టమాట.. రైతుకు ఊరట
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 6 వేల ఎకరాలలో టమాట సాగైందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఎక్కువగా ఛాంపియన్ సాగు వంటి రకాలను సాగు చేస్తున్నారు. జిల్లాలో పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాలలో అత్యధికంగా సాగైంది. అక్టోబరులో సాగు ప్రారంభించారు. ప్రస్తుతం కాయల కోతలు ప్రారంభమయ్యాయి. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సాగు తగ్గిందని ఉద్యాన శాఖ అధికారులు అంటున్నారు. ఏడాది కాలంగా స్థిరమైన ధరలు లేకపోవడం, సాగులో నష్టాలు రావడంతో.. పంట విస్తీర్ణం తగ్గిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వేముల: ఈ ఏడాది రబీలో టమాట సాగు.. రైతులకు కలిసొచ్చింది. ఖరీఫ్‌లో ధరల్లేక నష్టాలు చవి చూశారు. అప్పుడు నష్టపోయిన రైతులు రబీలో అయినా లాభాలు గడిద్దామని సాగు చేశారు. దిగుబడులు వచ్చే సమయానికి ధరలు పెరగడంతో రైతులకు ఊరట కలుగుతోంది. పది రోజులుగా మార్కెట్‌లో ధరలు నిలకడగా ఉంటున్నాయి. ప్రస్తుతం తోటలలో కాయలు కోతకు వస్తున్నాయి. దిగుబడులు పూర్తయ్యే వరకు ఈ ధరలు ఉంటే ఆదాయం ఉంటుందని రైతులు అంటున్నారు.
ఎకరాకు రూ.50 వేలకు పైనే పెట్టుబడి: ఉద్యాన పంటలలో అధిక పెట్టుబడులతో కూడుకున్నది టమాట. పంట కాల పరిమితి నాలుగు నెలలు. ముద్దనూరు, ముదిగుబ్బ, కదిరి తదితర ప్రాంతాల్లోని నర్సరీల నుంచి మొక్కలు తెచ్చు కుని సాగు చేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఒక్కో మొక్కకు 40 నుంచి 90 పైసల వరకు చెల్లించాలి. ఎకరాకు 12 నుంచి 14 వేల మొక్కల వరకు నాటుతున్నారు. నాటినప్పటి నుంచి దిగుబడులు పూర్తయ్యేవరకు సంరక్షించుకోవాలి. చీడ పీడల నుంచి రక్షించుకునేందుకు వారానికొకసారి మందులు స్ప్రే చేస్తూ కాపాడుకుంటున్నారు. దీంతోనే టమాట సాగులో పెట్టుబడులు ఎక్కువగా అవుతున్నాయి.
సకాలంలో మందులు స్ప్రే చేసి..
ఈ ఏడాది టమాట సాగులో దిగుబడులు తగ్గుతున్నాయి. మొక్కలు నాటిన మొదలు నెల రోజులపాటు తుపాను ప్రభావంతో వర్షాలు కురిశాయి. వర్షాలతో తెగుళ్లు సోకాయి. సకాలంలో మందులు పిచికారి చేసి, పంటను కాపాడుకున్నారు. తర్వాత పూత దశలో ఉండగా వర్షాలతో దెబ్బతింది. వర్షాలకు పూత రాలిపోయింది. మందులు స్ప్రే చేశాక చిగుర్లు వేసి పూత రావడంతో తోటలలో దిగుబడులు అందుతున్నాయి. వర్షాలతో టమాటకు తెగుళ్లు సోకి పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ.. సకాలంలో మందులు స్ప్రే చేయడం వల్ల దిగుబడులు వస్తున్నాయని రైతులు అంటున్నారు.
10 రోజులుగా స్థిరంగా..
మార్కెట్‌లో టమాట ధరలు పెరిగాయి. 10 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. బయటి మార్కెట్‌కు 20 కిలోల బాక్సు రూ.900లతో కొనుగోలు చేస్తున్నారు. ధరలు ఉండటంతో వ్యాపారులు తోట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా మదనపల్లె, చైన్నె, కావలి తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తోటలలో ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమయ్యాయి. రైతులు కూడా మార్కెట్ సమాచారం తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా తోటలలో కోతలు కోస్తున్నారు. వ్యాపారులు వస్తే బాక్సుల ధర నిర్ణయించుకుని వారికి అమ్మి వేస్తున్నారు. తోటల వద్దకు వ్యాపారులు రావడంతో రైతులకు రవాణా భారం తగ్గింది.
పెరిగిన ధరలు
వర్షాలతో తగ్గుతున్న దిగుబడి
రేటు నిలకడగా ఉంటే ఆదాయమే
5 ఎకరాలలో సాగు చేశా
నాకున్న 5 ఎకరాలలో టమాట సాగు చేశా. ఎకరాకు రూ.50 వేలకు పైనే పెట్టుబడులు పెట్టా. దిగుబడులు వస్తున్నాయి. మార్కెట్‌లో ధరలు ఉండటంతో వ్యాపారులు తోట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దిగుబడులు పూర్తయ్యేవరకు ఇదే ధరలు ఉంటే ఆదాయం బాగుంటుంది. – రామసుబ్బారెడ్డి, రైతు, వేముల
టమాట ధరలు మార్కెట్‌లో నిలకడగా ఉంటే ఆదాయం ఉంటుందని రైతులు అంటున్నారు. టమాట సాగు పెట్టు బడులతో కూడకున్నప్పటికీ దిగుబడులు ఉండి ధరలు ఉన్నట్లయితే ఆదాయం ఉంటుంది. దీంతోనే రైతులు ఈ పంట సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలు దిగుబడులు పూర్తయ్యే వరకు ఉంటే.. ఎకరాకు రూ.2 లక్షల మేర ఆదాయం ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది ఎకరాకు 400 బాక్సులకు మించి దిగుబడులు ఉండే పరిస్థితి లేదని, ధరలు ఉండటంతోనే ఆదా యం వస్తుందనే ఆశతో ఉన్నామని వారు అంటున్నారు.
సాగు విస్తీర్ణం తగ్గడంతోనే ధరలు
ఈ ఏడాది టమాట సాగు విస్తీర్ణం తగ్గింది. తుపాను వర్షాలు పడటంతో తోటలు దెబ్బతిన్నాయి. మార్కెట్‌కు సరఫరా లేకపోవడంతోనే ధరలు పెరిగాయి. మార్కెట్‌లో ఇదే ధరలు ఉంటాయనే సమాచారం ఉంది. – రాఘవేంద్రారెడ్డి, ఉద్యాన శాఖాధికారి, పులివెందుల
టమాట.. రైతుకు ఊరట


