
సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన ఉన్నతాధికారులు
ములకలచెరువు ఘటనలో 21 మంది నిందితులు
వీరిలో 12 మంది అరెస్ట్.. ఏ–1గా జనార్దన్‌రావు
ఇబ్రహీంపట్నంలోనూ తనిఖీలు.. నకిలీ మద్యం బాటిళ్లు స్వాధీనం
రాష్ట్రమంతటా నకిలీ మద్యం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సీఎం
మరణాలపై తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశం
వైఎస్సార్‌సీపీ నేతల రాజకీయ కుట్రలను భగ్నం చేయాలని మంత్రులకు సూచన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున నకిలీ లిక్కర్ తయారీ, సరఫరా, అమ్మకాలు నిజమేనని ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ నకిలీ రాకెట్ ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో తయారైన నకిలీ మద్యం పెద్ద సంఖ్యలో బెల్ట్ షాపులకు సరఫరా జరిగిందని వివరించారు.
ఆయా శాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో బుధవారం సీఎం నిర్వహించిన సమావేశంలో నకిలీ మద్యంకు సంబంధించిన అంశాలను వారు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లాలో కల్తీ లిక్కర్ వ్యవహారంలో తీసుకున్న చర్యలను, దర్యాప్తు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. ములకలచెరువు ఘటనలో 21 మందిని నిందితులుగా గుర్తించామని, ఇందులో ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశామని చెప్పారు. మిగతా నిందితులను త్వరలో అరెస్టు చేస్తామన్నారు.
ఎ1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్‌రావు లావాదేవీలు, వ్యాపారాలపై విచారణ జరపుతున్నామని తెలిపారు. ములకలచెరువు కేసు ఆధారంగా ఎనీ్టఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జనార్దన్‌రావుకు చెందిన బార్, వ్యాపారాలపై తనిఖీలు జరిపామని, కల్తీ మద్యం నిల్వలను గుర్తించామని చెప్పారు. ఆయన సోదరుడు జగన్‌మోహన్‌రావుతో కలిసి నకిలీ మద్యం తయారు చేసి సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించి 12 మందిని నిందితులుగా గుర్తించామని వివరించారు.
ఫేక్ ప్రచారంపై చర్యలు తీసుకోండి
అన్నమయ్య జిల్లాలో నకిలీ లిక్కర్ వ్యవహారంపై రాష్ట్రంలో రాజకీయ పక్షాలు తప్పుడు ప్రచారంతో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రం అంతటా కల్తీ లిక్కర్ అని తప్పుడు ప్రచారంతో ప్రజలను భయపెడుతున్నారని, ప్రతి నాలుగు బాటిల్స్‌లో ఒకటి నకిలీ ఉందని ఫేక్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. నకిలీ లిక్కర్‌తో ప్రాణాలు పోతున్నాయని ఫేక్ ప్రచారాలు మొదలు పెట్టిన విషయాన్ని మంత్రులు అర్థం చేసుకోవాలని.. వైఎస్సార్‌సీపీ నేతల రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేయాలని సూచించారు.
ఈ మరణాలపై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. మీడియా అయినా, సోషల్ మీడియా అయినా తప్పుడు ప్రచారం చేస్తే ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మంత్రులు కొల్లు రవీంద్ర, లోకేశ్ నేరుగా హాజరవ్వగా.. హోం మంత్రి సహా పలువురు మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.