
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో పరిహాసమైన ప్రజాస్వామ్యం..
బరితెగించిన పచ్చ మూక.. పులివెందులలో దొంగ ఓట్ల జాతర
సాక్షి టాస్క్‌ఫోర్స్: ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు.. కంచే చేను మేసిందన్న నానుడిని పోలీసు శాఖ రుజువు చేసిన రోజు.. అధికార పార్టీకి తొత్తుగా మారి.. కాదు కాదు ఆంక్షల సంకెళ్లలో బందీగా మారి పూర్తి బానిసగా మారిన రోజు.. అవును.. కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. పులివెందులలో అడుగడుగునా రౌడీ రాజ్యం కనిపిస్తే.. ఒంటిమిట్టలో పచ్చ మూక బరితెగించింది.
ఇంకా తెలవారకముందే.. సూరీడు కిరణాలైనా పడకముందే పులివెందుల పల్లెల్లో డబ్ డబ్ మంటూ ఖాకీల అడుగు చప్పుళ్లు వినిపించాయి. బందోబస్తుకు కాదు.. బందిపోట్లకు అండగా నిలవాలన్న తాపత్రయంతో వేసిన అడుగులవి. దొంగ ఓట్లను అరికట్టడానికి కాదు.. నిజమైన ఓటర్లను అడ్డుకోవడానికి వేసిన అడుగులవి. పచ్చని పల్లెల్ని పచ్చ స్వామ్యంగా మార్చాలనే కుట్రలో భాగంగా వేసిన అడుగులవి. ఇందులో భాగంగానే స్థానిక వాసి.. ప్రజా ప్రతినిధి.. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికొచ్చారు. ఎన్నికల వేళ నేతల్ని ‘ఇంటి నిర్బంధం’ చేయడం సహజమే. కానీ ఇంట్లోనే ఉంటానన్న ఎంపీ వినతిని పట్టించుకోలేదు.. ఒంట్లో నలతగా ఉందన్నా కనికరించలేదు.. బలవంతపు అరెస్టు చేసి సగం జిల్లా తిప్పారు. పోనీ అధికార పార్టీ నేతల్ని చేశారా అంటే అబ్బే అస్సలు పట్టించుకోలేదు. పైగా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది ఓట్ల దొంగల్ని దగ్గరుండి స్వాగతం పలికారు. కమలాపురం మండలం పెద్ద చెప్పలి ఎక్కడుంది.. పులివెందుల మండలంలోని ఎర్రిపల్లె ఎక్కడుంది... అక్కడి నుంచి వచ్చి ఏంచక్కా ఓట్లు వేస్తుంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారు. అంతేనా వేంపల్లె నుంచి.. జమ్మలమడుగు నుంచి.. ఎర్రగుంట్ల నుంచి.. ఇలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రౌడీల్ని.. పచ్చ మూకల్ని తరలించి మరీ ఓట్లేయించారు. సాక్షాత్తు డీఐజీ, ఎస్పీ, డీఎస్పీ.. ఇలా పోలీసు బాసులందరూ తిష్ట వేసింది దీనికోసమే. ఈ అరాచకాలకు..అక్రమాలకు.. పోలీసు ఉన్నతాధికారులందరూ సాక్ష్యమే.
ఇక సాక్షాత్తు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటిని ఉదయాన్నే చుట్టుముట్టిన పోలీసులు కొన్ని గంటల వరకు బయటికి రాకుండా అడ్డుకున్నారు. పోలింగు బూతుల్లో దొంగ ఓట్ల జాతర ముగిశాక తీరిగ్గా ఓటు వేయడానికి రమ్మని అడిగారు. అప్పటికే నిండా ఆక్రోశంతో ఉన్న మహిళలు పోలీసుల తీరును తూర్పారబట్టారు. ఏజెంట్లు లేకుండా ఇంత సేపు దొంగ ఓట్లు వేసుకుని ఇప్పుడొచ్చి రమ్మంటారా అంటూ ఖాకీల్ని నిలదీశారు. జవాబు చెప్పలేక.. అక్కడి జనాల్లో ఉండలేక కాళ్లకు పని చెప్పడం పోలీసుల వంతైంది.
ఎర్రిపల్లెలో సుమారు 350 మంది పచ్చ మూక బరితెగిస్తుంటే ఖాకీ సైన్యం చోద్యం చూస్తూ నిలబడింది. ఆడోళ్లని కూడా చూడకుండా పచ్చ మూకలు దౌర్జన్యం చేస్తుంటే అడ్డు చెప్పే ధైర్యం కూడా వారిలో లేకుండా పోయింది. పోలీసుల ఒంటిపై ఖాకీ యూనిఫాం కనిపిస్తున్నా .. లోన వేసుకున్న ‘పచ్చ చొక్కాల లెక్క’ డామినేట్ చేసింది. పబ్లిగ్గా అది సాక్షాత్కరమైంది కూడా.
పోలింగ్ కేంద్రాల వద్ద కూటమి నాయకుల అనుచరుల హల్‌చల్
నల్లపురెడ్డిపల్లెలో పోలింగ్ కేంద్రం వద్ద జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు హల్‌చల్ చేశారు. ఉదయం నుంచే బూత్‌లను అధికార పార్టీ నేతలు ఆక్రమించుకుని వైఎస్సార్‌సీపీకి చెందిన ఏజెంట్లను కూర్చోనివ్వలేదు. టీడీపీ గూండాలు ఏజెంట్ల ఫారాలను లాక్కొన్నారు. మోట్నూతలపల్లిలో దారిని టీడీపీ అల్లరి మూకలు అడ్డగించి పోలింగ్ బూత్ కి 2 కిలో మీటర్లు ముందే వాహనాలు అపి కొట్టి వారు ఊరి బయటే వాహనాలను వెనక్కి పంపారు.
కనంపల్లెలో టిడిపి అల్లరి మూకల మహిళా ఓటర్లపై దాడులు చేశారు. కనంపల్లెలో ఓటు వేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనంపల్లె సర్పంచ్ రామాంజనేయులు ఇంటి వద్ద మంచంపై పోలీసులు గన్ను పెట్టి బెదిరించారు. తుమ్మలపల్లె, కనంపల్లె పోలింగ్ బూత్‌లకు వెళ్లనీయకుండా టీడీపీ మూకలు ఓటు వేయడానికి వెళుతున్న మహిళా ఓటర్లపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎర్రిపల్లె పోలింగ్ బూత్‌లోకి ఏజెంట్లను బీటెక్ రవి తమ్ముడు భరత్ రానీయకుండా అడ్డుకుంటున్నా పోలీసులు చోద్యం చేస్తున్నారని మహిళా ఏజెంట్ వాపోయింది.