కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభం
కడప సెవెన్‌రోడ్స్: రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం జిల్లాలో శుక్రవారం ప్రారంభమైంది. ఈనెల 9వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్లలో మొదటి విడత రీ సర్వే పూర్తయిన 260 గ్రామాల్లోని రైతులకు 72,288 పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరయ్యాయి. గ్రామ సభలు నిర్వహించి వీటిని పంపిణీ చేస్తున్నారు. పట్టాదారు పేరు, తండ్రి పేరు, చిరునామా వంటి వ్యక్తిగత వివరాలు పాసు పుస్తకాల్లో పొందుపరిచారు. అలాగే సర్వే నంబరు, భూమి విస్తీర్ణం భూమి రకం వంటి వివరాలు ఉన్నాయి. ముఖ్యంగా పట్టాదారు పాసుపుస్తకంపై రాజముద్ర, క్యూఆర్ కోడ్, తహసీల్దార్ డిజిటల్ సంతకం, భూమి యాజమాన్యంపై స్పష్టత, ఫొటోగ్రాఫ్, వేలిముద్ర ధృవీకరణ సౌకర్యం, ఆధార్–మొబైల్ అనుసంధానం, ఈ–కేవైసీ వంటివి ఉంటాయి. పాసు పుస్తకాలు పంపిణీ చేసే ముందు వెబ్‌ల్యాండ్ వివరాలతో సరిపోల్చుతారు. ఏవైనా చిన్నచిన్న తప్పిదాలు దొర్లి ఉంటే అక్కడికక్కడ సవరణ చేసి పాసుపుస్తకాలు పంపిణీ చేస్తారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభం


