయ పరిస్థితి.
⇒ తడారిన గొంతులను తడిపేందుకు.. హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికే తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తద్వారా చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా చేయడం, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం.
⇒ ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎక్కడ మంచి పేరొస్తుందోననే ఈర్ష్యతో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్‌లో తెలంగాణ ప్రాంతంలోని రైతులతో టీడీపీ నేతలు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతి తీసుకుని, ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది.

తాగునీటి పనులకూ బ్రేక్
రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తూనే.. ఆ అనుమతి వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నాటి వైఎస్సార్‌సీపీ సర్కార్ నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగు గంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్‌లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి.
అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించాలని ప్రభుత్వానికి జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదన పంపారు. పర్యావరణ అనుమతి వచ్చేలోగా రాయలసీమ ఎత్తిపోతలలో తాగు నీటి కోసం తరలించడానికి అవసరమైన పనులను చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. కానీ.. గతేడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించక పోవడంతో రాయలసీమ ఎత్తిపోతల తొలి దశ పనులకు బ్రేక్ పడింది. పర్యావరణ అనుమతులు వచ్చేలోగా తాగునీటి పనులు కొనసాగించడంలో ఏమాత్రం తప్పులేదని చెప్పలేకపోయింది. ఫలితంగా ఈ ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం చేసిన పనులను తొలగించి, యథాస్థితికి తేవాలని ఈఏసీ ఆదేశించింది.
నిర్విఘ్నంగా పాలమూరు–రంగారెడ్డి
⇒ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో గరిష్టంగా 120 టీఎంసీలు తరలించేలా 2015లో తెలంగాణ సర్కార్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల (1.5 టీఎంసీలు), డిండి ఎత్తిపోతల (0.5 టీఎంసీలు) చేపట్టింది. తద్వారా మన రాష్ట్ర హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని అటు రైతులు.. ఇటు నీటి పారుదల రంగ నిపుణులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసినా అప్పటి చంద్రబాబు సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది.
⇒ ఇటు ఏపీ, అటు తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలన్న రెండు కళ్ల సిద్ధాంతం.. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం కోసం.. వ్యక్తిగతంగా లబ్ధి పొందాలన్న లక్ష్యంతో 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మొదటి సమావేశంలో నాటి సీఎం చంద్రబాబు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై నోరు మెదపలేదు. దాంతో 2019 నాటికి ఆ ప్రాజెక్టు పనులను సింహ భాగం తెలంగాణ సర్కార్ పూర్తి చేసింది.
⇒ కృష్ణా జలాల్లో చిన్న నీటి పారుదల విభాగంలో 45.6 టీఎంసీల మిగులు ఉందని.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకు గాను 45 టీఎంసీల కృష్ణా జలాలు అదనంగా తమకే దక్కుతాయని తనకు తానే తెలంగాణ సర్కార్ తీర్మానించుకుంది. ఆ రెండూ కలిపి 90 టీఎంసీలతో పాలమూరు–రంగారెడ్డిని చేపట్టినట్లు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించింది. ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ సీడబ్ల్యూసీకి డీపీఆర్ పంపగా.. దాన్ని సీడబ్ల్యూసీ అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి పంపి అభిప్రాయాన్ని కోరింది.
⇒ చిన్న నీటి పారుదల విభాగంలో 45.6 టీఎంసీల మిగులు లేదని.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీల్లో ఎవరి వాటా ఎంత అన్నది ట్రిబ్యునల్ తేల్చాలని సీడబ్ల్యూసీకి 2022 సెప్టెంబరు 19న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నివేదించింది. నీటి లభ్యతే లేని ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని, తద్వారా ఏపీ హక్కులను పరిరక్షించాలని కోరింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన సీడబ్ల్యూసీ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వానికి వెనక్కు పంపింది.
⇒ దీంతో ఇప్పుడు తెలంగాణ సర్కార్ కొత్త ఎత్తు వేసింది. చిన్న నీటి పారుదల విభాగం కింద తమకు కేటాయించిన నీటిలో 45.6 టీఎంసీలు మిగులు ఉందని.. ఆ నీటిని తాగునీటి అవసరాల కోసం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల తొలి దశ ద్వారా తరలించడానికి అనుమతి ఇవ్వాలంటూ సీడబ్ల్యూసీకి డీపీఆర్ సమర్పించింది. ఆ మేరకు నిర్విఘ్నంగా పనులు చేస్తున్నా చంద్రబాబు సర్కార్ నోరు మెదపకపోవడం పట్ల సాగు నీటి రంగం నిపుణులు, రైతులు విస్తుపోతున్నారు.


