
స్వేచ్ఛగా పోలింగ్ నిర్వహిస్తే వెబ్ కాస్టింగ్ బయటపెట్టండి
పక్క నియోజకవర్గాల టీడీపీ నేతలు ఎలా ఓటేశారు?
పోలింగ్ పరిశీలనపై కలెక్టర్ ట్వీట్‌ను ఎందుకు డిలీట్ చేశారు?
మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం
సాక్షి, అమరావతి: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అపహాస్యం చేశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ‘‘14 నెలల పాలనలో అన్నివిధాలా వంచించిన కూటమి ప్రభుత్వానికి పులివెందుల ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారన్న భయం పట్టింది. అందుకే పోలీసుల అండతో దౌర్జన్యానికి దిగారు. చంద్రబాబు ఎన్ని అక్రమాలు చేసినా ప్రజలకు వాస్తవాలు తెలిశాయి. వారిని తరిమికొట్టడం ఖాయం’’ అని తేల్చిచెప్పారు.
గురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పులివెందుల, రాజంపేట నియోజకవర్గాల్లో ఒక్కో జెడ్పీటీసీ, కుప్పంలో ఎంపీటీసీ, ప్రకాశం జిల్లాలో సర్పంచ్ స్థానాన్ని ఎంచుకుని మరీ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రభుత్వం మహాగొప్పగా ప్రకటించిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కై.. 13 నెలల టర్మ్ మాత్రమే ఉన్న జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తూ, నామినేషన్ల నుంచే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేలా రకరకాల తంతులు నిర్వహించారని మండిపడ్డారు. ఖాకీ చొక్కాలు, అధికారులు తొత్తులుగా మారారని,, ఐఏఎస్‌లుగా రాష్ట్రంలో అత్యున్నత పదవులు వెలగబెట్టి, ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు అధికారులు సైతం తమ బాధ్యతలను విస్మరించారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో దొంగలు పడ్డారంటే ఇదేనేమో
ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుపుతున్నామని చెప్పడానికి, మీడియాకు పోలింగ్ కేంద్రాల వద్దకు అనుమతిస్తారని, కానీ పులివెందుల, ఒంటిమిట్టలో ఎవరినీ వెళ్లనివ్వకుండా, వాళ్లే ప్రయివేటు కెమెరాతో చిత్రీకరించారని పేర్ని అన్నారు. ‘‘ఈ వీడియోల్లో ఎక్కడా మహిళలు ఓటు వేసినట్లు కనిపించలేదు. అందరూ పురుషులే. అది కూడా జమ్మలమడుగు లేదా కమలాపురం, ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు చెందినవారు.
ఈ మూడు నియోజకవర్గాల కూటమి ఎమ్మెల్యేలకు ఓట్లు గుద్దుకోవడానికి కాంట్రాక్ట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. పులివెందులలో విచిత్రం ఏమంటే సాయంత్రం 5–6 గంటల మధ్య ఓటు వేసిన మహిళలంతా వి.కొత్తపల్లెలో పోలింగ్ స్టేషన్ నం.13లో ఓటు హక్కు వినియోగించుకున్నవారే. అక్కడ ఒక పురుష ఓటరు కూడా లేడు. అధికార పార్టీ బరితెగింపునకు ఇదో నిదర్శనం. క్యూ లైన్లో లేకుండానే 3,684 మంది మహిళలు ఓటు వేశారు. బహుశా దేశంలో దొంగలు పడ్డారంటే ఇదేనేమో! తండ్రికొడుకు ఇద్దరు దొంగలు పడ్డారని, ఇంత తంతు చేసి, మీరిచ్చిన లెక్కలతోనే దొరికిపోయారు’ అని అన్నారు.
డ్రామా రక్తి కట్టేలా పోస్టులు..
డ్రామాను మరింత రక్తి కట్టించడానికి 30 ఏళ్ల తర్వాత ఓటు వేస్తున్నాం థ్యాంక్స్ అంటూ టీడీపీ ఎక్స్ ఖాతాలో కొన్ని స్లిప్పుల పోస్టులు పెట్టారని, అంటే.. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో దొంగ ఓట్లు వేస్తున్నామని థ్యాంక్స్ చెబుతున్నారా? క్యూలైన్లో పురుషులు అదీ బయటివాళ్లు ఉంటే.. వారితో సమానంగా మహిళల ఓట్లు ఎలా వచ్చాయని పేర్ని నాని ప్రశి్నంచాచు. అంటే, జమ్మలమడుగు నుంచి వచ్చి దొంగఓట్లు వేసినవారు.. 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామని చెబుతూ పోస్టులు పెట్టారని ఎద్దేవా చేశారు.
లోకేశ్... మీ పోస్ట్‌లోనే తెలుస్తోంది
పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందంటూ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశారని... అందులో ఉన్నది జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పొన్నతోట మల్లికార్జున్ అని పేర్ని నాని పేర్కొన్నారు. ‘‘ఇదీ వీళ్ల బండారం..! కలెక్టర్ పోస్ట్ పెట్టి తీసేస్తారు. మంత్రి దౌర్జన్యాల మీద, దొంగ ఓటర్ల మీద కేసులుండవు. ఓ సోదరి కుప్పంలో మీరు ఇలాగే చేశారని అంటోంది. కానీ, అక్కడ టీడీపీకి ఎంత ఖర్మ పట్టిందీ అంటే వాళ్ల చేతులతో వారే 680 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేశారు’’ అని తెలిపారు.
వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానమేది బాబూ...?
ఉప ఎన్నికల పోలింగ్‌లో ఏ జరిగిందో ఆధారాలతో సహా కళ్లకు కట్టినట్టు చూపిస్తూ సమాధానం ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ చాలెంజ్ చేశారని, కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారని పేర్ని నాని గుర్తుచేశారు. ‘‘పోలింగ్ సరళి సీసీ టీవీ ఫుటేజీని, వెబ్ కాస్టింగ్ ను ప్రజల్లో పెట్టాలని వైఎస్ జగన్ అడిగితే, ఎందుకు భయం? వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చేసిన ట్వీట్‌లో ఆయన ముందున్నవారు దొంగ ఓటర్లు.
అంటే, కలెక్టర్ దగ్గరుండి దొంగ ఓటింగ్ చేయించారా? క్యూలైన్లలోని దాదాపు 90 శాతం దొంగ ఓటర్లే. వీటిపైనే వైఎస్ జగన్ ప్రశ్నించారు’’ అని తెలిపారు. దీంతో చంద్రబాబు స్క్రీన్ ప్లే మార్చారని, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఒకే రౌండ్ లో పూర్తి చేయాలని నిర్ణయించారని పేర్కొన్నారు. ‘‘ఎక్కడ తప్పు పడతారోననే భయంతో, కోర్టులు ప్రారంభమయ్యేలోగా ఉప ఎన్నిక ఫలితాలు తేల్చాలని ఆదరాబాదరాగా ఆదేశాలిచ్చారు.
ప్రజాస్వామ్యయుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉప ఎన్నికలు జరుపుతున్నామని డ్రామా మాటలు చెప్పిన వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్.. ఒక్క మీడియాను కూడా ఓటింగ్ ను చూపించేందుకు బూత్‌లలోకి అనుమతించలేదు. కిరాయికి మాట్లాడుకున్న ప్రైవేటు ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్‌తో ఫొటోలు, వీడియోలు తీయించి విడుదల చేశారు’ అని చెప్పారు.
డీఐజీ.. ఎవరి ఆనందం కోసం ఈ నిర్వాకం
రాయచోటి ఎమ్మెల్యేనో, ఎన్నికలున్న ఒంటిమిట్టలో ఓటరు కాకపోయినా రాష్ట్ర మంత్రి ఎలా పోలింగ్ స్టేషన్ కు వెళ్తారని పేర్ని నాని నిలదీశారు. చిన్నకొత్తపల్లె గ్రామంలో మంత్రి సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్‌ను కొట్టారని, మంత్రి మీద కేసు ఫైల్ చేశారో లేదో డీఐజీ కోయ ప్రవీణ్ సమాధానం చెప్పాలని పేర్ని నిలదీశారు. ‘ఇదంతా ఎన్నికల కమిషన్ కు కనబడ్డం లేదా? కేసు కట్టని అధికారులను సస్పెండ్ చేయరా? షోకాజ్ ఇవ్వరా? మీకు సిగ్గూ, శరం ఉందా ? పోలీస్ ఉన్నతాధికారులు చేస్తున్న పనికి డీజీపీ సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. పోలింగ్ బాగా నిర్వహిస్తున్నామని జబ్బలు చరుచుకున్న జిల్లా కలెక్టర్.. వెంటనే ఎక్స్‌ఖాతాలోని పోస్టును ఎందుకు డిలీట్ చేశారని నిలదీశారు.
సునీతమ్మా.. మీ తండ్రే పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారా?
‘‘అసెంబ్లీఎన్నికల్లో అక్రమాలు జరిగాయి. ఎక్కడాలేని విధంగా పోలైన ఓట్ల కంటే ఏపీలో 12 శాతం ఓట్లు అదనంగా లెక్కించారు. మొదటినుంచి మేం ఇది చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే చెబుతున్నారు. టీడీపీ కూటమికి 164 సీట్లు రావడం మీద దేశమంతా అనుమానంతో ఉంది. అది కూడా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక లాంటిదే అని ప్రజలు అనుకుంటున్నారు’’ అని పేర్ని నాని అన్నారు. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని బతికించారంటున్న నర్రెడ్డి సునీతారెడ్డి.. ఈ నియోజకవర్గంలో ఆమె తండ్రి వైఎస్ వివేకానే చాన్నాళ్లు రాజకీయం చేశారని, అంటే ఆయనే ప్రజాస్వామ్యాన్ని చంపేశారని
చెబుతున్నారా?’’ అని ప్రశి్నంచారు.