సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని, రాయలసీమ ప్రాంతాన్ని చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి మరణశాసనం లిఖించారని.. ‘సీమ’ ప్రాంతాన్ని ఎడారి చేసేందుకు, చంద్రబాబు చేసుకున్న రహస్య ఒప్పందం బట్టబయలైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను చంద్రబాబు బలిపెట్టారని శనివారం ‘ఎక్స్’లో ఆ పార్టీ మండిపడింది. ‘నేను కోరినందువల్లే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఆపేశారు. చంద్రబాబుతో జరిగిన ఏకాంత సమావేశంలో నేను కోరగానే ఆయన ఒప్పుకున్నారు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయి. కావాలంటే నిజనిర్ధారణ కమిటీ కూడా వెళ్లి చూసుకోవచ్చు’.. అంటూ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక విషయాలు వెల్లడించారని వైఎస్సార్‌సీపీ ఆ పోస్టులో పేర్కొంది.
సీమ అంటే గిట్టని చంద్రబాబు
రాయలసీమ సాగు నీటి ప్రాజెక్టులు, అభివృద్ధి విషయంలో చంద్రబాబుకు తొలి నుంచీ చిత్తశుద్ధి లేదు. ఆ విషయం ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలతో తేటతెల్లమైంది. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన బృహత్తర రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తొలి నుంచి చంద్రబాబు మోకాలడ్డుతూనే ఉన్నాడు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రజల గొంతు కోయడం సరికాదు. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు. రాయలసీమ ప్రజలు ఈ విషయంలో పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి.
– సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ కార్మిక, కర్షక సమితి
ఇది ఏపీ ప్రజల హక్కులపై దాడి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలపై ఏపీ సీఎం చంద్రబాబు తక్షణం స్పందించాలి. చంద్రబాబు ఏపీ ప్రజల హక్కులపైన దాడి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాయలసీమకు ఎత్తిపోతల పథకం చాలా అవసరం. గతంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దాదాపు రూ.7వేల కోట్లతో తీసుకొచ్చారు. ఇందులో పైపులైన్ పనులు చాలావరకు పూర్తయ్యాయి. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మరో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ తానే నిలిపేయించానని చెప్పడమే కాకుండా కమిటీ వేస్తానంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి రేవంత్ రెడ్డి ప్రకటనను ఖండించాలి. రాయలసీమలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతి ఎమ్మెల్యే స్పందించాలి. లేదంటే రాయలసీమ చరిత్రలో ఒక మాయని మచ్చగా తెలుగుదేశం పార్టీ మిగిలిపోతుంది.
– మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి, సమన్వయకర్త, రాయలసీమ మేధావుల ఫోరం
సీమకు అన్యాయం చేసేందుకే కుట్ర
రాయలసీమకు నీరు రాకుండా చంద్రబాబు కుట్ర చేశారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం బయటపెట్టారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపివేయాలని ఏపీ సీఎం చంద్రబాబుకు చెప్పడం చూస్తుంటే ఆ కుట్ర బహిర్గతమైంది. గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ బలోపేతానికి కృషి చేశారు. సీఎం చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా నిలిచిపోతారు.
– ఆకేపాటి అమర్నాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు
సీమకు చంద్రబాబు అన్యాయం
నిత్యం కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమకు సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఇదే విషయం శనివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టడంతో చంద్రబాబు నిజస్వరూపం మరోసారి బయటపడింది. ఇద్దరు సీఎంలు చర్చించుకున్న సమయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలని చెప్పడంతో పనులు ఆగిపోయిన విషయం రేవంత్ రెడ్డే చెప్పారు. కరువు ప్రాంతమైన రాయలసీమకు అన్యాయం చేస్తే వారికి భవిష్యత్‌లో రైతులే గుణపాఠం చెబుతారు.
– గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సీమ ద్రోహి చంద్రబాబు
రాయలసీమ ప్రాజెక్టులకు తాగునీరు అందించే ఉద్దేశంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని రుజువు చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాము ఏపీ చంద్రబాబు నాయుడికి చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయించానని సాక్షాత్తు తెలంగాణ సాక్షిగా కుండ బద్దలుకొట్టారు. సీఎం చంద్రబాబు తక్షణం నోరు విప్పాలి. చంద్రబాబుకు రాయలసీమ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలి.
– పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు
రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటే. ఏపీకి దక్కాల్సిన కృష్ణా జలాలను తెలంగాణకు తరలించినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ముఖ్యంగా రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణ శాసనం రాస్తున్నారన్నది మరోసారి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రుజువైంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపాలని తాను అడిగానని, చంద్రబాబు ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆపించానని రేవంత్ రెడ్డి పేర్కొనడం ద్వారా రాయలసీమ రైతులకు చంద్రబాబు తీవ్రంగా అన్యాయం చేశారన్నది రుజువైంది. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి.. రాజకీయంగా పబ్బం గడుపుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.
– అనంత వెంకట్రామి రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, అనంతపురం
సీమ అంటే చులకన భావం
రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును కోరగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయడం ఇక్కడి రైతులను దగా చేయడమే. సొంత రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి ఉండడం మన దౌర్భాగ్యం. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో అధికంగా కృష్ణా జలాలు ఆంధ్రాకు తీసుకెళ్లారని రేవంత్ రెడ్డే చెప్పారు. కానీ ఇప్పుడు చంద్రబాబు స్వార్థం వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతోంది.
– సాకే శైలజానాథ్, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత
ప్రతిసారి రాయలసీమకు ద్రోహమే
చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారి రాయలసీమకు అన్యాయమే చేశాడు. సీమపై బాబు వైఖరి మరోసారి బట్టబయలైంది. తన శిష్యుడైన రేవంత్‌రెడ్డి ఏకంగా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను తానే ఆపించానని.. కావాలంటే అసెంబ్లీ వేదికగా నిజనిర్ధారణ కమిటీ వేసి చంద్రబాబును అడగండి అన్నారంటే సీమకు గురుశిష్యులు కలిసి ఏ స్థాయిలో ద్రోహం చేస్తున్నారో అర్థమవుతోంది. వెంటనే రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలి. లేదంటే ఆయన్ను రాయలసీమ ద్రోహిగా భావించాల్సి వస్తుంది. రాయలసీమలో పుట్టి, ఈ ప్రాంతంలోని రాయలసీమ లిఫ్ట్‌ను ఒకరు చెబితే నువ్వు నిలిపేశావంటే ఇంతకంటే ద్రోహం సీమకు మరొకటి ఉండదు.
– కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు
సీమ ద్రోహి చంద్రబాబు
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలతో చంద్రబాబుచరిత్రలో రాయలసీమ ద్రోహిగా నిలిచిపోతారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను సీమ ప్రాంతానికి రాకుండా తాను చంద్రబాబుతో కలిసి అడ్డుకున్నానని తెలంగాణ సీఎం చెప్పడం గమనార్హం. ఏనాడూ చంద్రబాబు సీమ ప్రాంతం గురించి ఆలోచించలేదు. అమరావతి తప్ప సీమ ప్రాంతానికి నిధులు, ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు. తెలంగాణలో చంద్రబాబు శిష్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తన నిజాయితీని నిరూపించుకోవాలి. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామని చెప్పిన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడైనా నిధులు రాబట్టాలి.
– ఎస్వీ మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు
ఇద్దరు సీఎంలూ మోసం చేశారు..
రాయలసీమకు సాగునీటిని అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుమ్మక్కై తీవ్ర అన్యాయానికి పాల్పడ్డారు. నాడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభిస్తే ఇదే టీడీపీ నాయకులు కోర్టులకు వెళ్లి నిలుపుదల చేయించారు. నేడు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రాజకీయ స్వలాభం కోసం రాయలసీమ ప్రజల జీవనాడిగా చెప్పుకునే కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నారు.
– ఆర్.రమేష్ కుమార్ రెడ్డి, హిందూపురం పార్లమెంటరీ వైఎస్సార్‌సీపీ పరిశీలకుడు
తన ఆర్థిక ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు చేతులు కలిపి రాయలసీమకు మరణ శాసనం రాశారని వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, రాష్ట జల వనరుల శాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘తన స్వార్థం కోసం తెలంగాణ సీఎంతో లాలూచీపడి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ఆపేశారు. ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డే తెలంగాణ అసెంబ్లీలో వెల్లడించారు.
సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తన సొంత రాష్ట్రాన్ని ఈ రకంగా తాకట్టు పెట్టడం, రాష్ట్ర ప్రయోజనాలను ఈ రకంగా తన స్వార్థంకోసం అమ్ముకోవడం బహుశా దేశ చరిత్రలో ఎక్కడాచూసి ఉండం. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్ట్ కమీషన్ల కోసమే ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా ఇలా దెబ్బతీసూ్తనే ఉన్నాడు. రాష్ట్రానికి, రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు చేసిన దుర్మార్గాన్ని ఖండిస్తున్నాం. ఇంతటి అన్యాయం చేసిన చంద్రబాబును ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు’ అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
– అంబటి రాంబాబు, మాజీ మంత్రి
శిష్యుడికి గురువు దక్షిణ ఇచ్చినట్లుగా ఉంది..
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను చంద్రబాబుతో మాట్లాడి తాను నిలిపివేయించినట్లు తెలంగాణ సీఎం చేసిన ప్రకటన తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరు అందిస్తామని ఇంతకాలం చెప్పారు. ఇప్పుడు ఏకంగా ఆ పథకాన్ని ఆపేయడానికి చంద్రబాబు అంగీకరించారన్నది నిర్ధారణైంది. గురువుకు శిష్యుడు దక్షిణ ఇవ్వడం చూశాంగానీ.. ఇప్పుడు గురువు శిష్యుడికి దక్షిణ ఇచ్చినట్లు ఉంది.
– రాంభూపాల్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
రాయలసీమకు మరణశాసనం రాసిన చంద్రబాబు
చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్ ద్రోహి అనేది ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మాటలతో తేటతెల్లమైంది. దీనిబట్టి చంద్రబాబు రాయలసీమకు మరణ శాసనం రాసినట్లు రుజువైంది. అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సస్యశ్యామలం చేయడానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషిచేస్తే చంద్రబాబు ఆలోచన అందుకు విరుద్ధంగా ఉంది.
– కేవీ రమణ, అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు
చంద్రబాబు, రేవంత్ ఇద్దరూ తోడుదొంగలు
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఇద్దరూ తోడుదొంగలు. ఓటుకు కోట్లు కేసులో ఇద్దరూ ఉన్నారు. చంద్రబాబుకు నీటి ప్రాజెక్టులు ఏమాత్రం పట్టవు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు చంద్రబాబు పూర్తి వ్యతిరేకం. కాబట్టే ఆపేశాడు. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ సీఎం చెబుతున్నాడు. రాయలసీమకు ఇంతకంటే ద్రోహం చేసేవారు మరొకరు ఉండరు.
– ఇమాం, కదలిక ఎడిటర్


