
పులివెందులలో బీసీ నేత.. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై టీడీపీ శ్రేణుల దాడికి పాల్పడడంపై వైఎస్సార్‌సీపీ భగ్గుమంది. జెడ్‌పీటీసీ ఉపఎన్నికలను హింసాత్మకంగా మారుస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. పోలీసులకు తెలిసే పథకం ప్రకారం ఈ దాడి జరిగిందని అంటోంది.
సాక్షి, విజయవాడ: పులివెందులలో టీడీపీ గూండాల దాడి ఘటనపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి వైఎస్సార్‌సీపీ బుధవారం ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి గాయపడిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి.. తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. అదే సమయంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించాలని కోరుతూ ఓ వినతి పత్రం అందజేసింది. అనంతరం పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు.

‘‘చంద్రబాబుకి వయసు పెరిగేకొద్దీ బుద్ధి సన్నగిల్లుతోంది. పులివెందులకు టీడీపీ గూండాలను పంపి దాడులు చేయిస్తున్నారు. కత్తులు, రాళ్లతో దాడి చేసి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి చంపాలని చూశారు. అక్కడి పోలీసులకు తెలిసే ఇదంతా జరిగింది. పథకం ప్రకారమే చంపేందుకు ప్రయత్నించారు. ఏదోరకంగా రౌడీయిజం చేసి ఎన్నిక గెలవాలని చూస్తున్నారు. ఇల్లు అలకగానే పండుగ కాదు. రేపు జగన్ వచ్చాక పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి’’ అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఏపీలో పోలీస్ యంత్రాంగం ఉందా?. టీడీపీ గుండాలు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. కావాలనే వందల మందిని బైండోవర్ చేస్తున్నారు అని అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అరాచకం,దౌర్జన్యాలతో గెలవాలని చూస్తున్నారు. పులివెందులలో టీడీపీ గూండాలకు సహకరించిన పోలీసులు, అధికారులను చట్టం ముందు నిలబెడతాం అని అన్నారు.

అంతకు ముందు.. పులివెందుల దాడి ఘటనను ఖండిస్తూ ఎన్నికల కమిషనర్ కార్యాలయం బయట వైఎస్సార్‌సీపీ నేతలు ధర్నా చేపట్టారు. కార్యాలయం ఎదుట బైఠాయించి.. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి , విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
