
హత్య కేసు నిందితుడికి జీవితఖైదు
కడప అర్బన్: హత్య కేసులో ఓ నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని తీర్పునిచ్చారు. సంఘటన వివారాలిలా ఉన్నాయి.. చెట్టేవేలి భవాని శంకర్ కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో, మహావీర్ సర్కిల్ సమీపంలోని ఎల్‌ఐసీ కార్యాలయం, ఈఎండీ స్కానింగ్ సెంటర్‌లో కాంట్రాక్టర్ మల్లికార్జున వద్ద కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశాడు. అయితే తన భార్యతో మృతుడికి వివాహేతర సంబంధం ఉందని మల్లికార్జున అనుమానించాడు. కోపంతో మృతుడిని తరచూ వేధించేవాడు. 2023 నవంబర్, 12న ఉదయం 9 గంటల సమయంలో మల్లికార్జున ఎల్‌ఐసీ ఆఫీసుకు రమ్మని భవానీ శంకర్‌ను పిలిచాడు. మృతుడు ఆఫీస్ వద్దకు వెళ్ళగానే ఆగ్రహావేశంతో తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు’’ అంటూ వెంట తెచ్చుకున్న మచ్చు కత్తితో విచక్షణా రహితంగా భవానీశంకర్‌ను నరికి చంపాడు. మృతుడి భార్య చిట్టివేలి బాబాబీ కడప వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అప్పటి సీఐ నాగరాజు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం నిందితుడికి జీవిత ఖైదు, రూ.100 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని తీర్పునిచ్చారు. నిందితుడికి శిక్ష పడేలా కృషిచేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ షెల్కేనచికేత్‌విశ్వనాథ్ అభినందించారని సీఐ బి.రామక్రిష్ణ ఓ ప్రకటనలో తెలిపారు.