
పులివెందుల పోలీసా.. మజాకా !
పరామర్శకు వెళితే కేసులా?
విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రజలు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి పులివెందుల ఖాకీల తీరు రోజురోజుకు తీవ్ర వివాదాస్పదమవుతూనే ఉంది. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులపై అనేక అక్రమ కేసులు బనాయించిన పులివెందుల పోలీసులు.. మరికొంతమంది నేతలపై రౌడీ షీట్లు కూడా నమోదు చేశారు. తాజాగా జరిగిన ఓ ఘటనలోనూ వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం పోలీసుల ఏకపక్షవైఖరికి అద్దం పడుతోంది. గత ఆదివారం రాత్రి పట్టణంలోని నగరిగుట్టలో వ్యక్తిగత కక్షల కారణంగా రాజేష్, అంజనప్పల వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. గొడవ అనంతరం వైఎస్సార్‌సీపీకి చెందిన పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ హఫీజ్, కౌన్సిలర్ కిశోర్ అంజనప్పతో పాటు మరికొందరిని పరామర్శించారు. గొడవకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
అలాగే కొందరు టీడీపీ నాయకులు కూడా ఆ ఘటనలో గాయాలపాలైన కొందరిని పరామర్శించారు. ‘నవ్విపోదురు గాక.. నాకేటి సిగ్గు’ అన్నట్లు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకపక్షధోరణిలో అంజనప్పతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. అంతేనా.. పరామర్శకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకులపై సైతం గొడవకు కుట్రదారులుగా పేర్కొంటూ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ హఫీజ్, కౌన్సిలర్ కిశోర్‌లపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసినట్లు సమాచారం. అటువైపు పరామర్శకు వెళ్లిన టీడీపీ నాయకులపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. పులివెందుల పోలీసుల వైఖరి చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికార పార్టీ నాయకులను సంతృప్తి పరిచేందుకే వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.