
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌రెడ్డి
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రాయోజిత దందానే
సీఎం చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలి
సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా ములకలచెరువు వద్ద భారీగా పట్టుబడ్డ నకిలీ మద్యం తయారీ వెనుక ఉన్నది ముమ్మాటికీ ప్రభుత్వ పెద్దలేనని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రాయోజిత దందానేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక టీడీపీ నేత సురేంద్రనాయుడు పాత్రధారి మాత్రమేనని, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటపెట్టాలని.. సీఎం చంద్రబాబు ఈ దందాకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
నాణ్యమైన మద్యం అంటే ఇదేనా!?..
ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా హైవే పక్కనే ఓ పరిశ్రమను తలపించేలా నకలి మద్యాన్ని ఎలా తయారు చేయగలరు? ఈ ప్రభుత్వ పెద్దలు గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలేంటి? అధికారంలోకి వచ్చాక చేస్తున్న దుర్మార్గాలేంటి? నాణ్యమైన మద్యం అంటే ఇదేనా!? ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్‌తో రోజుకు 30 వేల క్వార్టర్ బాటిళ్లు తయారుచేసి, మద్యం షాపులకు, బెల్టు షాపులకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
పైగా.. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తే.. పెద్దఎత్తున లిక్కర్ స్కాం జరుగుతోందని కూటమి పార్టీలు, ఎల్లో మీడియా సంస్థలు దుష్ప్రచారం చేశాయి. మరి ఇవాళ ములకలచెరువులో భారీగా బయటపడ్డ నకిలీ మద్యం గురించి టీడీపీ కూటమి ప్రభుత్వం, ఈ ఎల్లో మీడియా ఏం సమాధానం చెబుతాయి? అప్పుడు మద్యం తాగినవాళ్లందరికీ లివర్లు, కిడ్నీలు పాడైపోయాయని అన్నారుగా.. ఇప్పుడు పాడవవా? ఇక నిన్న అరెస్టైన సురేంద్రనాయుడు ఏ నాయకుడికి ముడుపులిస్తే ఈ దందా జరుగుతుందో సమాధానం చెప్పాలి.
ములకలచెరువులోనే ఐదేళ్లలో రూ.500 కోట్ల దందా..
ఇదిలా ఉంటే.. ఈ నకిలీ మద్యంతో కూడిన క్వార్టర్ బాటిల్ తయారీకి రూ.8 లేదా రూ.9 ఖర్చవుతుంది. అదే బాటిల్‌ను బెల్టుషాపుల వారికి రూ.110కి అమ్మితే వాళ్లు రూ.130కి అమ్ముతున్నారు. అంటే ఒక్కో బాటిల్ మీద రూ.100 ఆదాయం వస్తోంది. ఒక్క ములకలచెరువులో ఒక రోజులో 30 వేల బాటిళ్ల నకిలీ మద్యం తయారవుతుండగా రూ.30 లక్షల అక్రమార్జన జరుగుతోంది. ఇలా ఏడాదికి రూ.100 కోట్లు, ఐదేళ్లలో రూ.500 కోట్లు దండుకుంటున్నారు. ఇలా రాష్ట్రంలో ఇంకెన్ని చోట్ల నకిలీ మద్యం తయారుచేస్తున్నారో ప్రజలకు తెలియాలి.