
గుట్టు రట్టవడంతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
తంబళ్లపల్లె టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వైఎస్సార్‌సీపీ కోవర్ట్ అని బుకాయింపు
ఈ వ్యవహారంపై ఇప్పటికీ నోరు మెదపని పెదబాబు, చినబాబు
దీన్ని డైవర్ట్ చేయడానికి ఎదురు దాడికి దిగండంటూ సూచన
సాక్షి, అమరావతి: కళ్లు చెదిరే రీతిలో టీడీపీ నేతల నేతృత్వంలో నకిలీ మద్యం రాకెట్ బట్టబయలవ్వడంతో దాన్ని తప్పుదోవ పట్టించేందుకు సీఎం చంద్రబాబు ఎప్పటి మాదిరిగానే డైవర్షన్ గేమ్ మొదలు పెట్టారు. ప్రస్తుతం మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లుగా వర్థిల్లుతున్న నకిలీ మద్యం బాగోతంపై సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు.
టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నకిలీ మద్యం యూనిట్ నడుస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులే బట్టబయలు చేసినా, దాంతో తమకు సంబంధం లేదని కొందరు టీడీపీ నేతలతో మాట్లాడిస్తుండటం నివ్వెరపోయేలా చేస్తోంది.
అంతటితో ఆగకుండా జయచంద్రారెడ్డి.. వైఎస్సార్‌సీపీ కోవర్ట్ అని, అందుకే టీడీపీలో చేరి నకిలీ మద్యం పరిశ్రమ నడిపి దాన్ని బయట పెట్టారనే అబద్ధపు వాదనను మొదలుపెట్టారు. రెండు రోజులుగా టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఎల్లో మీడియా ఇదే వాదనను జనంలోకి తీసుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.
ఆయన టీడీపీ నేత కాదా?
జయచంద్రారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యరి్థగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. తంబళ్లపల్లెలో అధికార పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే నడిపిస్తున్నారు. బదిలీలు, కాంట్రాక్టులు, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. లోకేశ్‌కు జయచంద్రారెడ్డి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన హవా నడుస్తోంది.
గత ఎన్నికల్లో శంకర్ యాదవ్ వంటి సీనియర్‌ను పక్కనపెట్టి మరీ ఆయనకు టికెట్ ఇవ్వడానికి లోకేశ్‌తో ఉన్న వ్యాపార ఒప్పందాలు, సాన్నిహిత్యమే కారణం. ఆ సంబంధాల నేపథ్యంలోనే ములకలచెరువు సమీపంలో భారీగా నకిలీ మద్యం తయారు చేసి.. వైన్ షాపులు, బెల్టు షాపులకు సరఫరా చేసే పరిశ్రమను ప్రారంభించినట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు. కట్టా సురేంద్రనాయుడు, ఆద్దేపల్లి జనార్దనరావు వంటి వారి ద్వారా నకిలీ మద్యం తయారీ, సరఫరా వ్యవహారాలను నడిపిస్తున్న విషయం బయటపడింది.
అన్ని ప్రాంతాల్లోనూ ఈ తరహా నకిలీ మద్యం తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసి దందా నడిపిస్తున్నట్లు ఆయా ప్రాంతాల్లో దొరుకుతున్న నకిలీ మద్యం డంపులే నిదర్శనం. టీడీపీ పెద్దల ప్రమేయం లేకుండా ఇంత వ్యవస్థీకృత దందా నిర్వహించడం అసాధ్యమని ఎన్నో ఏళ్లుగా లిక్కర్ వ్యాపారం చేస్తున్న వారు చెబుతున్నారు. వారి అండదండలు ఉండబట్టే ఏకంగా నకిలీ మద్యం కోసం పరిశ్రమను స్థాపించి, నకిలీ సరుకును అన్ని ప్రాంతాలకు.. కోరిన బ్రాండ్‌ల పేరుతో సరఫరా చేస్తున్నారు.
బాబు మార్కు డైవర్షన్
ఇదంతా టీడీపీయే చేస్తుందనే విషయం బయట పడడంతో చంద్రబాబు తన మార్కు యాక్షన్ ప్రారంభించారు. నకిలీ మద్యంపై తాను సీరియస్‌గా ఉన్నట్లు, ఎంతటి వారిపై అయినా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మీడియాకు లీకులిస్తున్నారు. అయినా నకిలీ మద్యం వ్యవహారం రాష్ట్రాన్ని షేక్ చేస్తుండడంతో తంబళ్లపల్లె పార్టీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి, స్థానిక నేత సురేంద్ర నాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు సోషల్ మీడియాలో జయచంద్రారెడ్డి వైఎస్సార్‌సీపీ కోవర్టు అనే ప్రచారాన్ని పెద్దఎత్తున చేయిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు సతీష్ రెడ్డి.. చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న నకిలీ మద్యం వ్యవహారంపై మాట్లాడుతూ ములకలచెరువు యూనిట్ ద్వారా ఐదేళ్లలో రూ.500 కోట్లను అక్రమంగా దండుకునేందుకు స్కెచ్ వేశారని చెబితే దాన్ని వక్రీకరించారు. ఈ దుష్ప్రచారాన్ని ఏకంగా టీడీప్టీ అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా చేయడాన్ని బట్టి వారు ఏ స్థాయికి దిగజారారో అర్థం చేసుకోవచ్చు.
గుట్టు రట్టవడంతో గప్‌చుప్
గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా రెప్పపాటు వ్యవధిలో స్పందించే చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్.. నకిలీ మద్యం వ్యవహారంపై మాత్రం ఇంత వరకు నోరు విప్పక పోవడం గమనార్హం. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం నకిలీ మద్యంతో తమకు సంబంధం లేదని ప్రకటించారు. అలాంటప్పుడు తంబళ్లపల్లె టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డిని ఎందుకు సస్పెండ్ చేసినట్లు? పట్టుబడుతున్న నకిలీ మద్యం బాటిళ్లు అన్నింటిలోనూ టీడీపీ ఆనవాళ్లే కనిపిస్తున్నాయి.
అనేక చోట్ల నకిలీ మద్యం బయట పడుతుండటంతో ఏం మాట్లాడాలో తెలియక టీడీపీ నేతలు మొత్తం సైలెంట్ అయిపోయారు. రెడ్‌హ్యాండెడ్‌గా టీడీపీయే ఈ దందా చేస్తున్నట్లు అందరికీ తెలిసి పోవడంతో దీనిపై మాట్లాడేందుకు ఆ పార్టీ నాయకులు ముందుకు రావడంలేదు. ఇప్పుడు అన్నిచోట్లా తాము తాగుతున్న మద్యం కూడా నకిలీయేనా అనే అనుమానం టీడీపీ నేతలు, కార్యకర్తలతోపాటు ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది.