
దాడులు చేస్తే.. విధులు నిర్వర్తించేదెలా?
కడప కోటిరెడ్డిసర్కిల్ : దాడులు చేస్తే విధులు ఎలా నిర్వర్తిస్తామంటూ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు కడప ఆర్‌ఎం కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. దువ్వూరు వద్ద ఆళ్లగడ్డకు చెందిన ఓ అద్దె బస్సు డ్రైవర్‌పై దాడికి పాల్పడడం తగదని నిరసన ప్రదర్శించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. కెపాసిటీకి మించి బస్సులో ప్రయాణికులున్నా.. ఆపాలంటూ దాడులు చేయడం దారుణమన్నారు. స్టేజితో సంబంధం లేకుండా ఎక్కడపడితే అక్కడ బస్సు ఆపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రయాణికులను తీసుకువెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సులు రాక అసహనం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రవాణాశాఖ మంత్రి బస్సు డ్రైవర్ల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆర్టీసీ ఆర్‌ఎం పొలిమేర గోపాల్‌రెడ్డి కల్పించుకుని డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో అందరూ వెనుదిరిగారు.
విధులు బహిష్కరించి అద్దె బస్సు డ్రైవర్ల నిరసన బాట