
1983లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించినప్పుడు ఆ పార్టీ అభిమానులు కొంతమంది కనిపించిన ఈనాడు జర్నలిస్టులందరికీ పూలదండలు వేసి సత్కరించారు. ఈనాడు పత్రిక ఆఫీస్ గేటుకు కూడా పూలమాలలు కట్టి వెళ్లేవారు. ఇదెక్కడి గొడవ! ఎంత టీడీపీకి సపోర్టు చేసినా, ఇలా మెడలో బొమికలు వేసుకున్నట్లుగా పరిస్థితి ఏర్పడిందేమిటా అని కొందరు సీనియర్ జర్నలిస్టులు బాధపడేవారు.
సరిగ్గా 42 ఏళ్ల తర్వాత అంతకన్నా ఘోరమైన పరిస్థితి ఏపీలో ఏర్పడడం అత్యంత విచారకరం. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నకలలో టీడీపీకి చాలా కష్టపడి గెలిపించిన కొంతమంది పోలీసు అధికారులకు, జిల్లా ఎన్నికల యంత్రాంగ ముఖ్యులకు టీడీపీ నేతలు సన్మానం చేసి ఉండాలి. అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మద్దతు మీడియా యజమానులకు, జర్నలిస్టులకు కూడా సత్కారాలు జరిగి ఉండాలి. ఆ టీడీపీ మీడియా కార్యాలయాలలో స్వీట్స్ కూడా పంచుకుని ఉంటారు. ఇవి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలైతే అదో రకం. కాని రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో రిగ్గింగ్ ద్వారా గెలవడంపై కూడా ఇంత సంబరపడాలా అని టీడీపీ క్యాడరే విస్తుపోతోంది.
ఎందుకంటే గెలిచింది టీడీపీ కాదని, కొంతమంది పచ్చ చొక్కా వేసుకున్న పోలీస్ అధికారులన్నది ప్రజలందరికి తెలిసిన సత్యం. టీడీపీ అధినాయకత్వం, పోలీస్ యంత్రాంగం, ఎన్నికల నిర్వహణ అధికారులు, ఎన్నికల కమిషన్, టీడీపీకి మద్దతిచ్చే మీడియా .. ఇలా అందరికి తెలుసు వాస్తవం ఏమిటో! అయినా వారు జనాన్ని మోసం చేయడానికి తమ వంతు కృషి చేశారనిపిస్తుంది. ఎల్లో మీడియా నిస్సిగ్గుగా వైఎస్సార్‌సీపీ ఓడినట్లు భ్రమ కలిగించడానికి నానా పాట్లు పడ్డారు. వైకాపాకు ఘోర పరాభవం అంటూ ఈనాడు మీడియా శీర్షిక పెట్టింది. నిజానికి పరాభవం జరిగింది ప్రజాస్వామ్యానికి. అయినా ఆత్మవంచన చేసుకుని వార్తలు ఇచ్చారు. అందులో పులివెందులను, వైఎస్ కుటుంబాన్ని ఒక భూతంగా చూపించడానికి ఆ మీడియా చేసిన ప్రయత్నం గమనిస్తే సంబంధిత జర్నలిస్టులపై అసహ్యం కలుగుతుంది. మరో విధగా చూస్తే ఇంత కట్టుబానిసలుగా మారారా అని జాలి కలుగుతుంది.
ముప్పై ఏళ్లలో తొలిసారి ఓటు వేశానని ఎవరో ఒకరు స్లిప్ వేశారట. అది అసత్యమే అయినా దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు అందరూ ప్రచారం చేశారు. ఈ ముప్పై ఏళ్లలో సగం కాలం ఆయనే పాలన చేశారు. దానిని బట్టి ఆయన సమర్థంగా పరిపాలన చేయలేదని ఒప్పుకుంటున్నారా? ఏ నియోజకవర్గంలో అయినా కొన్ని సమస్యలు ఉంటే ఉండవచ్చు. కాని పులివెందులలో రాక్షసులు ఉంటారన్నట్లుగా ప్రచారం చేసి ఒక ప్రాంత ప్రజలను అవమానించడానికి టీడీపీతోపాటు ఈ మీడియా వెనుకాడడం లేదనిపిస్తుంది. ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకలకు చెందిన వేలాది మందిని ఓటర్లుగా చేర్పించి దొంగ ఓట్లు వేయిస్తుంటారని చెబుతారు.
గతంలో అక్కడ ఆయనకు ప్రత్యర్ధిగా పోటీచేసిన చంద్రమౌళి అనే దివంగత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆ బోగస్ ఓట్లను తొలగించడానికి ఎంత ప్రయత్నించినా, సాధ్యపడలేదని అనేవారు. దాని గురించి ఎన్నడైనా ఈ మీడియా ఒక్క వార్త రాసిందా? కొన్ని దశాబ్దాలుగా పులివెందుల ప్రశాంతంగా ఉంటోందని, చాలావరకు ఎవరి ఓటు వారు వేసుకునే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. అలాంటిది మళ్లీ ఆ ప్రాంతంలో ఫ్యాక్షనిజం వేళ్లూనుకునేలా ప్రభుత్వం, పోలీసులే ప్రయత్నించడం ఎంత దారుణం? స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోండి అని ఒకప్పుడు పోలీసులు ప్రజలకు చెప్పేవారు. ర్యాలీలు తీయించేవారు. అలాంటిది ఓటు వేయడానికి వచ్చిన వారిని ఓటు వేయనివ్వకుండా చేసిన గొప్ప పోలీస్ యంత్రాంగాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలోనే చూస్తున్నాం.
చివరికి ప్రజలు తమ ఓటు తమను వేసుకోనివ్వండి అని పోలీసుల కాళ్లు పట్టుకున్న ఘటన కూడా దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. ఇది కూడా గొప్ప విషయమే అని పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. అందుకే ఈ మీడియా మురికి మీడియాగా మారిందన్న విమర్శలకు గురి అవుతోంది. పోలింగ్ బూత్ లను మార్చేయడం, వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను తరిమేయడం, పొరుగున ఉన్న జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల నుంచి టీడీపీ, బీజేపీ నేతలు తమ కార్యకర్తలను తరలించి దొంగ ఓట్లు వేయించడం, వైఎస్సార్‌సీపీ వారిపై దాడులకు తెగపడడం వంటివి చూస్తే ప్రభుత్వమే ప్రజాస్వామ్యానికి పాతర వేసినట్లనిపిస్తుంది. అలాంటి వారికి అండగా నిలబడ్డ పోలీస్ అధికారులకు టీడీపీ నాయకత్వం ఎంతగా సన్మానించినా తప్పు ఉండకపోవచ్చు.
స్వయంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ బూత్ పరిశీలన సమయంలోనే జమ్మలమడుగు నుంచి వచ్చిన దొంగ ఓటర్లు దర్జాగా ఓటు వేసుకుంటున్నారంటే అధికార యంత్రాంగం ఎంత బాగా పని చేసింది తెలిసిపోతుంది. దీనిని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఫోటోలతోసహా చూపించడంతో కలెక్టర్ తన సోషల్ మీడియా అక్కౌంట్ నుంచి ఆ పోస్టును తొలగించుకున్నారే కాని, అలా దొంగ ఓట్లు వేసిన వారిపై చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించలేదే. ఇలాంటి అధికార యంత్రాంగానికి కూడా టీడీపీ నేతలు రుణపడి ఉండవచ్చు. వైఎస్సార్‌సీపీ వారి ఎన్నికల ప్రచారాన్ని పత్తాపారం అంటూ పోల్చి, టీడీపీ వారి దౌర్జన్యాలకు అండగా నిలబడ్డ పోలీస్ అధికారులను బహుశా టీడీపీ అధినాయకత్వం శహభాష్ అని మెచ్చుకుని ఉండాలి.ఇలాంటి వారందరికి డబుల్ ప్రమోషన్ లు కూడా వస్తాయోమే చూడాలని టీడీపీ నేతలే కొందరు చమత్కరించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఈ దొంగ ఓట్లు వేయించిన నేతలు తెలివితక్కువగా వ్యవహరించారని టీడీపీ నాయకత్వ ఫీల్ అవుతోందట. వైఎస్సార్‌సీపీకి, వైఎస్ జగన్ కు బలమైన పులివెందుల మండలంలో మరీ ఆ పార్టీకి డిపాజిట్ రాకుండా ఓట్లు రిగ్ చేయడం వల్ల ఫలితాలను ప్రజలు ఎవరూ నమ్మని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ అధినాయత్వం అసహనం వ్యక్తం చేసిందట. మంచి మెజార్టీతో గెలిచేలా రిగ్గింగ్ చేయండని చెబితే వీరు మితిమీరిన ఉత్సాహంతో చేసిన ఈ పని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి అప్రతిష్ట వచ్చిందని భావించి ఉండాలి. రిగ్గింగ్ చేసేటప్పుడు వైఎస్సార్‌సీపీకి కూడా గణనీయంగా ఓట్లు వేసి ఉంటే ప్రజలు నిజంగానే వైఎస్సార్‌సీపీ ఓడిపోయిందేమోలే అనుకునేవారని, అలా చేయకపోవడంతో టీడీపీ అసలు రంగు బయట పడిపోయిందని ఆ పార్టీ నేతలు కొంతమంది వాపోతున్నారు. వైఎస్సార్‌సీపీకి దిమ్మతిరిగే ఫలితం అని మరో టీడీపీ మీడియా రాసింది. అవును..అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని,అరాచకం చేస్తే వైఎస్సార్‌సీపీకి కాదు దిమ్మతిరిగేది..
రాష్ట్ర ప్రజలకు.ఇంత అధ్వాన్నంగా పాలన సాగుతోందా అన్న విషయం ప్రజలందరికి అర్థమైపోయింది. టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటికి జగన్‌పై ద్వేషం ఉంటే ఉండవచ్చు. కాని ఆయనపై కోపంతో ఈ మీడియా సంస్థల అధినేతలు తమ దుస్తులు తామే ఊడదీసుకుని నగ్నంగా బజారులో నిలబడి నవ్వులపాలవుతున్న సంగతిని విస్మరిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు ప్రస్తావించుకోవాలి. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు వాటి పని అవి చేయకపోతే ఎంత అనర్ధం జరుగుతుందో, ప్రజలలో ఎంత అపనమ్మకం ఏర్పడుతుందో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చాటి చెప్పాయి.ప్రభుత్వ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ, ఒక వర్గం మీడియా వ్యవస్థ అన్ని కుమ్మక్కై ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. ఈ పరిస్థితి నుంచి కాపాడుతుందని భావించిన న్యాయ వ్యవస్థ కూడా అలా చేయలేకపోయిందన్న బాధ చాలా మందిలో ఉంది.
ప్రభుత్వం నిజాయితీగా ఎన్నికలు జరిపించి ఉంటే ప్రజలలో తమ ప్రభుత్వం పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకునే అవకాశం వచ్చేది.అయినా బుల్ డోజ్ చేసి తమ ఎల్లో మీడియా మద్దతుతో ఏమి చేసినా జనం నమ్ముతారులే అనుకుంటే అది భ్రమే అవుతుంది. గతంలో నంద్యాల ఉప ఎన్నికలో సైతం ఇలాగే చంద్రబాబు అరాచాకాలు చేయించి గెలిచారు. కాని సాధారణ ఎన్నికలలో టీడీపీ అంతకు రెట్టింపు ఓట్ల తేడాతో ఓడిపోయింది. చంద్రబాబు పాత్రతో పాటు ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ ప్రమేయం ఈ ఎన్నికలలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రజాస్వామ్యం గెలిచిందని ఆయన సంబరపడిపోతే అది ఆయన అమాయకత్వమే అవుతుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనికి వంతపాడి ఆయన ఎంత దీన పరిస్థితిలో ఉంది తెలియచేసినట్లయింది. ఎన్నికల కమిషన్ ప్రభుత్వం కోరిన వెంటనే కేవలం ఈ రెండిటికే ఎన్నికలు పెట్టడం, అక్కడ ఎన్ని అక్రమాలు జరుగుతున్నా కళ్లుమూసుకుని కూర్చోవడం, కనీసం అధికార యంత్రాంగాన్ని మందలిచే ధైర్యం చేయకపోవడం వల్ల, ప్రభుత్వంలోని వారెవరైనా ఎన్నికల కమిషనర్‌ను బెదిరించారా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. పోలీస్, ఇతర ఎన్నికల యంత్రాంగం అసలు ఓటర్లకు కాకుండా నకిలీ ఓటర్లకు ఓట్లు వేసే అవకాశం కల్పించడం ద్వారా తమ హోదాకు తామే అవమానం చేసుకున్నారు.
వైఎస్సార్‌సీపీ వారిని రకరకాలుగా కట్టడి చేయడం, టీడీపీ వారిని ఇష్టారాజ్యంగా తిరిగేలా స్వేచ్చనివ్వడం ద్వారా, పోలీస్ యంత్రాంగం ఏపీలో ఎంత దారుణంగా పనిచేస్తున్నది లోకానికి చాటి చెప్పినట్లయింది. గౌరవ హైకోర్టు ఈ అక్రమాలు కొన్నిటిని గుర్తించినట్లు వ్యాఖ్యలు చేసినట్లు అనిపించినా, అంతిమంగా సాంకేతిక కారణాలతో జోక్యం చేసుకోలేమని చెప్పడం బాధాకరమే అనిపిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి హైకోర్టు మరింత చొరవ తీసుకుని ఉంటే దేశానికే ఒక సందేశం ఇచ్చినట్లయ్యేదేమో! ఏమైతేనేమి అన్ని వ్యవస్థలు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఓటమికి కారణం అయ్యాయనుకోవాలి.ఇది దేశానికి మంచిదా?కాదా?అన్నది ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత