
పోలింగ్ బూత్‌లలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి హల్‌చల్
వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపి యథేచ్ఛగా రిగ్గింగ్
రాయచోటి, రాజంపేట నుంచి వందల మంది అక్రమంగా రాక
ఓటర్ల స్లిప్పులు తీసుకుని దొంగ ఓట్లు వేసిన టీడీపీ కార్యకర్తలు
పోలింగ్ బూత్‌ల వద్ద యథేచ్ఛగా తిరిగిన టీడీపీ రౌడీమూకలు
మంత్రి సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై పిడిగుద్దులు, దాడులు
బూత్‌లోకి వెళ్లిన మంత్రి... గట్టిగా ప్రతిఘటించిన వైఎస్సార్‌సీపీ
కళ్ల ఎదుటే రిగ్గింగ్ జరుగుతున్నా నిలువరించని పోలీసులు
ఎలాగైనా గెలవాలన్న కుతంత్రం... అడ్డదారులను ఎంచుకుని రాద్ధాంతం... అధికారాన్ని ఆయుధంగా చేసుకుని స్వైరవిహారం... యథేచ్ఛగా అక్రమం... ఇదీ కూటమి ప్రభుత్వం ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చేసిన అరాచకీయం..! ఇందుకోసం సాక్షాత్తు రాష్ట్ర మంత్రి హోదాలోని వ్యక్తే బరితెగించారు. ఈ తతంగమంతా కళ్లెదుటే జరుగుతున్నా ఏమీ చూడనట్లు అధికారులు, పోలీసు యంత్రాంగం మౌనంంగా ఉంది.
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అనుచరగణంతో హల్‌చల్ చేశారు. దౌర్జన్యకాండకు తెరలేపారు. మంత్రిని చూడగానే టీడీపీ శ్రేణులు, వారివెంట వచ్చిన రౌడీ మూకలు రెచ్చిపోయాయి. బూత్‌లలోకి ప్రవేశించి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడులకు దిగాయి. బూత్‌ల నుంచి బయటకు ఈడ్చి వేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఇదంతా మంత్రి సమక్షంలోనే జరిగింది.
ఆయన బూత్‌లలోకి వెళ్తుండడాన్ని పసిగట్టిన వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. కానీ, అధికార బలం దానికి పోలీసుల పూర్తి సహకారం తోడవడంతో ఏమీ చేయలేకపోయారు. ఒంటిమిట్టలో ఉదయం 9.30 వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఇలాగైతే టీడీపీకి ఓటమి తప్పదని మంత్రి భావించారు. ఒంటిమిట్ట జెడ్పీ హైస్కూల్‌లోని బూత్‌లోకి ప్రవేశించి వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ను స్వయంగా లేపి బయటికి పంపారు. మంత్రి అనుచరులు మిగిలినవారినీ పంపించేస్తూ టీడీపీ ఏజెంట్లను మాత్రమే కూర్చోబెట్టారు.
చిన్నకొత్తపల్లె గ్రామంలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుండగా 300 మందితో వచ్చి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అడ్డుకోబోయిన గ్రామస్తుడు, వైఎస్సార్‌సీపీ కార్యకర్త వల్లెపు సుబ్బయ్యపై మంత్రి దాడి చేయించారు. పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితం అయ్యారు. మండలంలోని 30 కేంద్రాల్లో మంత్రి అనుచరులు దగ్గరుండి ఓట్లు వేసుకున్నారని స్థానికులు తెలిపారు.
మంటపంపల్లెలో చెలరేగిన పచ్చమూక
ఒంటిమిట్ట నుంచి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి మంటపంపల్లె వెళ్లగా టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడి చేసి బయటకు తోసేశాయి. ఇది తెలిసి వైఎస్సార్‌సీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, నేతలు, పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, నేతలు పులి సునీల్‌కుమార్, షఫీ నేరుగా మంటపంపల్లె చేరుకున్నారు.
గట్టిగా నినాదాలు చేస్తూ మంత్రిని బయటకు పంపాలని డిమాండ్ చేశారు. ఇది చూసి చేసేదేమీ లేక మంత్రి వెళ్లిపోయారు. కానీ, అప్పటికే బూత్‌లో దొంగ ఓట్ల పరంపర కొనసాగింది. ఇలా మంత్రి వెళుతున్న ప్రతి చోటికి వైఎస్సార్‌సీపీ నేతలు వెళ్లి అడ్డుకున్నారు. ఇదంతా జరుగుతున్న తరుణంలోనే వైఎస్సార్‌సీపీ నేతలందరినీ పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ నేతలను వదిలివేయడంతో వారు రిగ్గింగ్ కొనసాగించారు.
రాళ్లు రువ్విన టీడీపీ బ్యాచ్
చిన్నకొత్తపల్లె బూత్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై మంత్రి సమక్షంలోనే పిడిగుద్దులు గుద్దుతూ తన్నుతూ బయటకు తోసేశారు. టీడీపీ మూకలు రాళ్లు వేయడంతో ఏజెంట్‌కు గాయాలయ్యాయి. అక్కడి మహిళలు కూడా మంత్రి తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతలు మరోసారి వచ్చి మంత్రిని అడ్డుకున్నారు. దీంతో బూత్‌లోపల ఉన్న మంత్రి వెళ్లిపోయారు. భారీగా పోలీసులు ఉన్నా బూత్ లోపల ఏం జరుగుతుందో తెలియనట్లు ఉండిపోయారు.
వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టు.. గృహ నిర్బంధం
ఒంటిమిట్ట మండలంలో మధ్యాహ్నం వరకు మంత్రి హల్‌చల్ కొనసాగగా ఏమీ చేయని పోలీసులు... జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఫాంహౌస్ వద్ద ఉన్న రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా తదితరులను అరెస్టు చేసి కడపకు తరలించడం గమనార్హం. ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డిలను అక్కడి నుంచి తరలించారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
ఒంటిమిట్టలో పోలింగ్ సాయంత్రం వరకు టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరిగింది. ఒకపక్క మంత్రి, మరో పక్క రాజంపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రాజు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు దౌర్జన్యాలు, దాడులకు దిగాయి. పచ్చ నేతలు పదేపదే భారీగా బూత్‌లలోకి వెళ్తున్నా పోలీసులు అభ్యంతరం తెలపలేదు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను మాత్రం దగ్గరకు రానీయకుండా ఏకపక్షంగా వ్యవహరించారు.
రీపోలింగ్ నిర్వహించాలి: వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి
ఒంటిమిట్ట మండలంలో టీడీపీ నేతల కనుసన్నల్లో రిగ్గింగ్ జరిగిందని, రీ పోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కడపలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓబులమ్మను కలిసి విన్నవించారు.

రాయచోటి, రాజంపేట నుంచి టీడీపీ రౌడీ మూకలు
ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో రాయచోటి, రాజంపేట నుంచి వందల సంఖ్యలో వచ్చిన టీడీపీ రౌడీ మూకలు, బౌన్సర్లు పేట్రేగిపోయారు. బూత్‌లలోకి చొరబడి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై విచక్షణారహితంగా దాడులు చేశారు. ఉదయం వరకు సాఫీగా సాగిన పోలింగ్.. ఓటర్ల నుంచి స్లిప్పులను కూడా లాక్కున్న వీరి అలజడి, దౌర్జన్యంతో ఉద్రిక్తంగా మారింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు టీడీపీ రౌడీల అండతో దొంగఓట్లు, రిగ్గింగ్ యథేచ్ఛగా సాగింది. ఎన్నికల అధికారులు, పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు.
మంత్రి బూత్‌లలో తిష్ట వేయగా శ్రేణులు రిగ్గింగ్ కొనసాగించాయి. పోలీసులు మాత్రం సెల్‌ఫోన్లు చూసుకుంటూ కొందరు, కాలక్షేపానికి విజిల్స్ వేస్తూ కొందరు పోలీసులు ఉండిపోయారు. మండలం అంతా పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడచూసినా టీడీపీ నేతలకు పోలీసులు రెడ్ కార్పెట్ పరిచారు. సాయంత్రం వరకు కాన్వాయ్‌లో తిరుగుతున్నా ఎవరూ అడ్డుకోలేదు. వైఎస్సార్‌సీపీ నేతలకు మాత్రం ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తూ సమీప ప్రాంతాలకు రానివ్వలేదు.
ఎన్నికల కమిషన్ దృష్టిసారించి పూర్తి స్థాయిలో విచారణ చేపడితే పోలింగ్‌లో అక్రమాలు బట్టబయలు అవుతాయి. కాగా, వైఎస్సార్‌సీపీ గ్రామ స్థాయి నేతలను మంగళవారం ఉదయమే స్టేషన్‌కు తీసుకెళ్లారు. కీలక నేతలు వచ్చి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనికిముందు కూడా పోలింగ్ బూత్‌ల వద్ద నాయకులు, పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది.
కొత్తవారు వచ్చి మా ఓటు వేశారు
ఎవరో కొత్తవారు వచ్చి బూత్‌లలో కలిసిపోయి, మా ఓట్లు వేసేశారు. ఇదేంటి అని నిలదీసిన వైఎస్సార్‌సీపీ ఏజెంట్ వల్లెపు సుబ్బయ్యను మంత్రి మండిపల్లి ముందే బయటకు లాగి, విచక్షణారహితంగా కొట్టారు. – రాయచోటి వరలక్ష్మీ, చిన్నకొత్తపల్లె, ఒంటిమిట్ట
ఇలాంటి గూండాగిరి ఎన్నడూ చూడలేదు
ఒంటిమిట్ట చరిత్రలో ఇలాంటి గూండాగిరి ఎన్నడూ వినలేదు చూడలేదు. మండలంలో ఎప్పుడూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేవి. ఇప్పుడు ఎవరో మంత్రి అట.. ఆయన పోయిన ప్రతి బూత్‌లో బయటకు వస్తూనే గొడవలు జరిగాయి. ఇంత దౌర్జన్యంగా ఎన్నికలు జరిపితే ఏమి, లేకుంటే ఏమి.? – వల్లెపు నాగజ్యోతి, చిన్నకొత్తపల్లె, ఒంటిమిట్ట