
సాక్షి, వైఎస్సార్: కడప టీడీపీలో అసమ్మతి సెగలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డికి వ్యతిరేకంగా పచ్చ పార్టీ శ్రేణులు బహిరంగంగా నిరసనలకు దిగాయి. దీంతో, టీడీపీలో నేతల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి.
వివరాల ప్రకారం.. కడపలో టీడీపీ సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ కార్యకర్తలు, నాయకులు సమావేశం అయ్యారు. అనంతరం వారంతా దేవునికడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి మంచి బుద్ది ప్రసాదించాలని పూజలు చేశారు. ఇదే సమయంలో వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం అందజేశారు. ఆది నుంచి ఇప్పటి వరకు టీడీపీ జెండా మోసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే మాధవీ రెడ్డి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇక, ఇటీవల టీడీపీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తూ సీనియర్లను మాధవీ రెడ్డి తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. ఈ వ్యవహారమై.. వారంతా కమలాపురం సీనియర్ నాయకుడు పుత్తా నరసింహారెడ్డిని కలవనున్నట్టు తెలిపారు. టీడీపీ కోసం పనిచేసిన తమని గుర్తించి.. ఆదుకోవాలని పచ్చ పార్టీ నాయకులు కోరుతున్నారు. దీంతో, టీడీపీలో అసమ్మతి వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.