పులివెందులలో టీడీపీ అరాచకాలు.. డీజీపీ ఆఫీస్‌లో వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు | YSRCP Complaint In DGP Office Over Attacks By TDP Leaders Ahead Of Pulivendula ZPTC By Election | Sakshi
Sakshi News home page

పులివెందులలో టీడీపీ అరాచకాలు.. డీజీపీ ఆఫీస్‌లో వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Aug 10 2025 1:19 PM | Updated on Aug 10 2025 4:31 PM

Ysrcp Complaint In Dgp Office Over Attacks By Tdp Leaders

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీకి తొత్తులుగా మారి పోలీసులే చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై తక్షణం స్పందించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం ఆదివారం.. డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించింది. గత నాలుగు రోజులుగా డీజీపీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నా, అందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో వైఎస్సార్‌సీపీ నేతలు నేరుగా డీజీపీ కార్యాలయానికి వెళ్ళారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందచేశారు.

దేశంలో ఎక్కడా చూడని విధంగా రాష్ట్రంలో పోలీసులు ఇంతగా అధికారపార్టీకి లొంగిపోయి, చట్టాలనే అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న తీరుపై డీజీపీ ఇప్పటికైనా స్పందించి, ప్రజాస్వామ్య రక్షణకు, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా పార్టీ నేతలు వినతిపత్రంలో కోరారు. అనంతరం డీజీపీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.

ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చేలా పోలీసుల తీరు: ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చేలా ఉంది. అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వారు  వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే సందేహం కలుగుతోంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఒకవైపు, కూటమి పార్టీలు మరోవైపు పోటీ చేస్తున్నాయి. కానీ పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్న తీరు చూస్తుంటే, పోటీ కూటమి పార్టీలతో కాదు, పోలీసులతోనే అని అర్థమవుతోంది.

పోలీసులే ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటారు. దాడులకు గురైన మా పార్టీ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయిస్తారు. బైండోవర్ పేరుతో ప్రతిరోజూ స్టేషన్‌లో గంటల తరబడి నిర్బంధిస్తారు. దాడులకు పాల్పడుతున్న టీడీపీ శ్రేణులకు పోలీసులే రక్షణ కల్పిస్తుంటారు. ఇదీ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో కనిపిస్తున్న పరిస్థితి. అంటే ఈ ఎన్నికల్లో కూటమి పార్టీ గెలిస్తే, అది పోలీసులు గెలిచినట్లుగా భావించాలి. దేశంలో ఎక్కడా ఇటువంటి పరిస్థితి గురించి వినలేదు.

డీజీపీ ఉన్నది చట్టాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి.. పోలీస్ విభాగం అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం కార్యకర్తల్లా పనిచేస్తుంటే ఆయన ఎందుకు స్పందించడం లేదు? ప్రతిపక్షంగా జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నిస్తుంటే కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.

చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న మాకు కూడా డీజీపీ నుంచి సమయం ఇవ్వకుండా చేస్తున్నది ఎవరు? ఎవరి ఒత్తిడితో డీజీపీ ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రతినిధి బృందం నుంచి కనీసం స్వేచ్ఛగా వినతిపత్రంను కూడా తీసుకోలేని నిస్పహాయ స్థితిలో ఉన్నారు? మరోవైపు ఉప ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలను కిలోమీటర్ల దూరంలోని వేరే గ్రామాలకు మార్చేశారు. ఓటర్లు ఏ ధైర్యంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు? పోలీసులతో ఏకపక్షంగా ఓట్లు వేయించుకునే కుట్ర జరుగుతోంది. రాజ్యాంగం ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కును టీడీపీ గూండాలు కాలరాస్తుంటే, పోలీసులు వారికి అండగా నిలబడటం దారుణం. ఇప్పటికైనా డీజీపీ కళ్లు తెరవాలి.

రాష్ట్రంలో శాంతిభద్రతలు నిర్వీర్యం: ఎమ్మెల్సీ రమేష్ యాదవ్
పోలీస్ టోపీపై కనిపించే మూడు సింహాలు నీతీ, నిజాయితీ, ధైర్యం కు మారుపేరు అని ఇప్పటి వరకు ప్రజలు భావిస్తూ వచ్చారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీతో పోలీసులు కుమ్మక్కై అరాచక శక్తులకు అండగా నిలుస్తున్న వైనంను చూసిన తరువాత వారి టోపీపై కనిపిస్తున్నవి టీడీపీ, జనసేన, బీజేపీలు మాత్రమే. ఖాకీ యూనిఫారం తీసేసి, పచ్చచొక్కాలతో పోలీసులు పనిచేస్తున్నారు. పులివెందుల్లో జరిగే చిన్న ఎన్నికల్లో ఒక పెద్ద యుద్దంగా మార్చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి, పోలీసులు నిర్భందంలోకి తీసుకుంటున్నారు. మరోవైపు నేరుగా టీడీపీ గూండాలు నామినేషన్ వేసిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఒక ఎమ్మెల్సీగా ఉన్న నాపైనే నేరుగా దాడిచేసి, హతమార్చేందుకు ప్రయత్నించారంటేనే ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి.

చట్టసభల్లో సభ్యుడిగా ఉన్న నాకే రక్షణ లేని పరిస్థితి ఉంటే, ఒక ప్రతిపక్షంలోని కార్యకర్తల పరిస్థితి ఏమిటి? తెలుగుదేశం పార్టీకి బీసీలంటేనే చాలా చులకనభావం. ప్రతిపక్షంకు చెందిన మాజీ మంత్రి విడతల రజిని, కృష్ణాజిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ హారిక, ఇప్పుడు నాపైన జరిగిన దాడులే దీనికి నిదర్శనం. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే దానికి కూడా సరైన విధంగా స్పందించకపోవడం దారుణం. చట్టాన్ని కాపాడే స్థానంలో ఉన్న వారే చట్టాన్ని నీరుగార్చేలా వ్యవహరిస్తుంటే, ఇక ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనే మాటకే విలువ ఉండదు.  

రాజ్యాంగ స్పూర్తిని నీరుగారుస్తున్నారు: మేరుగు నాగార్జున
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా నామినేషన్ల పర్వం ప్రారంభమైన నాటి నంచి టీడీపీకి చెందిన వారు దాడులు, దౌర్జన్యాలతో మొత్తం ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం పాలు చేసేలా ప్రవర్తించడం మొదలుపెట్టారు. పులివెందుల్లో డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉప ఎన్నికలో స్థానికంగా ఉన్న వైఎస్సార్‌సీపీ చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను, కార్యకర్తలను కూడా భయబ్రాంతులకు గురి చేసేందుకు తెగబడ్డడారు.

ఈ నెల అయిదో తేదీన ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తున్న మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌తో పాటు పలువురు నాయకులుపై కర్రలు, ఇనుపరాడ్లు, రాళ్ళతో పది వాహనాల్లో వచ్చిన టీడీపీ అరాచక శక్తులు దాడికి పాల్పడ్డాయి. ఏకంగా వారి వాహనాలపై పదిలీటర్ల పెట్రోల్ కుమ్మరించి వారిని సజీవంగానే దహనం చేసే దారుణానికి సిద్ధపడ్డారు. ఈ దాడిలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాములు గాయాలతో బయటపడ్డారు. ఈ దాడిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీ వద్దకు వెళితే ఆయన కూడా పట్టించుకోలేదు. దీనిపై చట్టప్రకారం పోలీసులు వ్యవహరించేలా చూడాలని కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

ఆయన దీనిపై స్పందిస్తూ పత్తేపారం కోసం ఆ గ్రామానికి వెళ్ళారా... మేం ఉండబట్టే తలలు పగిలాయి, లేకపోతే తలలు తెగిపోయేవే' అంటూ చాలా హేళనగా మాట్లాడారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే టీడీపీ పచ్చచొక్కాలు వేసుకున్న వారిలా అధికారపార్టీకి అండగా నిలబడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిని పోలీస్ వ్యవస్థే నీరుగారుస్తోంది. పోలీస్ యంత్రాంగాన్ని చేతుల్లో పెట్టుకుని అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.

ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లోనూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎక్కడా భయపడకుండా ముందుకు సాగుతుంటే, దానిని కూడా సహించలేక ఎవరైతే మాపైన దాడుల చేశారో వారి నుంచి ఫిర్యాదులు తీసుకుని, బాధితులైన మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో కేసులు నమోదు చేయడం ఈ ప్రభుత్వ అరాచకానికి, పోలీస్ వ్యవస్థ దిగజారుడుతనానికి పరాకాష్టగా కనిపిస్తోంది. ఇంత అకృత్యాలు, ఇంత అమానుషంగా చంద్రబాబు పాలన సాగుతోంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

పులివెందులలో టీడీపీ దౌర్జన్యం: మల్లాది విష్ణు
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పులివెందులలో టీడీపీ దౌర్జన్యం చేసి హింసను ప్రోత్సహిస్తోంది. మా నాయకులపై బైండోవర్లు పెట్టించారు. పోలింగ్ స్టేషన్లు నాలుగు కిలోమీటర్ల దూరానికి మార్చేశారు. ఎలాగైనా పులివెందులలో గెలవాలని టీడీపీ చూస్తోంది. పులివెందులలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ దిగజారిపోయి వ్యవహరిస్తోంది. కర్రలు, రాళ్లు, కత్తులు పట్టుకుని రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. పోలీసుల తీరు టీడీపీకి కొమ్ముకాస్తున్నట్లు స్పష్టంమవుతోంది

టీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ నేతలపై రివర్స్‌లో కేసులు పెడుతున్నారు. ఈ మొత్తం తతంగానికి బాస్ డీజీపీనే. బాధితులపైనే తిరిగి కేసులు పడుతున్నారు. పోలీసుల తీరును న్యాయ స్థానాలు తప్పుపడుతున్నా వారు మారడం లేదు. పులివెందులలో మంత్రులకు,ఇతర ఎమ్మెల్యేలకు పనేంటి?. బయటి ప్రాంతాల నుంచి పులివెందులలో తిష్టవేశారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నేతలను తక్షణమే పులివెందుల నుంచి బయటికి పంపించాలి. సత్వరమే డీజీపీ చర్యలు తీసుకోవాలి. డీజీపీ వాట్సాప్ నెంబర్‌కు కూడా మా ఫిర్యాదును పంపిస్తాం. టీడీపీ రౌడీయిజం, గూండాయిజాన్ని అరికట్టాల్సిన బాధ్యత డీజీపీ పైన ఉంది.

చంద్రబాబు పతనానికి ఇది నాంది: మేయర్‌ భాగ్యలక్ష్మి
విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. మేమేమీ సంఘ విద్రోహ శక్తులం కాదు. మేం ప్రజాప్రతినిధులం. డీజీపీ కార్యాలయంలోకి మమ్మల్ని పంపించడానికి సమాలోచనలు చేయడమేంటి?. మేం చెప్పులరిగేలా ఎన్నికల కమిషన్ చుట్టూ తిరుగుతున్నాం. మాట్లాడితే నేను 40 ఏళ్ల సీనియర్‌నంటూ అని చంద్రబాబు చెప్పుకుంటాడు. పులివెందుల ఎన్నికల్లో ఇంతలా దిగజారిపోవాలా?. చంద్రబాబు పతనానికి ఇది నాంది గుర్తుంచుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement