
డబ్బు పంపలేదని తల్లిని కడతేర్చిన కుమారుడు
మృతురాలు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని
ప్రొద్దుటూరు క్రైం: డబ్బు పంపలేదనే కోపంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకే కన్న తల్లిని గొంతుకోసి హత్యచేసిన ఘటన వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. డబ్బు పంపకుంటే కొడుకు ఇంటికి వస్తాడనుకుంది ఆ తల్లి. కానీ ఆ ఆలోచనతోనే కుమారుని ఆగ్రహానికి ఆమె బలైపోయింది. ప్రొద్దుటూరు మండలంలోని శ్రీరాంనగర్‌లో ఆదివారం ఉప్పలూరు లక్ష్మీదేవి (51)ని ఆమె కుమారుడు యశ్వంత్‌రెడ్డి కత్తితో గొంతుకోసి హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముచ్చుగుంట్ల విజయభాస్కర్‌రెడ్డి, ఉప్పలూరు లక్ష్మీదేవి పట్టణంలోని శ్రీరాంనగర్‌లో నివాసం ఉంటున్నారు.
వీరికి యశ్వంత్‌రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. లక్ష్మీదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. విజయర్ భాస్కరెడ్డి గతంలో బార్‌లో పని చేసేవాడు. యశ్వంత్‌రెడ్డి చెన్నైలోని సత్యభామ ఇంజినీరింగ్ కాలేజీలో మూడేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. జూబ్లీహిల్స్‌లోని హాస్టల్‌లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. హాస్టల్, కోచింగ్ ఫీజులతో పాటు ఖర్చుల నిమిత్తం లక్ష్మీదేవి ప్రతినెలా అతనికి డబ్బు పంపేవారు. అయితే ఎప్పుడు ఇంటికి రమ్మన్నా వచ్చేవాడు కాదు.
అతడికి సినిమాల్లో నటించాలనే కోరిక ఉందని, ఆ దిÔశగా ప్రయత్నాలు చేసేవాడని సన్నిహిత వర్గాల సమాచారం. కొన్ని నెలల క్రితం బంధువులు, కుటుంబ సభ్యులు యశ్వంత్‌రెడ్డిని కారులో బలవంతంగా ప్రొద్దుటూరుకు తీసుకొచ్చారు. ఆరోగ్యం సరిగా లేదని భావించిన తల్లిదండ్రులు అతనికి నాటు మందు కూడా తినిపించారు. రెండు నెలల పాటు ఇంటి వద్దే ఉన్న యశ్వంత్‌రెడ్డి తల్లిదండ్రులకు నచ్చజెప్పి మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఇటీవల కుమారుడిని ఇంటికి రమ్మని అనేకసార్లు తల్లిదండ్రులు ఫోన్ చేశారు. అయినా అతను రాలేదు. ఇటీవల యశ్వంత్‌రెడ్డి తల్లికి ఫోన్ చేసి హాస్టల్ ఫీజుతో పాటు తన ఖర్చులకు డబ్బు పంపించాలని కోరాడు. ఆమె పంపలేదు. అలా అయినా కొడుకు వస్తాడని తల్లిదండ్రులు భావించారు.
ఆదివారం ఉదయాన్నే యశ్వంత్ ప్రొద్దుటూరుకు వచ్చాడు. నేరుగా వంట గదిలో ఉన్న తల్లి లక్ష్మీదేవితో గొడవపడ్డాడు. తండ్రి విజయభాస్కర్‌రెడ్డి బెడ్‌రూంలో స్నానం చేస్తుండగా గది తలుపులు మూసి గొళ్లెం పెట్టాడు. ఈ క్రమంలోనే వంటగదిలో ఉన్న కూరగాయలు కోసే కత్తి తీసుకొని లక్ష్మీదేవి గొంతుకోశాడు. ఆమె రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా ఈడ్చుకొచ్చి వరండాలో పడేశాడు. తర్వాత స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బెడ్‌రూం తలుపులు తీయడంతో తండ్రి విజయభాస్కర్‌రెడ్డి బయటికి వచ్చాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. కాగా, తల్లిని హత్యచేసిన అనంతరం యశ్వంత్‌రెడ్డి ఇంట్లో టీవీ చూస్తూ కూర్చున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన పోలీసులుసైతం అవాక్కయ్యారు.