టీడీపీ నాయకుల దౌర్జన్యం
పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో
చికిత్స పొందుతున్న ఈశ్వరరెడ్డి
హిరోజ్‌పురం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను
పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు
లింగాల: వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం ఇప్పట్ల గ్రామ పంచాయతీలోని హిరోజ్‌పురం గ్రామంలో శుక్రవారం పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ వర్గీయులు చేసిన ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు ఈశ్వరరెడ్డి గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గతంలో రీసర్వే నిర్వహించిన భూములకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలను రెవెన్యూ అధికారులు పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇప్పట్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఓబుళరెడ్డి, మనోహర్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకుడు ఈశ్వరరెడ్డి హిరోజ్‌పురం గ్రామానికి, ఇప్పట్ల గ్రామానికి ఏమి సంబంధం, మీరు హిరోజ్‌పురం గ్రామానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించాడు. గతంలో తన భార్య పేరుపైన రెండు ఎకరాల పట్టా భూమి ఉందని, అయితే రీసర్వేలో 1.50ఎకరాల తొలగించారని, తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అడిగేందుకు కూడా వీలు లేకుండా చేస్తున్నారని టీడీపీ నాయకులను ప్రశ్నించడంతో వారు ఈశ్వర్‌రెడ్డిపై దాడి చేసి గాయపరిచారు. కాళ్లతో తన్నారు. గాయపడిన ఈశ్వరరెడ్డిని వెంటనే పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్ సీఐ ఎన్వీ రమణ, లింగాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించారు. దీనిపై విచారణ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు.
పట్టాదారు పాసు పుస్తకాలపంపిణీలో ఘర్షణ
వైఎస్సార్‌సీపీ నాయకుడికి గాయాలు
ఆసుపత్రికి తరలింపు
టీడీపీ నాయకుల దౌర్జన్యం


