వాటర్ గ్రిడ్ పనులను పూర్తి చేయాలి
కడప సెవెన్‌రోడ్స్: చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పులివెందుల నియోజకవర్గ గ్రామాలకు తాగునీరందించే వాటర్ గ్రిడ్ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత నీటిపారుదల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పులివెందుల వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై రెవెన్యూ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, సంబంధిత ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ ప్రాజెక్టు మేనేజర్‌లతో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలకు ఎలాంటి కొరత లేకుండా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పులివెందుల వాటర్ గ్రిడ్ పథకం ద్వారా తాగునీటి సదుపాయం కల్పించనున్నామన్నారు. అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నీటి కొరత లేకుండా ప్రణాళికలు రూపొందించి ప్రాజెక్టు పనులను కూడా పూర్తి చేసి నిర్వహణలోకి తీసుకురావడం జరిగిందన్నారు. కేంద్ర జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా.. రూ.480 కోట్ల వ్యయంతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా.. పులివెందుల నియోజకవర్గంలో 109 గ్రామ పంచాయతీలలోని 299 గ్రామాలలోని 5.36 లక్షల జనాభాతోపాటు 7 రకాలైన ప్రభుత్వ విద్యా సంస్థలకు అవసరమైన 135 ఎల్‌పీసీడీల నుంచి నీటిని నిరంతరాయంగా నీరు అందించే ఉద్దేశ్యంతో పులివెందుల వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. కాగా ఈ పనులను డిసెంబర్ మాసం చివరి నాటికి పూర్తి కావాల్సి ఉంది. ఇంకా కొద్దిమేర పెండింగ్‌లో ఉన్న ఫినిషింగ్ పనుల అసంపూర్తిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ నెల మొదటి వారంలో అసంపూర్తి పనులను తక్షణమే పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య, ఆర్ డబ్ల్యుఎస్ ఎస్‌ఈ ఏడుకొండలు, ఈఈ శ్రీనివాసులు, డీఈఈలు కిరణ్ కుమార్ రెడ్డి, అంజలీ దేవి, ఎంఈఐఎల్ ప్రాజెక్టు మేనేజర్ రవికుమార్, ఏఈఈలు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి


