
సాక్షి, విశాఖపట్నం: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఎన్నిక జరిగిన 12వ తేదీ ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్ డే గా మిగిలిపోతుందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అక్కడ జరిగింది పోలింగ్ కాదు, రిగ్గింగ్ అన్నారు.
ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించిన చంద్రబాబు చరిత్రలో దోషిగా నిలిచిపోతాడని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇంత అభద్రతాభావంతో ఉన్నాడని, అందుకే ఇలా దిగజారిపోతాడని అనుకోలేదని అన్నారు. వ్యవస్థలను భ్రష్టుపట్టించేలా ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికే అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..
ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన ఎన్నికలకు అర్థాన్నే చంద్రబాబు మార్చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసులతో ప్రభుత్వం కుమ్మక్కై దొంగ ఓట్లతో గెలిచింది. ఎందుకు ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇంత అభద్రతతో వ్యవహరించింది.? మాది మంచి పాలన అని చెప్పుకునే ప్రభుత్వం ఎందుకు ప్రజాతీర్పును కోరకుండా, వ్యవస్థలను భ్రష్టు పట్టించి, అడ్డదోవలో గెలుపొందేందుకు తెగించింది..? ఎన్నికలు అంటేనే నిస్పక్షపాతంగా ఉండాలి. స్థానిక ఎంపీని పోలీసులు ఉదయం నుంచే అదుపులోకి తీసుకుని ఆంక్షలు విధించారు.
కానీ కూటమి ప్రభుత్వంలోని మంత్రి, ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా తమతో వందల కార్యక్తలను వెంట పెట్టుకుని సెగ్మెంట్‌లో తిరుగుతుంటే, వారికి పోలీసులు భద్రత కల్పించారు. ఓటు హక్కు కోసం పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిన ఓటర్ల నుంచి స్లిప్‌లను లాక్కుని, పక్క నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు. టీడీపీలో మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్ వంటి పదవుల్లో ఉన్న నాయకులే దొంగ ఓటర్ల అవతారం ఎత్తితే, ఆ పక్కనే కలెక్టర్, డీఐజీ, డీఏస్పీ, సీఐ వంటి అధికారులు ఉండి వారితో ఓట్లు వేయించారు. పైగా ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగాయంటూ వారే ప్రకటించుకుంటున్నారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి బ్లాక్‌డే. రాబోయే రోజుల్లోనూ ఇలాంటి పరిణామాలు జరగాలని కోరుకోకూడదు. మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతాలో పెట్టిన ఫోటోలోనే దొంగ ఓటరు చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. దీనినేమంటారు?
కూటమి ప్రభుత్వానికి తమ పనితీరు మీదే నమ్మకం లేదు. తమ గెలుపు మీద అంతకంటే నమ్మకం లేదు. అందుకే దౌర్జన్యాన్ని, పోలీసులను నమ్ముకున్నారు. ఇటువంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. ఒక చిన్న మండల స్థాయి ఎన్నికలకు ఇంతగా దిగజారిపోవాలా? దీనివల్ల ప్రభుత్వంకు ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా? వ్యవస్థలనే నష్టపరిచేలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తీరు అత్యంత ప్రమాదకరం. ఈ పరిణామాలనే మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ప్రశ్నించారు.
ఇంత వయస్సు వచ్చిన సీఎం చంద్రబాబుకు బహుశా ఇవే చివరి ఎన్నికలు కూడా కావచ్చు, జనం మంచిగా చెప్పునే పనులు చేయాలే కానీ ఇలాంటి మచ్చ తెచ్చుకునేలా చేస్తారా అని ప్రశ్నిస్తే తెలుగుదేశం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వైయస్ జగన్ గారు మాట్లాడిన దానిలో తప్పేముందీ? చంద్రబాబు చేసిన ఇటువంటి అప్రజాస్వామిక విధానాల వల్ల ఆయన చరిత్రలో మచ్చపడిన నేతగా నిలిచిపోతాడు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు కనీసం పోటీ చేసిన అభ్యర్థికి కూడా అవకాశం ఇవ్వరా? పక్క నియోజకవర్గంకు చెందిన టీడీపీ నాయకులను తీసుకువచ్చి, క్యూలైన్లలో నిలబెట్టి వారితో ఓట్లు వేయించారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. వీరంతా దొంగ ఓటర్లు అని మేం చెబితే వారిపై చర్యలు ఏవీ? పులివెందుల్లో జరిగింది రిగ్గింగ్.
డీఐజీ కోయ ప్రవీణ్ తీరు దారుణం:
కోయ ప్రవీణ్ డీఐజీ స్థాయి అధికారిగా వ్యవహరించిన తీరు దారుణం. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన ఒక అధికారి ఏకపక్షంగా వ్యవహరించే తీరు ఇదేనా? కడప పార్లమెంట్ సభ్యుడిని ఉదయం నుంచి నిర్భందంలోకి తీసుకుంటారు. కూటమి ప్రభుత్వంలోని మంత్రిని మాత్రం పోలీస్ బందోబస్త్ మద్య సెగ్మెంట్‌లో విచ్చలవిడిగా తిరిగేందుకు అనుమతిస్తారు. ఇటువంటి వారి వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది. సీఎం చంద్రబాబుకు ఇంత అభద్రతాభావం ఉందని అనుకోలేదు.
మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు స్పందిస్తూ..
పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడిన ఎంపీ రాహూల్ గాంధీ దేశంలో జరిగిన ఓట్ల అక్రమాలపై మాట్లాడారు. దీనిలో ఏపీలోనూ ఇదే తరహాలో అక్రమాలు జరిగాయి. దానిపై కూడా ఆయన ఎందుకు ప్రస్తావించలేదని వైయస్ జగన్ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందనే దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏపీలో జరిగిన అక్రమాలపై మాట్లాడకపోవడం వెనుక ఉద్దేశాలను వైయస్ జగన్ ప్రశ్నించారు.