
సోషల్ మీడియాలో పోస్టు పెడితేనే అరెస్టు చేస్తారా!?
వైఎస్సార్ కడప జిల్లా మూడో అదనపు మేజిస్ట్రేట్ ఆగ్రహం
వెంటనే 41ఏ నోటీసులిచ్చి విడుదల చేయాలని ఆదేశం
కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డికి సంబంధించిన పోస్టును షేర్ చేశారని మాజీ డిప్యూటీ సీఎం పీఏ అరెస్టు
వెంటనే అతన్ని విడుదల చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశం.. విడుదల
కడప అర్బన్: ‘పోలీస్‌స్టేషన్‌లోనే బెయిల్ ఇవ్వాల్సిన కేసులో రిమాండ్ కోరతారా? వెంటనే నిందితునికి 41ఏ నోటీసులిచ్చి విడుదల చేయాల’ని కడప వన్‌టౌన్ పోలీసులపై వైఎస్సార్ కడప జిల్లా మూడో అదనపు మేజిస్ట్రేట్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం సామాజిక మాధ్యమంలో ఒక పోస్టును షేర్ చేస్తేనే అరెస్టుచేసి రిమాండ్‌కు పెడతారా అని ఆమె ప్రశ్నించారు. వివరాలివీ.. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీరును నిరసిస్తూ టీడీపీ సీనియర్ మహిళలు 2024 ఎన్నికల్లో మూసాపేట సర్కిల్‌లో ఆందోళన చేపట్టారు.
ఈ ఆందోళన వీడియోలను అంజద్ బాషా పీఏ ఖాజా ఇటీవల షేర్ చేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో సెప్టెంబరు 29న పోలీసులు ఖాజాపై కేసు నమోదు చేశారు. ఈనెల 1న హైదరాబాద్‌లో ఖాజాను పోలీసులు అరెస్టుచేసి కడపకు తీసుకొచ్చారు. రిమాండ్ నిమిత్తం గురువారం మధ్యాహ్నం కోర్టులో ఖాజాను హాజరుపరిచారు. అయితే, పోలీసుల అక్రమ అరెస్టుపై కడప జిల్లా మూడో అదనపు మేజిస్ట్రేట్ విజయలక్ష్మి మండిపడ్డారు.
స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులో రిమాండ్ కోరడం ఏమిటని ప్రశ్నించారు. కేవలం సోషల్ మీడియా పోస్ట్ షేర్‌చేస్తేనే రిమాండ్‌కి పెడతారా అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. 41ఏ నోటీసులిచ్చి వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. మేజిస్ట్రేట్ ఆదేశాలతో అంజాద్ బాషా పీఏ ఖాజాను పోలీసులు గురువారం సాయంత్రం విడుదల చేశారు.