
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల ప్రక్రియను అపహాస్యంపాలు చేసేలా నిర్వహించిన ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కనీవినీ ఎరగని అరాచకాన్ని చూశామని వైఎస్సార్‌సీపీ ఒంటిమిట్ట జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక చిన్న జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం చంద్రబాబు ఏకంగా ఏడుగురు మంత్రులను మండలంలో మోహరించినప్పుడే మా సత్తా అర్థమైందని అన్నారు.
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి 300 మంది రౌడీలను వెంటేసుకుని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు 17 పోలింగ్ బూత్‌లలో తిరుగుతూ మా ఏజెంట్లపై దాడులు చేసి బయటకు పంపించారని, ఏకంగా బ్యాలెట్ బాక్సులనే మాయం చేసి రిగ్గింగ్‌కి పాల్పడ్డారని సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అరాచకాలను కళ్లారా చూసిన జాయింట్ కలెక్టర్ కానీ, ఫోన్‌లో ఫిర్యాదు చేస్తే జిల్లా ఎస్పీ కానీ స్పందించకపోవడం చూస్తుంటే ఎన్నికలు ఎంత లోపభూయిష్టంగా జరిగాయో అర్థంఅవుతోంది. అందుకే రీపోలింగ్ ని బహిష్కరించామని, కౌంటింగ్‌కి కూడా వైయస్సార్సీపీ హాజరుకాబోవడం లేదు. కానీ ప్రశాంతంగా ఉంటే ఒంటిమిట్టలో కోదండరాముడి సాక్షిగా మంత్రి చేసిన అరాచకాలకు తప్పకుండా గుణపాఠం నేర్పుతాం. ఒంటిమిట్ట నుంచే మంత్రి రాంప్రసాదరెడ్డి పతనం ప్రారంభమైంది.
ముగ్గురు మంత్రులు మండలంలో తిష్ట వేశారు
ఒంటిమిట్టలో నామినేషన్ వేసింది మొదలు ముగ్గురు మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, సవిత, రాంప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో ప్రలోభాలు, బెదిరింపుల పర్వం నడిచింది. మరో నలుగురు మంత్రులు ప్రచారం పేరుతో మండలంలో విపరీతమైన హడావుడి చేశారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచి ఒంటిమిట్ట మండలంలో పార్టీకి గట్టిగా అండగా నిలబడిన దాదాపు 50 మంది వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్ల మీద దాడులు చేశారు. అన్నీ ఎదుర్కొని ఎన్నికల రోజున ఉదయం 5 గంటలకే ఏజెంట్లను నిలబెట్టగలిగాం. కానీ కీలకమైన పార్టీ ఏజెంట్లను గుర్తించి పోలీసులే బయటకు బూత్‌ల నుంచి బయటకు గెంటేశారు.
దీనిపై జిల్లా ఎస్పీకి ఉదయం 9 గంటలకు ఒకసారి, 11 గంటలకు మరోసారి ఫిర్యాదు చేయడం జరిగింది. మండలంలో ఎన్నికలు జరుగుతుంటే రాజంపేట, రాయచోటితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పోలింగ్ బూత్‌ల వద్ద యాక్టివ్‌గా తిరుగుతూ కనిపిస్తున్నారని, గొడవలు జరిగే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశాను. కొంతమంది వ్యక్తులను గుర్తించి అక్కడే ఉన్న పోలీసులకు చెప్పడం కూడా జరిగింది. అయినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడమే కాకుండా ఫిర్యాదు చేసిన మమ్మల్నే అక్కడ్నుంచి బలవంతంగా పంపించి వేశారు. పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే యూనిఫాంకే చెడ్డపేరు తెచ్చారు.
17 బూత్‌లలో మంత్రి రిగ్గింగ్ చేయించాడు
ఉదయం 11 గంటల ప్రాంతంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి 300 మంది రౌడీలతో చిన్నకొత్తపల్లికి వచ్చి హల్ చల్ చేశాడు. 700 మంది ఓటర్లున్న చాలా చిన్న బూత్ అది. మా వారు 5 గురు ఏజెంట్లుగా ఉన్నారు. పోవడం పోవడం మా పార్టీ ఏజెంట్లను బయటకు ఈడ్చి దారుణంగా కొట్టారు. ఆ విషయం తెలిసి నేను ఈ బూత్ వద్దకు వెళితే నన్ను కూడా బెదిరించాడు. ఇదేం పద్దతని నేను ఆయన్ను నిలదీస్తే పోలీసులు నన్ను అక్కడ్నుంచి పంపించేశారు. ఆ తర్వాత మంత్రి రాంప్రసాద్‌రెడ్డి మంటపంపల్లి అనే మరో ప్రాంతానికి వెళ్లి అక్కడా అంతే.
వందల మంది రౌడీలతో వెళ్లి మా ఏజెంట్లను బూత్‌ల నుంచి బయటకు లాక్కొచ్చి కొట్టిపడేశారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తనకు సంబంధం లేని ప్రాంతానికి వచ్చి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, ఆయనకు చిన్నకొత్తపల్లిలో ఓటు కూడా లేదని జాయింట్ కలెక్టర్‌కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే విషయాన్ని నేను మా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డికి చెప్పడం జరిగింది. ఆయనతో కలిసి నేను మంటపంపల్లెకి వెళ్లేసరికి అక్కడ బాక్సుల్నే మాయం చేశారు.
పోలింగ్ బూత్ ఖాళీగా ఉంది. మాతోపాటే వచ్చిన జాయింట్ కలెక్టర్‌కి కూడా జరిగిన విషయాన్ని చెబితే ఆమె కూడా కళ్లారా చూశారు. ఆ తర్వాత ఆమె కూడా అక్కడ్నుంచి మెల్లిగా జారుకున్నారు. మంత్రిని అడ్డుకోవడానికి మేం ప్రయత్నిస్తుంటే పోలీసులు వెళ్లనీయకుండా మా కార్లను అడ్డుకుంటున్నారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం 17 పోలింగ్ బూత్‌లల్లో పోలీసుల అండతో యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నాడు.
కౌంటింగ్‌ను కూడా బహిష్కరిస్తున్నాం
ప్రజాస్వామ్యంలో నిన్నటి రోజు ఒక చీకటి దినం. ప్రశాంతంగా ఉన్న మండలంలో మంత్రి అరాచకం సృష్టించాడు. ఏడాది తర్వాత అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జరిగితే ఆయన ఇదే విధంగా చేయగలడా? భవిష్యత్తులో టీడీపీకి ఏజెంట్లు కూడా ఉండరు. మంత్రి బెదిరింపులకు నేను వెనక్కి తగ్గేదే లేదు. చిన్న మండలంలో సొంతంగా గెలవలేక 780 మంది పోలీసులను తెచ్చుకున్నారు. మంత్రి అండ చూసుకుని నన్ను భూస్థాపితం చేస్తానని అన్నోళ్లు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి.
పులివెందుల, ఒంటిమిట్టలో జరిగింది ఎన్నికే కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదు. రీపోలింగ్‌ను బహిష్కరించాం. కౌంటింగ్‌ను కూడా బహిష్కరిస్తున్నాం. మీ ఇష్టమైన మెజారిటీ రాసుకోండి. రాబోయే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తాం. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అనుసరించిన తీరుని రాష్ట్ర ప్రజలంతా చూశారు. భవిష్యత్తులో మంచి గుణపాఠం చెబుతారు. కోదండరాముని సాక్షిగా చెబుతున్నా ఈ జడ్పీటీసీ ఎన్నిక మంత్రి పతనానికి ఆరంభం.