రాష్ట్రంలో రౌడీ రాజ్యంపై వైఎస్ జగన్ ఫైర్ | Ys Jagan Demanded Election Commission Conduct Repolling In Vontimitta And Pulivendula | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రౌడీ రాజ్యంపై వైఎస్ జగన్ ఫైర్

Aug 12 2025 8:31 PM | Updated on Aug 13 2025 6:55 AM

Ys Jagan Demanded Election Commission Conduct Repolling In Vontimitta And Pulivendula

సాక్షి,తాడేపల్లి:రాష్ట్రంలో రౌడీ రాజ్యంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.   పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలలో జరిగిన అరాచకాలపై మంగళవారం ఎక్స్‌ వేదికగా ధ్వజమెత్తారు.

‘పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న ZPTC సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట ZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగంచేస్తూ, అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని,పోలీసులను వాడుకుని, ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్‌ చేశారు.ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఈరోజు నిజంగా ఒక బ్లాక్‌ డే.పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలి’ అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.

 



‘చంద్రబాబు సీట్లో ఉండగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది ఒక డొల్ల మాత్రమే అని, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు, ప్రజాస్వామ్య పద్ధతులు అన్నవి ఒట్టిమాటలేనని, వ్యవస్థలనేవి కేవలం అలంకార ప్రాయం మాత్రమేనని మరోమారు రుజువైంది. ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓట్లేసేలా చూడ్డం, ఆ మేరకు ప్రజలకు సహకరిస్తూ, తగిన సదుపాయాలు ఇస్తూ, ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం అన్నది ప్రభుత్వ విధి. కాని, చంద్రబాబుగారు ప్రభుత్వాన్ని వాడుకుని తన ప్రభుత్వ సిబ్బంది, పోలీసుల చేతే ఏకంగా రిగ్గింగ్‌ చేయించారు. మరి దీన్ని ఎన్నిక అని ఎలా అనగలుగుతాం? చంద్రబాబుగారు.. ఓట్లను రిగ్గింగ్‌ చేయగలరేమో కాని, ప్రజల హృదయాలను కాదు.

..ఎన్నికలు ఏవైనా ఏ గ్రామంలో ఓటర్లకు అదే గ్రామంలో పోలింగ్‌ నిర్వహించడం గతం వరకూ నుంచో పాటిస్తున్న విధానం. కాని చంద్రబాబుగారి ఆదేశాల మేరకు పులివెందుల ZPTC పరిధిలోని పలు గ్రామాల పోలింగ్‌ బూత్‌లను అటు ఇటు మారుస్తూ, 2 కి.మీ, 4 కి.మీ.ల దూరానికి మార్చినప్పడే క్షుద్ర రాజకీయానికి నాందిపడింది. మరోవంక నిన్న రాత్రి నుంచే ఎన్నికలు జరుగుతున్న ప్రతి గ్రామంలోకి, సుమారు 200 మంది చొప్పున బయట ప్రాంతాలకు చెందిన టీడీపీ వాళ్లు యథేచ్ఛగా చొరబడి, తెల్లవారుజామునుంచే ఓటర్లను బయటకు రానివ్వకుండా దిగ్బంధించి, బూత్‌లను ఆక్రమించుకున్నారు. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బయట ప్రాంతాలకు చెందిన తమ టీడీపీ నాయకులతో, కార్యకర్తలతో ఓట్లేయించారు. 

వైఎస్సార్‌సీపీకి చెందిన ఏజెంట్లు బూత్‌ల్లో కనీసం కూర్చోనీయలేదు, ఓటర్లను బూత్‌లవైపునకు రానీయకుండా ఎక్కడికక్కడ భయపెట్టారు, తరిమి కొట్టి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. మహిళా ఏజెంట్లపైన కూడా దాడులు చేశారు. స్వేచ్ఛగా ప్రజలు ఓట్లేయడానికి కాపలాకాయాల్సిన డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఇతర పోలీసులు, చంద్రబాబుగారి తప్పుడు ఆదేశాలకు తలొగ్గుతూ, టీడీపీ వాళ్లు చేసే దాడులు, దౌర్జన్యాలకు దగ్గరుండి కాపలా కాశారు. ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేలా చూడాల్సిన డీఐజీ కోయ ప్రవీణ్‌, టీడీపీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావుగారి సమీప బంధువు, పచ్చచొక్కా వేసుకుని దగ్గరుండి ఎన్నికల అక్రమాలను ప్రోత్సహించారు. మరి దీన్ని ఎన్నిక అని ఎవరైనా అనగలుగుతారా? మరి ఎందుకు ఈ ఎన్నికలు జరపడం?’అని ప్ర శ్నించారు.

‘అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు? ఆయన ఏం మంచి చేశాడని ఓట్లేస్తారు. 15నెలల ఆయన పాలనలో వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, లా అండ్‌ ఆర్డర్‌, పారదర్శకత, పారిశ్రామిక రంగాలు సహా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. రాష్ట్రం మొత్తం తిరోగమనంలో ఉంది. ప్రతి కుటుంబం తన కాళ్లమీద తాను నిలబడేలా వారికి భరోసా ఉండేలా మా ప్రభుత్వం నాటి పథకాలన్నింటినీ, ఆ స్కీములు అన్నిటినీ రద్దుచేయడమే కాదు, తాను ఇస్తానంటూ ఎన్నికల్లో చెప్పిన సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌లనూ మోసాలతో, అబద్ధాలతో ఎగరగొట్టేశాడు. ఇప్పుడు ఏగ్రామానికి వెళ్లినా, ఏ ఇంటికి వెళ్లినా చంద్రబాబునాయుడును, ఆ పార్టీకి చెందిన వారికి, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు రివర్స్‌లో ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సుమారు రూ.19వేల కోట్ల మేర కరెంటు ఛార్జీలతో బాదుడే బాదుడు. మరోవైపు మట్టి, ఇసుక, సిలికా, క్వార్ట్జ్‌, లెటరైట్‌, లిక్కర్‌, చివరకు కరెంటు కొనుగోలు ఒప్పందాలు, లంచాల కోసం శెనక్కాయలకు, బెల్లాలకు భూములు అప్పనంగా ఇవ్వడం మొదలు, మొబలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట పనులు జరక్కుండానే, రేట్లు పెంచి ఇవ్వడం మొదలు, రాజధాని నిర్మాణాల పేరిట విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఏ రైతుకూ, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు, విద్యాదీవెన, వసతి దీవెన లేదు, ఆస్పత్రులకు వెళ్తే ఏ పేదవాళ్లకూ ఆరోగ్యశ్రీ లేదు. స్కూళ్లలో నాడు-నేడు లేదు, ట్యాబుల్లేవు, టోఫెల్‌ పీరియడ్స్‌తో పాటు ఇంగ్లిషు మీడియం లేదు. మరి ఇలాంటి అబద్ధాలు, మోసాలు, అవినీతి పాలన చేస్తున్న చంద్రబాబుగారికి ప్రజలు ఓట్లెందుకు వేస్తారు?’ 

..పోనీ తనకే ప్రజలు ఓట్లేస్తారని అనుకున్నప్పుడు చంద్రబాబుగారు, ఇన్ని దౌర్జన్యాలు, అరాచకాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తనకే ఓట్లేస్తారని అనుకున్న‌ప్పుడు, ఆ ధైర్యం, నమ్మకం ఉన్నప్పుడు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా ఓటర్లను స్వేచ్ఛగా వదిలేసేవారు కదా? ఓటర్లు ఉన్న దగ్గరే పోలింగ్‌ బూత్‌లు పెట్టేవాడు కదా? ఆ నమ్మకం లేదు కాబట్టే చంద్రబాబుగారు ఈ అరాచకాలన్నీ చేశారు. రెండు చిన్న ZPTC స్థానాలను లాక్కోవడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు బలగాలను వాడుకుని, ఇన్ని అరాచకాలు చేసి గెలవాలని చూస్తే దాంతో సాధించేది ఏముంటుంది?

..2017 నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా చంద్రబాబుగారు ఇదే తరహా కుట్రతో అరాచకాలు చేశారు. ప్రతి వీధికో ఎమ్మెల్యేను పెట్టారు, ప్రతి వార్డుకో మంత్రిని పెట్టి, విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. ఆ రోజు ఆ ఉప ఎన్నికల్లో 27వేల ఓట్లతో గెలిచామంటూ సంబరాలు చేసుకున్నారు, మా పార్టీ పనైపోయిందని, జగన్‌ పని అయిపోందని టీడీపీకి చెందిన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడించారు. ఏడాదిన్నర తర్వాత జరిగిన అదే నంద్యాల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 34,560 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చంద్రబాబుగారి పార్టీ పూర్తిగా క్లీన్‌బౌల్డ్ అయ్యింది. అవ్వాళ్టి ఎన్నికతో పోలిస్తే ఇవాళ పులివెందుల ఈ రెండు ZPTC ఉప ఎన్నికల్లో అంతకుమించి అరాచకాలు చేశారు. 2019 తరహాలోనే భవిష్యత్తులోకూడా అదే స్థాయిలో పులివెందుల సహా రాష్ట్ర ప్రజలు కచ్చితంగా స్పందించి, చంద్రబాబుకు బుద్ధిచెప్తారు.

..పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల్లో ఇవాళ ఇన్ని అక్రమాలు జరిగినా, అడ్డుకోవాల్సిన వ్యవస్థలన్నీ మౌనం దాల్చడం విచారకరం. అయినా రాజ్యాంగ వ్యవస్థల మీద మాకున్న విశ్వాసంతో, ఎన్నికల అక్రమాలపై సాక్ష్యాలు, ఆధారాలతో న్యాయస్థానాల‌ దృష్టికి తీసుకెళ్తాం. నిజంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారంతా ఈ అన్యాయాన్ని నిలదీస్తూ, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో, వారి భద్రత నడుమ తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరుతాం’ అని  చంద్రబాబు రౌడీ రాజ్యంపై  ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement