ఖాళీ చెక్కుతో కాసుల బేరం | - | Sakshi
Sakshi News home page

ఖాళీ చెక్కుతో కాసుల బేరం

Oct 9 2025 3:17 AM | Updated on Oct 9 2025 10:51 AM

ఖాళీ చెక్కుతో కాసుల బేరం

ఖాళీ చెక్కుతో కాసుల బేరం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : సమాజంలో పరువుగా బతికే ఉద్యోగులు భయపడిపోతున్నారు. వడ్డీ వ్యాపారుల వలలో చిక్కి లబోదిబోమంటున్నారు. ఏమి చేయాలో తోచక తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పలేని పరిస్థితి. 2016 నుంచి కొంత మంది అనుచరులను మధ్యవర్తులుగా ఏర్పాటు చేసుకున్న ఓ వ్యాపారి దాష్టీకం ఇది. లక్ష రూపాయలు వడ్డీకి ఇచ్చి ఖాళీ చెక్కులు తీసుకోవడం.. మొత్తం చెల్లించినా.. తర్వాత ఎక్కువ మొత్తం చెక్కులో రాసి కోర్టు ద్వారా అధికంగా సొమ్ము లాక్కోవడం అతడికి ఆనవాయితీగా మారింది. బయటికి చెప్పుకోలేకపోతున్నామన్న ఉపాధ్యాయులు సాక్షితో స్వయంగా తమ అభిప్రాయాలు వెల్లడించారు.

ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లెకు చెందిన జింకా రవి గతంలో శిల్క్‌ వ్యాపారం చేసే వారు. నష్టాలు వచ్చాయని రూ.40 లక్షలకు 99/2003లో ఐపీ కేసు నమోదైంది. కోర్టు ద్వారా వేలంలో జింకా రవి ఇంటిని కూడా వేరొకరు కొన్నారు. ఈయనే 2016లో గుర్రప్ప స్వామి ఆటో ఫైనాన్స్‌ పేరుతో వడ్డీ వ్యాపారం ప్రారంభించాడు. పేరుకు మాత్రమే సంస్థ ఏర్పాటుచేశారు కానీ ఎలాంటి రికార్డులు మెయింటెనెన్స్‌ చేయడం, ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులనే టార్గెట్‌గా చేసుకుని వ్యాపారం సాగిస్తున్నాడు. తీసుకున్న అప్పు కంతుల ప్రకారం చెల్లించినా తన వద్ద ఉన్న ఖాళీ చెక్కులను కోర్టులో వేసి రూ.లక్షకు రూ.10 లక్షలు బాకీ ఉన్నట్లు తన ఇష్టం వచ్చినట్లు ఖాళీ చెక్‌లో రాసుకుని బాకీదారులపై ఒత్తిడి చేసి వసూలు చేస్తున్నాడు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తూ పదవీ విరమణ చెందిన దంపతులు గుర్రప్ప స్వామి ఆటో ఫైనాన్స్‌లో అప్పు తీసుకున్నారు. రూ.లక్షల్లో బాకీ ఉన్నారని వారిపై 15 తప్పుడు కేసులు పెట్టి వేధించారనే ఆరోపణలున్నాయి. ప్రొద్దుటూరు ఒకటో అదనపు ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌, రెండో అదనపు ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుల పరిధిలో జింకా రవి, ఆయన అనుచరులు వేసిన కేసులు 300కు పైగానే ఉన్నాయనే ఆరోపణలున్నాయి.

రూ.1.50 లక్షలు తీసుకుంటే రూ.36 లక్షలంటూ కోర్టుకు

ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీలో నివసిస్తున్న వితంతురాలైన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రూ.50 వేలు ఒక మారు, రూ.లక్ష మరో మారు వడ్డీకి తీసుకున్నారు. ఆమె రూ.3 లక్షలు చెల్లించారు. డబ్బు తీసుకున్న సమయంలో ఉపాధ్యాయురాలు ఇచ్చిన ఖాళీ చెక్కులను ఆధారంగా చేసుకుని రూ.36 లక్షలు బాకీ ఉన్నట్లు కోర్టులో వేశాడు. తన కుమారుడు తిరుపతిలో ట్యాక్సీ నడుపుతుండటంతో అవసరాల కోసం ఆమె అప్పు తీసుకోవడం జరిగింది. గుర్రప్ప ఆటో ఫైనాన్స్‌ ఎండీ జింకా రవితోపాటు ఆయన అనుచరులు మొత్తం 7 కేసులు వేయగా 4 కేసులు కొట్టేశారు. మిగతా కేసులు విచారణలో ఉండగానే ఆమె చనిపోవడం జరిగింది.

రూ.5 లక్షలకు.. రూ.20లక్షలట..

ప్రొద్దుటూరుకు చెందిన ఓ ఉపాధ్యాయుడు రూ.లక్ష అప్పు తీసుకుని రూ.5 లక్షలు చెల్లించాడు. ఇంకా బాకీ ఉందని ఒత్తిడి చేయడంతో ఆ ఉపాధ్యాయుడు పక్కనున్న మండలానికి బదిలీ చేయించుకున్నారు. ఆయనపై రూ.20 లక్షలకు కోర్టులో కేసు వేశారు. 2019లో కోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే తనకు వచ్చిన మెడికల్‌ బెన్‌ఫిట్‌ రూ.5 లక్షలు తనకంటే ముందుగానే బ్యాంక్‌ ద్వారా డ్రా చేసుకున్నాడు. ఈయనపై పెట్టిన రెండు కేసులను కోర్టులో కొట్టివేయడం జరిగింది.

ఖాళీ చెక్కులపై అదనంగా రాసుకుని..

మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు యనమల సుబ్బరాయుడు గుర్రప్ప ఆటో ఫైనాన్స్‌ కంపెనీలో అప్పు తీసుకుని చెల్లించినా.. ఖాళీ చెక్కులను కోర్టులో వేసి తనకు ఇంకా బాకీ ఉందని కేసులు వేశారు. జింకా రవితోపాటు ఆయన అనుచరులు మొత్తం 7 కేసులు వేశారు. ఇందులో రెండు కేసులు కొట్టివేయగా, ఐదు కేసులు విచారణలో ఉండగానే గుండెపోటుతో ఉపాధ్యాయుడు మరణించాడు. మరో ఉపాధ్యాయుడిపై కూడా నాలుగు కేసులు వేయడం జరిగింది. మరో ఉపాధ్యాయుడు తాను తీసుకున్న డబ్బు చెల్లించినా కోర్టులో కేసు వేయడంతో విధిలేని పరిస్థితిలో ఆయన పక్క నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధిని ఆశ్రయించారు. ఆయన జింకా రవిని పిలిపించి హెచ్చరించడంతో కోర్టులో కేసు విత్‌ డ్రా చేసుకున్నారు. దీంతో ఆ ఉపాధ్యాయుడు మానసిక వేదన అనుభించాడు.

కోర్టులో కొట్టేసినా..

కె.చంద్రశేఖర్‌ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇచ్చిన ఖాళీ చెక్కుతో రూ.9 లక్షలు చెల్లించాలని 2017 జనవరి 7వ తేదీన ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో గుర్రప్పస్వామి ఆటో ఫైనాన్స్‌ తరపున కేసు వేయగా 2019 మే 16న కొట్టేశారు. ఇదిలా ఉండగా తన వద్ద ఉన్న సదరు ఉపాధ్యాయుడి ఖాళీ చెక్కులను ఆసరాగా చేసుకుని రూ.4 లక్షలు చెల్లించాలని 2019 జూన్‌ 7న, జూలై 17న రూ.2.50 లక్షలకు మొదటి అదనపు ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో తప్పుడు కేసులు వేయడం జరిగింది. ఓ మహిళా ఉపాధ్యాయురాలికి సంబంధించి 2019 మే 16న ఖాళీ చెక్‌తో దాఖలు చేసిన కేసును కొట్టివేయగా, 2019 మే 31న రూ.4.25 లక్షలకు మళ్లీ కేసు వేశారు. ఈ ప్రకారం గుర్రప్పస్వామి ఆటో ఫైనాన్స్‌ ఎండీ జింకా రవి తరపున 2017లో 35 కేసులు, 2018లో 7 కేసులు, 2019లో 17 కేసులు, 2020లో 11 కేసులు వేశారు. జింకా వెంకటసుబ్బయ్య 42 కేసులు, జింకా బ్రహ్మయ్య 26 కేసులు, గుర్రం వెంకటలక్షమయ్య 9 కేసులు, పుల్లగూర చౌడయ్య 30 కేసులు, వద్ది ఓబయ్య 22 కేసులు వేశారు.

ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్‌

వడ్డీ వ్యాపారి జింకా రవి చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్‌ చేసుకున్నారు. 2016 నుంచి తక్కువ మొత్తం అప్పు ఇచ్చి ఉద్యోగులచే ఖాళీ చెక్కులను ఇప్పించుకుని తమ ఇష్టం వచ్చిన రీతిలో డబ్బు మొత్తాన్ని రాసుకుని కోర్టులో కేసు వేశారు. కోట్ల రూపాయలను అక్రమంగా పొందాలనే ప్లాన్‌తో ఇలా చేశారు. విచారణ జరిగిన కేసుల్లో 20కిపైగా కొట్టివేయడం జరిగింది. జింకా రవి వేసిన కేసుల్లో ఒకటి యదార్థంగా బాకీ ఉన్నట్లు అనిపించడం లేదు. అన్ని కేసులూ తప్పుడు కేసులే. ఒక కేసు కొట్టేశాక అదే వ్యక్తిపై మళ్లీ ఇంకొక కేసు వేశారు.

– ఎన్‌సీ సుమంత్‌ కుమార్‌, న్యాయవాది,

ప్రొద్దుటూరు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement