
టీడీపీ ముఖ్యులకు నెలవారీ మామూళ్లు
అన్నమయ్య జిల్లా స్థాయిలో ముఖ్య నేత, తంబళ్లపల్లి టీడీపీ ఇన్‌చార్జ్ కనుసన్నల్లో తయారీ
వీరిని తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసు నమోదు
నేరాన్నంతటినీ విదేశాల్లో ఉన్న జనార్దన్‌రావుపైకి తోసేసే యత్నం
అసలు సూత్రధారులు, పాత్రధారులను కాపాడేలా స్కెచ్
సీఎంవోకు నివేదించడంతో రాత్రికి రాత్రి మారిపోయిన కేసు
టీడీపీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డి పీఏ రాజేష్ మద్యం దుకాణం వైపు కన్నెత్తి చూడని అధికారులు
సాక్షి ప్రతినిధి, కడప: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మండల కేంద్రం ములకలచెరువుకు సమీపంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం బట్టబయలు కావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కనీ వినీ ఎరుగని రీతిలో ఇంత భారీగా యంత్రాల సాయంతో వివిధ బ్రాండ్లను పోలిన నకిలీ మద్యం ములకలచెరువు వద్ద తయారవుతోందని తెలిసి ఉమ్మడి చిత్తూరు, అనంతపురం వాసులు విస్తుపోయారు. ఇన్నాళ్లూ తాము తాగిన మద్యం నకిలీదేనని తెలుసుకుని స్థానికంగా ఉన్న వారు బెంబేలెత్తుతున్నారు. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు, బెల్ట్ షాపులకు ప్రధానంగా ఇక్కడి నుంచి నకిలీ మద్యం సరఫరా అయ్యేదని శుక్రవారం నాటి ఎక్సైజ్ దాడుల్లో స్పష్టమైంది.
ఇంత భారీ రీతిలో నకిలీ మద్యం దందా సాగించడానికి ప్రభుత్వంలోని టీడీపీ ముఖ్య నేతల అండ ఉందని తెలుస్తోంది. ప్రతి నెలా కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిగేవని తేలింది. ఇందులో కొంత సొమ్ము ముఖ్య నేతలకు ప్రతి నెలా చేరేదని సమాచారం. ఏడాదికి పైగా విచ్చలవిడిగా, నిర్భీతిగా యథేచ్ఛగా నకిలీ మద్యం తయారు చేసి.. జనంతో తాగించి వారి ప్రాణాలతో చలగాటం ఆడిన టీడీపీ నేతలు.. వారికి అన్ని విధాలా అండగా నిలిచిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా నోరెత్తడం లేదు. పైగా అసలు సూత్రధారులను తప్పిస్తూ.. పాత్రధారుల్లో అనామకులైన కొంత మందిపై మాత్రమే కేసులు నమోదు చేయించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా స్థాయిలో ముఖ్యనేత, తంబళ్లపల్లి ఇన్‌చార్జ్ కనుసన్నల్లో ఈ నకిలీ మద్యం ప్లాంట్ కార్యకలాపాలు కొనసాగాయని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. ఇక్కడి కూలీలను పనిలో పెట్టుకుంటే బండారం బయట పడుతుందని భావించి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. ఈ విషయమై స్థానికులకు ఇదివరకే అనుమానాలు వచ్చినా, టీడీపీ నేతలకు జడిసి నోరు విప్పలేదు. శుక్రవారం నాటి నాటకీయ పరిణామాల నేపథ్యంలో అందరూ ఇదే విషయమై చర్చించుకుంటున్నారు.
వారి పేర్లు ఎక్కడా రాకూడదు
నకిలీ మద్యం రాకెట్‌ను నడిపిస్తున్న టీడీపీ ముఖ్య నేతల పేర్లు ఎక్కడా రాకూడదని, కేసులో వారి పేర్లు ఉండకూడదని ఉన్నతాధికారులకు అమరావతి నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. శుక్రవారం నాటి నాటకీయ పరిణామాలు, శనివారం సాయంత్రం ములకలచెరువులో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వెల్లడించిన అంశాలు పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టం అవుతోంది. అసలు వాస్తవాల జోలికి వెళ్లకుండా, సూత్రధారులెవరో చెప్పకుండా, కేవలం పాత్రధారుల వివరాలను మాత్రమే వెల్లడించి చేతులు దులుపుకున్నారు. నకిలీ మద్యం కేసులో అనుమానాలను నివృత్తి చేయాల్సిన ఎక్సైజ్ అధికారుల తీరుపైనా అనుమానాలు వ్యక్తం ఆవుతున్నాయి.
ముఖ్యులను తప్పించేసినట్టే
ములకలచెరువు నకిలీ మద్యం వెలుగులోకి రాగానే ప్రభుత్వ నిఘా, ఎక్సైజ్ వర్గాలు తమ నివేదికలను సీఎంఓకు నివేదించాయని సమాచారం. మొదట టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడును అదుపులోకి తీసుకున్నాక.. అక్కడి పరిస్థితి ఉన్నత స్థాయి వ్యక్తుల దృష్టికి వెళ్లింది. మొదట దీనిపై కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయంతో సురేంద్ర నాయుడును అరెస్ట్ చేసినట్టు ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. శనివారం అసలు సూత్రధారుల వివరాలను వెల్లడిస్తారని భావించగా, పైస్థాయిలో జరిగిన పరిణామాలతో తంబళ్లపల్లె టీడీపీ ముఖ్యల పేర్లు బయటకు రాకుండా తొక్కిపెట్టినట్టు తెలిసింది.
దీంతో ఇప్పటికే కేసులో నమోదు చేసిన నిందితుల పేర్లను మరోమారు వెల్లడించి సరిపెట్టుకున్నారు. నిజానికి తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి పాత్ర ఉందని ఈ ప్రాంతంలో అందరికీ తెలిసినా, ఆయనను తప్పిస్తూ ఆయనæ పీఏ రాజేష్‌పై మాత్రమే తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. అయితే ఇతని అరెస్ట్‌పై కూడా అధికారులు ఆసక్తి చూపేలా కనిపించడం లేదు. పైగా రాజేష్‌కు చెందిన మద్యం దుకాణం వైపు శనివారం ఎక్సైజ్ శాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ దుకాణాన్ని సీజ్ చేస్తామని, లైసెన్స్ కూడా రద్దు చేస్తామని శుక్రవారం చెప్పిన అధికారులు పై నుంచి ఒత్తిడి రావడంతో ఆ దిశగా చర్యలు తీసుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది.
ఈ కేసులో నిందితులుగా ఉన్న జనార్దనరావు, కట్టా రాజులు దొరికితే కానీ వాస్తవాలు తెలియవని ఎక్సైజ్ అధికారులు తప్పించుకునే ధోరణితో ముందుకెళ్తున్నారు. విజయవాడకు చెందిన జనార్దన్‌రావు ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నట్టు సమాచారం. ఇదే నిజమైతే అయన్ను ఇక్కడికి ఎప్పుడు రప్పిస్తారు.. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు.. నిజాలు ఎప్పుడు వెలికితీస్తారనే దానికి సంబంధించి అధికారుల నుంచి స్పందనే లేదు. ఈ నకిలీ మద్యం ఏడాది క్రితం నుంచి నడుస్తుండగా.. గత నెలలోనే పెట్టారంటూ అధికారులు తేల్చేయడం గమనార్హం.
ఈ ప్రశ్నలకు బదులేదీ?
⇒ ఈ కేంద్రానికి పెట్టుబడి పెట్టింది ఎవరు?
⇒ నగదు లావాదేవీల మాటేంటి? ఏయే అకౌంట్ల ద్వారా లావాదేవీలు నడిచాయి?
⇒ ఒక్క రోజే రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యం దొరికిందంటే ఇన్నాళ్లూ సరఫరా చేసిన మద్యం విలువ ఎంత?
⇒ ఏయే ఊళ్లలోని ఏయే దుకాణాలకు నకిలీ మద్యం సరఫరా చేశారు?
⇒ ప్రముఖ బ్రాండ్లకు సంబంధించి నకిలీ మద్యం ఆర్డర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి?
⇒ నకిలీ మద్యం తయారీకి సంబంధించి ముడి సరుకులు ఎక్కడి నుంచి తెచ్చారు?
⇒ లేబుళ్లు, సీసాలు, మూతలు, స్పిరిట్, ఫ్లేవర్లు, భారీ యంత్రాలతో కూడిన ప్లాంట్‌ను నడపడం కేసులో చూపుతున్న నిందితులకు సాధ్యమా?
⇒ చిన్న చిన్న బడ్డీ కొట్లను సైతం వదలకుండా మామూళ్లు దండుకునే ప్రజా ప్రతినిధులకు ఇంత భారీ ప్లాంట్ గురించి తెలియదంటే ఎవరు నమ్ముతారు?
⇒ ఈ కేంద్రాన్ని విజయవాడకు చెందిన జనార్దనరావు అనే వ్యక్తి చూస్తుంటాడని.. అంతా అతనిపైకి నెట్టేయడం ఎంత వరకు సమంజసం?
⇒ అధికార పార్టీ నేతల అండ దండలు లేకుండా స్థానికేతరుడు ఇంత భారీ నకిలీ మద్యం ప్లాంట్‌ను నడపగలడా?
⇒ రోజుకు 20వేలకు పైగా 180 ఎంఎల్ బాటిళ్ల మద్యం తయారు చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ నుంచి ఇప్పటి వరకు ఎంత సరుకు విక్రయించారు?
⇒ ఒడిశా, తమిళనాడు నుంచి వచ్చిన తొమ్మిది మంది కూలీలపై కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం సబబా?
⇒ పెద్దలంతా తప్పించుకుని ఒక్క కట్టా సురేంద్ర నాయుడిని మాత్రమే బలి పశువును చేస్తున్నారని నిలదీస్తున్న ఓ సామాజిక వర్గీయుల ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు?
నకిలీ మద్యం ప్లాంట్ కేసులో పది మంది అరెస్ట్
ములకలచెరువు: అన్నమయ్య జిల్లా ములకలచెరువు పాత హైవే సమీపంలో బట్టబయలైన నకిలీ మద్యం తయారీ కేంద్రం కేసులో 14 మందిపై కేసు నమోదు చేసి, 10 మందిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజ్ తెలిపారు. స్థానిక ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఆయన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో జనార్దనరావు, కట్టా రాజు, పి.రాజేష్, కొడాలి శ్రీనివాసరావు, నాగరాజు, హాజీ, బాలరాజు, మణిమారన్, ఆనందన్, సూర్య, వెంకటేషన్ సురేష్, మిథున్, అనంతదాస్, కట్టా సురేంద్ర నాయుడుపై కేసు నమోదు చేశారు.
వీరిలో జనార్దనరావు, పి.రాజేష్, కట్టా రాజు, కొడాలి శ్రీనివాసులు పరారీలో ఉన్నారు. వీరి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. మిగతా వారిని అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం తయారీ కేంద్రం నుంచి ఎస్‌ఎస్ ట్యాంకు, డిస్టలరీ వాటర్ ట్యాంకు, బాటిళ్లకు మూతలు బిగించే 3 యంత్రాలు, మూడు వాహనాలు, ఎలక్ట్రికల్ మోటార్, 1,050 లీటర్ల స్పిరిట్, బాటిలింగ్‌కు సిద్ధంగా ఉన్న 1,470 లీటర్ల మద్యం, 20,208 బాటిళ్ల మద్యం, 12 వేల ఖాళీ బాటిళ్లు, వేలాది మూతలు, 70 క్యాన్లు, రాయల్ లాన్సర్ లేబుళ్లు 10,800, ఓల్డ్ అడ్మిరల్ లేబుళ్లు 1200, 4 వేల రోల్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వీటి విలువ రూ.1.75 కోట్లని చెప్పారు.