వైఎస్‌.జగన్‌కు పేరొస్తుందనే కళాశాలల పైవేటీకరణ | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌.జగన్‌కు పేరొస్తుందనే కళాశాలల పైవేటీకరణ

Oct 9 2025 3:17 AM | Updated on Oct 9 2025 3:17 AM

వైఎస్‌.జగన్‌కు పేరొస్తుందనే కళాశాలల పైవేటీకరణ

వైఎస్‌.జగన్‌కు పేరొస్తుందనే కళాశాలల పైవేటీకరణ

కడప కార్పొరేషన్‌ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు వస్తుందనే మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌.సుధాకర్‌బాబు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణతో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందకుండా పోతాయన్నారు. సీఎం చంద్రబాబు నిర్ణయాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం వ్యతిరేకించారని గుర్తుచేశారు. వైద్య రంగాన్ని చంద్రబాబు బినామీల చేతుల్లో పెట్టకుండా మాజీ సీఎం వైఎస్‌.జగన్‌ అడ్డుపడుతూ మహా యజ్ఞం సాగిస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రలో తాను కట్టిన మెడికల్‌ కాలేజీని ప్రజలకు చూపించడానికి వైఎస్‌.జగన్‌ వెళ్తుంటే స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఛాలెంజ్‌ చేయడం హాస్యాస్పదమన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 30రకాల సంక్షేమ పథకాలతో దళితులకు రూ.70 వేల కోట్లు లబ్ధి కలిగిందన్నారు. ప్రతి సంవత్సరం రూ.13వేల కోట్లు వారి ఖాతాల్లో పడ్డాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్‌ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ పథకాలను సర్వనాశనం చేసిందన్నారు. సూపర్‌ సిక్స్‌తో దళితులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో మాల, మాదిగ మహిళలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కుడి చేత్తో వడ్డించడం, ఎడం చేత్తో లాక్కోవడం చంద్రబాబు నైజమన్నారు. మద్యం కుంభకోణాన్ని సృష్టించి వైఎస్‌.జగన్‌ చుట్టూ ఉన్నవారందరినీ అరెస్ట్‌ చేసి జైళ్లలో పెట్టారని, ఇప్పుడు చిత్తూరు జిల్లాలోనే నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడిందన్నారు. నకిలీ మద్యంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రజల ఆరోగ్యం నాశనం చేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని, సరసమైన ధరలకు స్వచ్ఛమైన మద్యం ఇస్తామని ఇదివరకు ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదన్నారు. ఒక్క చంద్రబాబు మాత్రమే చెప్పారని ఎద్దేవా చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్‌ నేతలు పులి సునీల్‌, ఎస్‌. వెంకటేశ్వర్లు, త్యాగరాజు, కె. బాబు, సుబ్బరాయుడు, సీహెచ్‌ వినోద్‌, భాస్కర్‌, కె. శరత్‌ బాబు, శ్రీనివాసులు, కంచుపాటి బాబు పాల్గొన్నారు.

లక్షమందితో జగనన్న దళిత ఫోర్స్‌

కడప కార్పొరేషన్‌: లక్ష మందితో జగనన్న దళిత ఫోర్స్‌ తయారు చేయాలన్నదే తన లక్ష్యమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌ బాబు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఎస్సీ విభాగానికి సంబంధించిన నేతలతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 16వేల గ్రామాలున్నాయని, ప్రతి గ్రామం నుంచి ఐదుమంది దళితులను ఎంపికచేయాలన్నారు. కమిటీలన్నీ పూర్తయిన తర్వాత జిల్లా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం, జిల్లా స్థాయి శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 13న అన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ సెల్‌ సమావేశాలు నిర్వహించాలని, ప్రతి సమన్వయకర్త తప్పక హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో కమిటీలు పూర్తి చేసేందుకు తాత్కాలిక పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. కడప నియోజకవర్గానికి త్యాగరాజు, బద్వేల్‌కు కె.బాబు, ప్రొద్దుటూరుకు సీహెచ్‌.వినోద్‌కుమార్‌, కమలాపురానికి సుబ్బరాయుడు, జమ్మలమడుగుకు యోబు, మైదుకూరుకు కె.శరత్‌ బాబు, పులివెందులకు భాస్కర్‌లను నియమించారు. పులి సునీల్‌ కుమార్‌, సింగమాల వెంకటేశ్వర్లు, కంచుపాటిబాబు పాల్గొన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, పాల్గొన్న నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement