
ట్రంప్ టారిఫ్ టెర్రరిజంపై మోదీ మౌనం వీడాలి
ప్రొద్దుటూరు : ట్రంప్ టారిఫ్ టెర్రరిజంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ అన్నారు. స్థానిక మహిళా శక్తి భవనంలో బుధవారం సీపీఎం రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హెచ్1బీ వీసా వేధింపులు, యూనివర్సిటీ యువత, మధ్యతరగతి విద్యావంతులు, ఐటీ కుటుంబాలు, టెక్స్‌టైల్స్ గార్మెంట్స్, రైతులపై పన్నుల భారం మోపి ట్రంప్ టారిఫ్ టెర్రరిజం సృష్టిస్తున్నారన్నారు. అమెరికా సామ్రాజ్య వాద వాణిజ్య వ్యతిరేక పోరాటం చేయాల్సిన ఎన్డీఏ ప్రభుత్వం మౌనం వహించడం దేశానికి ప్రమాద కరమన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన నాన్యమూర్తి గవాయిపై దాడి రాజ్యాంగంపై దాడిగా పరిగణించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. దేశంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక దోపిడీ కుల వ్యవస్థ రూపంలో ఉందని, దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. అధికార, ప్రతిపక్షాలు జిల్లా సమగ్రాభివృద్ధిని పూర్తిగా విస్మరించారయని, ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, పులివెందుల మెడికల్ కళాశాల ప్రారంభం, మేజర్, మైనర్, స్మాల్, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, అసంపూర్తిగా ఉన్న కడప–బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణం పూర్తిచేయాలన్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడలలో ఉపాధి అవకాశాలను పెంచాలన్నారు. స్మార్ట్ మీటర్లతో ప్రజలపై అదనపు భారం మోపడం తగదన్నారు. యూరియా కొరత పరిష్కరించాలని, బలవంతపు భూసేకరణ ఆపాలన్నారు. ఎ.రామ్మోహన్, సత్యనారాయణ, సర్వేశ్వరి, ముంతాజ్ బేగం, సాల్మన్, విజయ్‌కుమార్, మహబూబ్ బాషా, రమేష్, పాల్గొన్నారు.