
పేదలు టార్గెట్‌గా ఎన్ బ్రాండ్ నకిలీ మద్యం
పేద, మధ్యతరగతి ప్రాణాలకు ముప్పు
రాష్ట్రవ్యాప్తంగా లక్ష బెల్టు షాపులు
నకిలీ మద్యంపై రేపు మహిళలతో నిరసన ర్యాలీ
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు: ‘‘మూతలు, లేబుళ్లు ఒకే రకంగా ఉంటుండడంతో రాష్ట్రంలో అసలు మద్యం, నకిలీకి తేడా కనుక్కోలేని పరిస్థితి నెలకొంది. పేద, మధ్య తరగతి ప్రజలు తాగే క్వార్టర్ ధర రూ.99–రూ.130 మధ్య ఉన్న మద్యాన్ని నకిలీ చేస్తున్నారు. దీంతో వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లే. పేదలను టార్గెట్‌గా చేసుకుని వంద శాతం స్పిరిట్ ఉండే ఎన్ బ్రాండ్ మద్యాన్ని అన్ని షాపుల్లో అమ్ముతున్నారు. మద్యం నకిలీదా? కాదా? అని నిర్ధారిస్తే రూ.10 లక్షలు బహుమతిస్తా’’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు.
వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్వగృహంలో శనివారం ఆయన మాట్లాడారు. ‘‘రోజంతా కష్టం చేసేవారు సాయంత్రం బడలిక తీర్చుకునేందుకు తాగే మద్యం కూడా కూటమి నేతలు నకిలీది అమ్ముతున్నారు. ఇది విషంతో సమానం. ఏడాదిన్నరగా రోజూ పదుల సంఖ్యలో పేదలు చనిపోతున్నారు. ఇవేమీ ప్రభుత్వ రికార్డుల్లోకి చేరడం లేదు. కొందరి మానసిక పరిస్థితి దెబ్బతింటోంది. కిడ్నీ, లివర్ చెడిపోతున్నాయి.
రాత్రి నకిలీ మద్యం తాగినవారు పొద్దున కూలీ పనులకు వెళ్లలేకపోతున్నారు’’ అని పేర్కొన్నారు. పూర్ టు రిచ్ అన్న చంద్రబాబు నినాదం పూర్ టు శ్మశానం అయిందా? అని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పంటలకు యూరియా అధికంగా వాడితే క్యాన్సర్ వస్తుందని చంద్రబాబు చెబుతున్నారని ములకలచెరువు నకిలీ మద్యం తాగితే ఆరోగ్యం వస్తుందా? అని నిలదీశారు.
గ్రామాల్లో లక్ష బెల్టు షాపులు
టీడీపీ నాయకులు గ్రామాల్లో దాదాపు లక్ష బెల్టుషాపులు ఏర్పాటు చేశారని రాచమల్లు తెలిపారు. నకిలీ మద్యం కేసులో స్పిరిట్ సరఫరా చేసిన బెంగళూరుకు చెందిన బాలాజీని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. జయచంద్రారెడ్డి వెనుక కరకట్ట పెద్దలున్నారని, నకిలీ మద్యాన్ని చెక్‌పోస్టుల్లో పట్టుకోకపోవడానికి ఇదే కారణమని, కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నకిలీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ర్యాలీలు నిర్వహించి ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలని పార్టీ ఆదేశించినట్లు రాచమల్లు తెలిపారు. మహిళలతో కలిసి సోమవారం నిరసన ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు.