
14 న కౌంటింగ్ నిలిపివేయండి
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకం చేసింది
బయటి నుంచి వచ్చిన టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారు
వాస్తవ ఓటర్లు ఓటు వేయకుండా నిరోధించారు
పోలింగ్ ఏజెంట్లు ఫారాలు సమర్పించకుండా అడ్డుకున్నారు
అన్ని పోలింగ్ కేంద్రాల్లో అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడింది
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి లేఖ
సాక్షి, అమరావతి: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌లో టీడీపీ అరాచకాల కారణంగా వాస్తవ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని, అందువల్ల రీ–పోలింగ్ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు మంగళవారం లేఖ రాశారు. పోలింగ్ సందర్భంగా టీడీపీ చేసిన అరాచకాలను ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. 14వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని కోరారు. టీడీపీ గూండాల అరాచకంతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని వివరించారు.
అధికార పార్టీ ఇష్టారాజ్యంగా రిగ్గింగ్‌కు పాల్పడిందన్నారు. పోలింగ్‌కు ముందే టీడీపీ బయటి ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో గూండాలను పోలింగ్ కేంద్రాలు ఉన్న గ్రామాల్లో మోహరించిందని వివరించారు. దీని మీద పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లు ఫారాలను సమర్పించడానికి పోలింగ్ కేంద్రాలకు రాకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారని వెల్లడించారు. ఓటర్లను సైతం ఓటు హక్కు వినియోగించుకోకుండా నిరోధించారన్నారు.
పోలీసు యంత్రాంగం పోలింగ్ ఏజెంట్లు, ఓటర్లకు రక్షణ కల్పించడానికి బదులుగా, అధికార పార్టీ నాయకుల అరాచకాలకు అండగా నిలిచిందని చెప్పారు. పులివెందుల జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి బయటకు రాకుండా టీడీపీ గూండాలు ఇంటిని చుట్టుముట్టారని తెలిపారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందని తెలిపారు.