
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో ఈసీ గంగిరెడ్డి 5వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈసీ గంగిరెడ్డి ఘాట్ వద్ద ఆయన కుమార్తె వైఎస్ భారతిరెడ్డి, సతీమణి సుగుణమ్మ, కుమారుడు ఈసీ దినేష్ రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈసీ గంగిరెడ్డి వర్ధంతి సందర్భంగా భాకరాపురంలోని దినేష్ నర్సింగ్ హోమ్‌లో ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

పేదల డాక్టర్.. ఈసీ గంగిరెడ్డి
దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి పేదల డాక్టర్‌గా పులివెందుల ప్రాంతంలో గుర్తింపు పొందారు. ఆయన హస్తవాసి తగిలితే ఎంతటి రోగమైనా ఇట్టే నయమవుతుందని ఈ ప్రాంత వాసుల నమ్మకం. ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి చిన్నపిల్లల డాక్టర్‌గా ప్రాచుర్యం పొందారు. 1949 ఏప్రిల్ 20వ తేదీన ఈసీ సిద్ధారెడ్డి, తులశమ్మ దంపతులకు రెండవ సంతానంగా వేముల మండలంలోని గొల్లలగూడూరులో ఆయన జన్మించారు. తన విద్యాభ్యాసం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గొల్లలగూడూరు ఆర్‌సీఎం స్కూలు, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పులివెందులలోని జెడ్పీ హైస్కూలులోనూ, 9వ తరగతి నుంచి 11వ తరగతి వరకు వేముల జెడ్పీ హైస్కూలులోనూ, అనంతరం వైద్య విద్యను వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీలో పూర్తి చేశారు.
అనంతరం పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించారు. తర్వాత పులివెందులలోని శ్రీనివాసహాలు వీధిలో తన సతీమణి డాక్టర్ ఈసీ సుగుణమ్మతో కలిసి గంగిరెడ్డి ఆసుపత్రి స్థాపించి దంపతులిద్దరూ వైద్య సేవలు అందించేవారు. వైద్యం చేయడమే ప్రధాన ఆశయంగా ప్రతిఫలం ఆశించని డాక్టర్‌గా ఇక్కడ గుర్తింపు పొందారు.

ఎలాంటి రోగమైనా ఆయన దగ్గరకు వెళ్లి ఆయన చేయి పడితే నయమవుతుందని పులివెందుల ప్రాంత ప్రజల నమ్మకం. పులివెందుల ప్రాంత ప్రజలే కాకుండా జిల్లా నలుమూలల నుంచి పొరుగు జిల్లాలైన అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కూడా ఆయన వద్దకు వచ్చి రోగులు వైద్య సేవలు పొందేవారు. వైద్య సేవలలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన భాకరాపురంలో అత్యాధునిక వైద్య పరికరాలతో తన కుమారుడి పేరిట దినేష్ నర్సింగ్ హోం (ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి) స్థాపించి వైద్య సేవలు అందించేవారు. ఈసీ గంగిరెడ్డి కుమారుడు ఈసీ దినేష్‌రెడ్డి కూడా వైద్యునిగా సేవలు అందిస్తున్నారు. ఈసీ గంగిరెడ్డి తన దగ్గరకు వచ్చే రోగులపట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయతలను కనబరిచేవారు.
